sanga reddy district
-
ఎంత పెద్ద చిలగడదుంపో..!
కోహీర్ (జహీరాబాద్): చిలగడ దుంప, రత్నపురిగడ్డ, మొర్రం గడ్డ ఇలా పలు పేర్లతో పిలిచే స్వీట్ పొటాటో సాధారణంగా 50 గ్రాముల నుంచి 250 గ్రాముల బరువు తూగుతుంది. ప్రత్యేక శ్రద్ధతో సాగు చేస్తే అరకిలో బరువు తూగే అవకాశముంది. అయితే సంగారెడ్డి జిల్లా కోహీర్కు చెందిన రైతు రాఘవేందర్‌రెడ్డి పొలంలో పండిన చిలగడ దుంప ఒకటి ఏకంగా 5 కిలోలకు పైగా బరువు తూగుతోంది. కోతకొచ్చిన పంటను వారం రోజుల కిందట రాఘవేందర్‌రెడ్డి నాగలి సాయంతో దున్నించారు. పొలంలో పండిన ఇతర చిలగడ దుంపలు అరకిలో కంటే తక్కువ బరువున్నాయని ఈ ఒక దుంప మాత్రం 5 కిలోలకు పైగా బరువు ఉందని తెలిపారు. (క్లిక్: ఈ-కేవైసీ నమోదులో కొత్త సమస్యలు..) -
నీలగిరి.. సాగుసిరి..
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం పంటల సాగులో నల్లగొండ(నీలగిరి) జిల్లా రికార్డు సృష్టించింది. ఏకంగా 11 లక్షల ఎకరాల్లో వివిధ పంటలను ఆ జిల్లా రైతాంగం సాగు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, గత ఏడాది కంటే దాదాపు 3 లక్షల ఎకరాలు అధికంగా ఈ సారి నల్లగొండలో భూమి సాగవడం గమనార్హం. పత్తి, వరి సాగులోనూ నల్లగొండ జిల్లానే అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం.. శుక్రవారం నాటికి రాష్ట్రంలోనే అత్యధిక సాగు నల్లగొండ జిల్లాలో జరగ్గా, తర్వాత 7.3 లక్షల ఎకరాలతో సంగారెడ్డి జిల్లా ఉంది. గత ఏడాది ఈ రెండు జిల్లాల్లోనే సాగు 5 లక్షల ఎకరాలు దాటింది. కానీ, ఈసారి ఎనిమిది జిల్లాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగయ్యాయి. నల్లగొండ, సంగారెడ్డితో పాటు నాగర్‌కర్నూలు, వికారాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక, రాష్ట్రంలోనే అత్యల్పంగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో ఈ సీజన్లో 21,622 ఎకరాల్లో పం టల సాగు జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఎక్కువే. ఈ జిల్లాలో గత ఏడాది కేవలం 13,096 ఎకరాల్లోనే సాగైంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలోపు ఎకరాల్లో సాగు జరిగిన జిల్లా ఇదొ క్కటే కావడం గమనార్హం. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.41 కోట్ల ఎకరాల్లో పంటల సాగు జరగ్గా, ఇందులో 1.31 కోట్ల ఎక రాల్లో సాధారణ, 9.68 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగయ్యాయని వెల్లడించింది. -
ఆదాయం తగ్గినా పథకాలు ఆగవు
సాక్షి, సంగారెడ్డి: లాక్డౌన్, కరోనా వైరస్ వ్యాప్తి వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ సంక్షేమ పథకాలు ఆగవని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి కలెక్టరేట్లోని ఆడిటోరియంలో, సదాశివపేట మున్సిపాలిటీలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, వీధి వ్యాపారులకు రుణాల అందజేత కార్యక్రమాలలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిందని, అయినప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతినెలా రూ. వెయ్యి కోట్లు ఆసరా పింఛన్ల కోసం నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు. అదే విధంగా పంట పెట్టుబడి సాయం కింద రైతుబంధుకు ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,400 కోట్లు అందించామని వివరించారు. కరోనాతో అన్ని వ్యాపారాలు చాలా వరకు దెబ్బతిన్నాయని, వీధి వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందువల్ల వారు తిరిగి వ్యాపారాలు చేసుకోవడానికి మున్సిపాలిటీల వారీగా అర్హులను గుర్తించి ఒక్కొక్కరికీ తక్కువ వడ్డీతో రూ.10 వేలు అందజేస్తున్నామని చెప్పారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమం కొనసాగుతోందని మంత్రి స్పష్టం చేశారు. ‘టెస్ట్ అండ్ ట్రీట్’ కరోనా వైరస్‌తో ఎవరూ భయపడవద్దని, లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా పరీక్షలు చేసుకోవచ్చునని హరీశ్ సూచించారు. పీహెచ్సీలలో సైతం పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వైరస్ గురించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాల మీదకు వస్తుందన్నారు. టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ పద్ధతిలో కరోనా విషయంలో అన్ని సౌకర్యాలు ఆసుపత్రులలో ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. -
హెల్త్‌కేర్ కంపెనీలకు లిథియం బ్యాటరీలు
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డిటౌన్: దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిపై పోరు సాగిస్తున్న హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీలకు ఐఐటీ హైదరాబాద్‌లో పురుడు పోసుకున్న ‘ప్యూర్ ఈవీ’స్టార్టప్ కంపెనీ లిథియం బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఈ బ్యాటరీలను వెంటిలేటర్లు, రోబోటిక్ శానిటరీ పరికరాల్లో ఉపయోగిస్తారు. లిథియం బ్యాటరీల ఉపయోగాపై ‘ప్యూర్ ఈవీ’కొంతకాలంగా పరిశోధలను చేస్తోంది. ఇప్పటికే ఈ స్టార్టప్ తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్ వాహనాల్లో లిథియం బ్యాటరీలను ఉపయోగిస్తోంది. తేలికగా ఉండే లిథియం బ్యాటరీలను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే వీలుండటంతో పాటు ఎక్కువసేపు పనిచేస్తాయి. వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే ఈ బ్యాటరీలు ఇతర బ్యాటరీలతో పోలిస్తే అత్యంత మెరుగైనవి. జీవన్‌లైట్‌లో లిథియం బ్యాటరీలు ఐఐటీ హైదరాబాద్ అనుబంధ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంట్రప్రెన్యూర్షిప్ (సీఎఫ్హెచ్ఈ)కు చెందిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ అత్యవసర సమయాల్లో ఉపయోగించే ‘జీవన్ లైట్’అనే వెంటిలేటర్‌ను తయారుచేసింది. తక్కువ ధరలో లభించే ఈ వెంటిలేటర్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. జీవన్‌లైట్ వెంటిలేటర్లోనూ ప్యూర్ ఈవీ రూపొందించిన లిథియం బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఎమర్జింగ్ ఐటీ టెక్నాలజీ ద్వారా ఫోన్ యాప్ ద్వారా జీవన్‌లైట్‌ను ఆపరేట్ చేయొచ్చు. జేసీబీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం జీవన్‌లైట్ వెంటిలేటర్లను పెద్దసంఖ్యలో తయారుచేస్తోంది. కాగా రోబోటిక్ హెల్త్‌కేర్ టెక్ డివైజెస్‌ను తయారుచేస్తున్న ఓ ప్రైవేటు సంస్థకు కూడా ప్యూర్ ఈవీ లిథియం బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఐఐటీ హైదరాబాద్ స్టార్టప్ ప్యూర్ ఈవీ లిథియం బ్యాటరీలు అత్యంత నాణ్యత కలిగినవని మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ నిశాంత్ దొంగరి వెల్లడించారు. -
‘హరీశ్‌రావుకు పిల్ల చేష్టలు పోలేదు’
సాక్షి, సంగారెడ్డి: ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి పోతుందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాసుపత్రులపై ప్రజలకు విశ్వాసం కలిగించాలని కోరారు. ‘‘సంగారెడ్డికి వచ్చి కలెక్టర్ కార్యాలయంలో సమీక్షలు పెట్టడం కాదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమావేశాలు నిర్వహించి నమ్మకం కలిగించాలని’’ హరీశ్‌రావును ఉద్దేశించి అన్నారు. ‘‘కరోనా పేరు మీద సంగారెడ్డికి వచ్చి కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఇలా చేయడం సిగ్గుగా లేదా.. హరీశ్‌రావుకు ఇంకా చిన్న పిల్లల చేష్టలు పోలేదంటూ’’ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. -
పారిశుధ్యం నిరంతరం కొనసాగాలి
సాక్షి, సంగారెడ్డి/సాక్షి, కామారెడ్డి/సాక్షి, వికారాబాద్: పారిశుధ్యం, పచ్చదనం కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ఈ నెల 1 నుంచి పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లా ల్లో గ్రామాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ ఎలా ఉందో ప్రత్యక్షంగా చూడడానికి అధికారులకు సమాచారం లేకుండా ఆకస్మికంగా వచ్చానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం లోని ఎద్దుమైలారం, కొండాపూర్ మండలంలోని గుంతపల్లి గ్రామాల తనిఖీ సందర్భం గా మాట్లాడుతూ..జిల్లాలో రెండు గ్రామాలను పరిశీలిస్తే పారిశుధ్య కార్యక్రమాలు బాగా చేసినట్లు ఉందన్నారు. గ్రామ పంచాయతీకో ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను రాష్ట్ర వ్యాప్తం గా ఇవ్వడం ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. త్వరలో హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుందని, మొక్కలను విరివిగా నాటా లని, ప్రతి గ్రామంలో ఓ నర్సరీ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెలా రూ.380 కోట్లు.. కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి, కామారెడ్డి మండలంలోని గుర్గుల్ గ్రామాల్లో తనిఖీల సందర్శంగా సీఎస్ మాట్లాడుతూ, గ్రామాల్లో మొదటి, రెండో దశల్లో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా రూ.380 కోట్లు మంజూరు చేస్తోందన్నారు. వికారాబాద్ జిల్లా పెండ్లిమడుగు, దాతాపూర్ గ్రామాల్లో తనిఖీ పూర్తయిన అనంతరం మాట్లాడుతూ, ఆకస్మిక తనిఖీ తనకు సంతృప్తి నిచ్చిందన్నారు. కామారెడ్డి జిల్లాలో వైకుంఠధామాల్లో బాడీ ఫ్రీజర్లు ఉంచాలన్న ఆలో చన నచ్చిందని, వికారాబాద్‌లో నర్సరీలు బాగున్నాయని చెప్పారు. త్వరలోనే రైతుల ద్వారా ఆగ్రోఫారెస్టీ విధానం అమలులోకి తెస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ఆ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. -
కష్టకాలంలో కేంద్రం స్పందన ఇలాగేనా?
సాక్షి, సంగారెడ్డి: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కష్టకాలంలో ఉన్న పేదలను ఆదుకోవడానికి రాష్ట్రాలకు సహాయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం ఆయన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు, జానపద కళాకారులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. తర్వాత పరిశ్రమల యాజమాన్యాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రం కష్టకాలంలోనూ పేదలను ఆదుకోవడం లేదని ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహాయం చేయడంలో ఆంక్షలు విధిస్తున్నదని ఆరోపించారు. అప్పులు తీసుకోవడానికి పలు రకాల షరతులు విధించడం సరికాదన్నారు. ఈ కష్టకాలంలో షరతులు ఎలా పెడతారని ప్రశ్నించారు. కేంద్రం పేదలకు కేవలం 5 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకున్న దని దుయ్యబట్టారు. ఆర్థిక వ్యవస్థలో మా ర్పు రావాల్సిన అవసరం ఉందని ఆయ న అన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని లాక్డౌన్ సమ యం లో ఒక్కొక్కరికి 12 కిలోల ఉచిత బియ్యం, రూ.1,500 ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రూ.2,500 కోట్లను రెండు దఫాలుగా పంపిణీ చేశామన్నారు. వైజాగ్ గ్యాస్ లీకేజీ లాంటి ఘటనలు జిల్లాలో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పరిశ్రమల యాజమాన్యాలు, సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు 24 గంట ల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని పేర్కొన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా పాల్గొన్నారు. -
పాకెట్ మనీ కరోనా బాధితుల కోసం..
సంగారెడ్డి అర్బన్: కరోనా బాధితులకు తన వంతు సహాయంగా చిన్నారి పెద్ద మనస్సుతో కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.3,826 సీఎం సహాయ నిధికి అందజేసింది. ఆదివారం సంగారెడ్డిలో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీశ్‌రావును సంగారెడ్డికి చెందిన సాయినాథ్, స్వాతి దంపతుల కూతురు శ్రీముఖి కలిశారు. 11 నెలలుగా తాను దాచుకున్న డబ్బులను అందజేయడంతో చిన్నారి ఔదార్యాన్ని అందరూ మెచ్చుకున్నారు. కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శం కరోనా కట్టడిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం గా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బసవేశ్వర 887వ జయంతి సందర్భంగా జిల్లా వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు దుస్తులు పం పిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సేవలను సీఎం కేసీఆర్ గుర్తించారని తెలిపారు. కరోనా కట్టడికి వైద్యులు, పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని కోరారు. ఆపద సమయంలో ప్రతి ఒక్కరికీ 12 కిలోల బియ్యం, 74 లక్షల మందికి రూ.1500 చొప్పున అందజేసినట్లు తెలిపారు. అకౌంట్లు లేని 6 లక్షల మందికి పోస్టాఫీసుల ద్వారా డబ్బులు అందచేస్తామని హరీశ్ చెప్పారు. -
దేశ భవితకు ఆవిష్కరణలు అవసరం
సాక్షి, సంగారెడ్డి: సామాజిక అవసరాలకు అనుగుణంగా ఐఐటీ విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీహెచ్‌ను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఏ వ్యక్తికైనా దేశం, ప్రజలే ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు. ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధంగా మెలగాలని సూచించారు. ఫస్ట్ నేషన్.. నెక్ట్స్ ఫ్యామిలీయని, అదేవిధంగా జాతి మొదటి దని, స్వార్థం చివరిది అనే భావన ప్రతి వ్యక్తిలో ఉన్నప్పుడే దేశం కోసం ఏదైనా చేయాలనే ఆకాంక్ష ఏర్పడుతుందన్నారు. ఐ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగి స్తోందన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలని, ఇందుకు ని రంతరం యోగా సాధన చేయాలన్నారు. టిబెట్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఉద్యోగాలను యాచించొద్దు.. కల్పించాలి: ఐఐటీల్లో చదివి బయటకు వచ్చిన విద్యార్థులు ఉద్యోగాల కోసం యాచించవద్దని, వారే పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని బండారు దత్తాత్రేయ సూచించారు. 2030 నాటికి భారతదేశంలో 65 శాతం యువత ఉంటోందని తెలిపారు. ఇది ప్ర పంచ దేశాలన్నింటిలోకి మన దేశం చేసుకున్న అదృష్టమన్నా రు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల ఉద్యోగాల కల్పన ఉంటే.. వీటిలో 1.5 కోట్ల ఉద్యోగాలు భారత్‌లోనే లభిస్తాయని చెప్పారు. తాను మొదటగా సామాజిక సేవా కార్యకర్తనని.. ఆ తర్వాతే రాజకీయ నాయకుడినని చెప్పారు. పలువురు విద్యార్థులు సీఏఏ, ఎన్పీఆర్, రాజకీయాలపై ప్రశ్నలు అడగగా.. తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందు వల్ల అవి మాట్లాడటం తగదని తిరస్కరించారు. సమావేశంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మరో ‘దిశ’ ఘటన.. బాలికపై దారుణం
సాక్షి, సంగారెడ్డి : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన మరవక ముందే మరో అత్యాచార ఘటన చేటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వాణినగర్‌లో 16 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లిన ఆగంతకులు అత్యంత దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ మేరకు బాధితురాలు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంత కాలంగా సదరు బాలిక తల్లిందుడ్రులు అమీన్‌పూర్‌లోని ఓ అపార్టుమెంట్లో సెక్యూరిటీ సిబ్బందిగా పని చేస్తున్నారు. అయితే గురువారం మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి షాప్‌కి వెళ్లిన బాలికను ముగ్గురు ఆగంతకులు కారులో వచ్చి సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద అడ్డగించారు. అనంతరం నోరు మూసి కారులో బలవంతంగా లాక్కెళ్లి.. దారుణానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్నారు. బాలికకు సంబంధించిన కొన్ని వస్తువులను సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో మద్యం బాటిల్స్ కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. -
ప్రజాస్వామ్యం అంటే ఏంటి?
న్యాల్కల్ (జహీరాబాద్): రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మరోసారి టీచర్ అవతారమెత్తారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. వారు సరైన సమాధానాలు చెప్పకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని హద్నూర్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల అదనపు తరగతి గదులు, డప్నూర్లో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాలను ఆయన ప్రారంభించారు. అనంతరం కళాశాల విద్యార్థులను పిలిచి 10వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? ఇంటర్లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారు? ప్రజాస్వామ్యం అంటే ఏంటి? తెలంగాణ ఎప్పుడు ఏర్పడింది? రాష్ట్ర అసెంబ్లీలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారు? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోటి రూపాయలకు పైగా నిధులు వెచ్చించి ప్రభుత్వం కళాశాల భవనాన్ని నిర్మించిందని, కాని విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని, నాణ్యమైన విద్యనందించాలని అధ్యాపకులను కోరారు. ఎంత ఖర్చయినా చదివిస్తా: ఓ విద్యార్థిని చదువుకోసం ఎంత ఖర్చయినా తానే భరిస్తానని హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. గంగోత్రి అనే విద్యార్థిని మంత్రి వద్దకు వెళ్లి ‘మాది బీద కుటుంబం, మా అమ్మ ఆరోగ్యం బాగా లేదు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం. నేను చదువుకుంటానో లేదో’ అని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో చలించిపోయిన ఆయన ‘నీవు ఎక్కడ చదువుకుంటావు.. చెప్పు! పూర్తి ఖర్చును నేనే భరిస్తాను’అని హామీ ఇచ్చారు. -
మినిస్టర్ మాస్టారు!
సంగారెడ్డి రూరల్: ప్రభుత్వ, రాజకీయ కార్యకలాపాలతో నిత్యం తీరిక లేకుండా గడిపే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మాస్టారు అవతారం ఎత్తారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి.. మండల కేంద్రమైన కందిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్రం, గణితం తదితర సబ్జెక్టుల్లో పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి విషయ పరిజ్ఞానాన్ని పరిశీలిం చారు. ఎన్ని ఎక్కాలు వచ్చు.. అని అడిగి 17వ ఎక్కం చదవాలని సూచించారు. విద్యార్థులు ఎవరూ చెప్పలేకపోయారు. కనీసం 12, 13వ ఎక్కం చెప్పాలని అడిగినా చెప్పలేని విద్యార్థులు తమకు కేవలం పదవ ఎక్కం వరకు మాత్రమే వచ్చని తెలిపారు. తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో ఉపాధ్యాయుల పేర్లను రాయాలని మంత్రి అడగడంతో ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు మాత్రమే సక్రమంగా రాయగా, నలుగురు రాయలేకపోయారు. దీంతో మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే విద్యార్థులు ఎలా పాసవుతారని మంత్రి ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. అన్ని సబ్జెక్టుల్లో అవగాహన ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువులో వెనుకబడి ఉంటే ఉత్తీర్ణత సాధించడం కష్టంగా ఉంటుందన్నారు. ఇలాంటి చదువులతో పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తారని ప్రశ్నించారు. వెనుకబడిన టెన్త్ విద్యార్థులపై శ్రద్ధపెట్టి ప్రత్యేక తరగతులు నిర్వహించి, బాగా చదివించాలని టీచర్లను ఆదేశించారు. విద్యార్థులందరూ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దాలన్నా రు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. -
మహిళల అభివృద్ధికి మైక్రో క్రెడిట్ ప్లాన్
సాక్షి, సంగారెడ్డి: మహిళల అభివృద్ధి కోసం ‘మైక్రో క్రెడిట్ ప్లాన్’అమలు చేయనున్నట్లు ఆర్థికమంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో శనివారం ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా రుణమేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే దే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని చెప్పారు. మహిళలకు రుణాలివ్వడానికి మైక్రో క్రెడిట్ ప్లాన్ ను అమలు చేస్తామని తెలిపారు. వ్యాపారాలు చేసుకోవడానికి ఈ ప్లాన్ ద్వారా విరివిగా రుణాలివ్వనున్నట్లు పేర్కొన్నారు. కాగా, కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి చెప్పారు. గతంలో వీరికిచ్చే ప్రోత్సాహకం రూ.50 వేలు ఉండగా, ప్రస్తుతం దానిని రూ.లక్షకు పెంచామని తెలిపారు. వీరికి కల్యాణలక్ష్మి సైతం వర్తిస్తుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీలు ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళితే వారికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ మహిళల కోసం 35 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 500 పైగా గురుకులాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు, జెడ్పీ చైర్పర్సన్ పట్లోళ్ల మంజుశ్రీ, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె : బస్‌పాస్‌లతో లాభం ఉండదని..
జోగిపేట (అందోల్): సాయంత్రం 5 గంటలు.. సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రోజూ జోగిపేట వచ్చి ఖాదిరాబాద్‌కు వెళుతుంది. ఆ సమయంలో ఎక్కువగా విద్యార్థులే ఈ బస్సులో ప్రయాణం చేస్తుంటారు. సోమవారం కూడా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులంతా జోగిపేట బస్టాండ్‌లో ఈ బస్ కోసం వేచిచూస్తున్నారు. అయితే ఖాదిరాబాద్‌కు వెళ్లేందుకు చాలా మంది విద్యార్థులు అక్కడ వేచి ఉన్నట్లు దూరం నుంచే గమనించిన సంగారెడ్డి డిపో బస్ కండక్టర్, వెంటనే ఖాదిరాబాద్ అని ఉన్న బోర్డును తిప్పేసి, సంగారెడ్డి బోర్డు పెట్టి ప్రయాణికులను తీసుకొని బస్టాండ్ నుంచి సంగారెడ్డి రూట్లో బయలుదేరారు. దీంతో విద్యార్థులంతా వెంబడించి ఆ బస్సును అడ్డుకున్నారు. ‘ఖాదిరాబాద్ వెళ్లాల్సిన బస్సును సంగారెడ్డికి ఎందుకు తీసుకువెళుతున్నావ్’అంటూ కండక్టర్‌ను విద్యార్థులు నిలదీశారు. దీంతో రోడ్డుపై కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. బస్సును అరగంట సేపు నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. విద్యార్థుల బస్‌పాస్‌ల కారణంగా తమకు కలెక్షన్ రాదనే ఉద్దేశంతో బోర్డు తిప్పేసినట్లు పలువురు ఆరోపించారు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు దిగిపోవడంతో బస్సును తిప్పుకొని తిరిగి బస్టాండ్‌లోకి తీసుకువెళ్లారు. -
‘హరీశ్‌తో మాటల్లేవ్.. అయినా మాట్లాడాను’
సాక్షి, సంగారెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన ఇంటికే వచ్చి విన్నవించుకునేలా ఏర్పాట్లు చేశానని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బుధవారం దసరా వేడుకలలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నవంబర్ నుంచి సంగారెడ్డిలోని తన ఇంటి వద్ద ప్రజా దర్బార్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 14 ఏళ్లుగా తనకు సిద్దిపేట ఎమ్మెల్యే, ఆర్థిక మంత్రి హరీష్ రావుకు మాటలు లేకపోయినా ప్రజా సంక్షేమం కోసం మాట్లాడాల్సి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో ఐఐటీ తీసుకొచ్చానని, తాను పార్టీలకు తల వంచనని, ప్రజలకే తల వంచుతానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సంగారెడ్డి ప్రజల నీటి సమస్యను తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. అలా చేస్తే బతికినన్ని రోజులు కేసీఆర్‌కు రుణపడి ఉంటానని అన్నారు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత వారి ఫోటోలకు మొక్కితే లాభం లేదనీ, వారు బ్రతికుండగానే సేవ చేయాలని హితవు పలికారు. తన తల్లి ఎంతో కష్టపడి తనను జీవితంలో ఇంతవాణ్ని చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు తన తల్లి ఆరోగ్య పరిస్థితి బాగా లేని కారణంగా తన సతీమణి నిర్మల బాగోగులు చూసుకుంటుందని తెలిపారు. తనకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవనీ, కోట్లాది రూపాయల అప్పు ఉందనీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
ఆర్థికసాయం చేయండి
సాక్షి, కొండాపూర్(సంగారెడ్డి): ఆర్థికస్థోమత లేకపోయినా లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపడా ఆత్మవిశ్వాసం ఉంది. అందరిలో ఒకరిలా కాకుండా నాకంటూ ఏదైనా ప్రత్యేకత ఉండాలని అనుకున్నాడు పల్గటి శ్యామ్ ప్రసాద్ స్వేరో. 5వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం కొనసాగడంతో గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆలోచనలకు ఆకర్షితుడయ్యాడు. సాధించాలనే తపన, పట్టుదలతో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సలహాలు, సూచనల మేరకు భువనగిరిలోని రాక్ క్లైంబింగ్లో శిక్షణ పొందాడు. పల్గటి శ్యామ్ ప్రసాద్ స్వేరోది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామం. తండ్రి అశోక్, తల్లి కంసమ్మ రోజూ కూలీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శ్యామ్‌ప్రసాద్ ప్రాథమిక విద్యాబ్యాసం అనంతసాగర్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివాడు. అనంతరం రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరులోని తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. ఇంటర్మీడియెట్ విద్యాభ్యాసాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిండాడు. ప్రస్తుతం సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. 9వ తరగతి చదువుతున్న సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచనలతో పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులను హిమాలయ పర్వతాలను అధిరోహించేందుకు ఎంపిక చేశారు. అందులో శ్యామ్ ప్రసాద్ ఒకరు. దీనికోసం భువనగిరిలో కోచ్ శేఖర్‌బాబు వద్ద 15 రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. 2014లో 25 రోజుల పాటు 20 మంది విద్యార్థులతో కలిసి హిమాలయ పర్వతాన్ని అదిరోహించాడు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అదిరోహించిన మలావత్ పూర్ణ హిమాలయ పర్వతాలు అధిరోహించిన సభ్యుల్లో శ్యామ్‌ప్రసాద్ కూడా సభ్యుడిగా ఉన్నడు. దాతలు సహకరించాలి హిమాలయ పర్వతాలు అధిరోహించిన స్ఫూర్తితో ప్రపంచంలోనే రెండో ఎత్తైన సౌతాఫ్రికాలోని టాంజానియా కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి శ్యాం ప్రసాద్ ఎంపికయ్యాడు. కిలీమంజారో వెళ్లడానికి సుమారు రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తల్లిదండ్రులు కూలీలు కావడంతో వారికి అంత ఆర్థిక స్తోమత లేదు. ఈ నెల 25వ తేదీ వరకు చెల్లించాలి. లేకపోతే వచ్చిన అవకాశం చేజారిపోతుందని జిల్లా అధికారులు, ప్రజాప్రతినిదులు, వ్యాపార వేత్తలు స్పందించి సహకారం అందిస్తే జిల్లా పేరును ప్రపంచస్థాయిలో నిలబెడతానని విద్యార్థి శ్యాం ప్రసాద్ పేర్కంటున్నాడు. -
పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, సంగారెడ్డి: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2020 వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారి నుంచి పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ హనుమంతరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. గణతంత్రదినోత్సావాన్ని పురస్కరించుకొని అవార్డులు ఇస్తామన్నారు. చిత్రలేఖనం, సామాజిక, సేవ, ప్రజాసంబంధాలు, సైన్స్, ఇంజనీరింగ్, ట్రేడ్, అండ్ ఇండస్ట్రీ, మెడిసిన్, సాహిత్యం, విద్య, సివిల్‌సర్వీస్, క్రీడలు, తదితరరంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి పద్మ అవార్డుకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అవార్డుల కోసం ప్రతిపాదనలను ఈనెల 22 లోగా పంపించాలని సూచించారు. www.padmaawards.gov.in వెబ్సైట్లో పద్మ అవార్డుల కోసం గైడ్‌లైన్స్ చూడవచ్చని అన్నారు. ఈ అవార్డు కోసం జిల్లాకు చెందినవారై విశేష కృషి చేసిన ఆసక్తిగల వ్యక్తులు అవసరమైన పత్రాలను జతచేయాలన్నారు. హెచ్ఓడీలకు అందజేయాలని చెప్పారు. పరిశీలించి అర్హత కలిగిన దరఖాస్తులను ఎన్ఐసీ, డీఐఓ కార్యాలయంలో సంబంధిత వైబ్సైట్లో అప్లోడ్ చేయాలని తెలిపారు. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు వారి పరిదిలో ఆయా రంగాల్లో విశేష సేవలు అందించిన జిల్లాకు చెందిన వ్యక్తులను గుర్తించి దరఖాస్తులను వెబ్సైట్లో అప్లోడ్ చేయించాలన్నారు. -
లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల నీటిగోస తీర్చడానికి గోదావరి జలాలను తరలించే పనులు వెంటనే చేపట్టకపోతే వచ్చే నెల 10న జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ, అనంతరం ధర్నా చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటన చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరుకు ప్రధాన వనరులైన సింగూరు, మంజీరా డ్యాంలు ఎండిపోవడంతో నీటి కటకట ఏర్పడిందన్నారు. దీంతో ప్రజలు కనీసం తాగునీటికి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. సంగారెడ్డి, సదా శివపేట మున్సిపాలిటీలతో పాటుగా నియోజకవర్గంలోని మండలాల్లో ఏర్పడిన నీటి కొరతను తీర్చాలని గత రెండు, మూడు నెలలుగా ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులు సాగునీరు లేక, ప్రజలు తాగునీరు లేక అవస్థలు పడుతున్నారన్నారు. అందువల్ల తాను కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. పటాన్చెరు వరకు సరఫరా అవుతున్న గోదావరి జలాలను సంగారెడ్డి వరకు తరలిస్తామని ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వం, అధికారులు స్పష్ట ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు. అంతేకాకుండా ప్రకటన వెలువడిన వెంటనే పనులు కూడా ప్రారంభం కావాలన్నారు. లేకపోతే ఆగస్టు 10వ తేదీన స్థానిక అంబేడ్కర్ గ్రౌండ్లో లక్షమంది ప్రజలతో మొదటగా బహిరంగ సభ నిర్వహించి అనంతరం ధర్నాకు దిగుతున్నానని వెల్లడించారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. తనకు రాజకీయాల కంటే ప్రజల బాగోగులే ముఖ్యమని తెలిపారు. సింగూరు, మంజీరా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని ఇతర నియోజకవర్గాలకు తరలించి సంగారెడ్డి ప్రజల నీటి కష్టాలకు టీఆర్ఎస్ నేతలే బాధ్యులన్నారు. సంగారెడ్డి సమీపంలోని మహబూబ్‌సాగర్ చెరువును కాళేళ్వరం నీటితో నింపుతానని గతంలో నీటి పారుదల శాఖమంత్రిగా ఉన్న హరీష్‌రావు స్వయంగా ప్రకటించారనే విషయాన్ని గుర్తుచేశారు. 250 నుంచి 300 కిలోమీటర్ల దూరంలోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి తరలిస్తామన్న టీఆర్ఎస్ నేతలు గోదావరి జలాలు తేవడం సాధ్యమవుతుందనే భావిస్తున్నానని చెప్పారు. కర్ణాటకలో వరదలు వస్తేనే సింగూరు, మంజీరా నిండే దౌర్భాగ్య పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, గ్రామీణ నీటి సరఫరా, ఇరిగేషన్ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా... ఈ నెల 30లోగా నీటి తరలింపుపై ప్రకటన చేసి పనులు ప్రారంభించండి...లేదా వచ్చే నెల 10న లక్ష మందితో ధర్నా చేస్తానని తెలిపారు. -
బీమా.. ధీమా
సాక్షి, సంగారెడ్డి: ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ ప్రతికూల పరిస్థితులు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పంటల బీమాకు రైతుల నుంచి స్పందన కరువైంది. కొన్ని సంవత్సరాలుగా బీమా సదుపాయం కల్పిస్తున్నా రైతులు మాత్రం అతి తక్కువ ప్రీమియం చెల్లించడానికి సైతం ముందుకు రావడం లేదు. ఫసల్ బీమాపై ప్రచారం కొరవడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పథకంపై రైతులకు అవగాహన లేకపోవడంతో ఏటా పంటలను నష్టపోతున్నా పరిహారం అందని దయనీయ పరిస్థితి నెలకొంది. వాతావరణం అనుకూలించక పంటలు నష్టపోయే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టింది. ఖరీఫ్‌లో రైతులు సాగు చేస్తున్న పంటలకు బీమా చేసుకునేందుకు ఈ నెల 15 నుంచి 31 వరకు గడువు ఇచ్చింది. క్షేత్ర స్థాయిలో అధికారులు రైతులకు సరైన సమాచారం చేరవేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ శాఖలో క్షేత్ర స్థాయిలో సిబ్బంది సరిపడా లేకపోవడంతో రైతులకు సమాచారం అందడం లేదు. పంటలకు బీమా చేసుకుంటే రైతులకు మేలు చేకూరుతుందనే వాస్తవాన్ని వారు విస్మరిస్తున్నారు. పంటలు నష్టపోయినప్పుడు చూద్దాంలే అనుకుంటున్న రైతులు..నష్టపోయినప్పుడు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. గ్రామ, మండల యూనిట్ల వారీగా బీమా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు నిబంధనలతో బీమా అవకాశాన్ని రైతులకు కల్పించింది. గతంలో పంటలు నష్టపోయినప్పుడు బీమా సొమ్మును అందించేందుకు బీమా సంస్థలు సవాలక్ష కొర్రీలు పెట్టడంతో బీమా చేయించడానికి రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. బీమా చెల్లించడమే కానీ నష్టపోయినప్పుడు డబ్బులు వచ్చిన దాఖలాలు తక్కువేనని రైతులు నిట్టూరుస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాలు ఆలస్యమైనా ఇటీవలే అడపాదడపా కురుస్తున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఖరీఫ్ పంటలు సాగు చేయడం ఆరంభించారు. విత్తనాలు విత్తుకుంటున్నారు. జిల్లాలో మొత్తం సాధారణ సాగు విస్తీర్ణం 2,21,614 హెక్టార్లు ఉంది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 39,807 హెక్టార్లుగా ఉంది. జిల్లాలో ప్రధానంగా కంది పత్తి, వరి, మినుము, పనుపు, పెసర, మొక్కజొన్న సాగు చేస్తారు. ఈ సంవత్సరం ఖరీఫ్‌లో వర్షాలు ఆలస్యం కావడంతో ఇప్పటివరకు సుమారుగా 50 నుంచి 60 శాతం మాత్రమే సాగు విస్తీర్ణం నమోదైందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఖరీఫ్ సీజన్లో మరో 10 రోజులవరకు విత్తనాలు వేసుకునే అవకాశం ఉండడంతో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలియజేస్తున్నారు. రైతులకు భరోసాగా.. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన కింద రైతులు సాగు చేస్తున్న ఖరీఫ్ పంటలకు బీమా ప్రకటించింది. పలు పంటలను గ్రామ యూనిట్‌గా, మరికొన్నింటిని మండల యూనిట్‌గా లెక్కించనున్నారు. మొక్కజొన్న పంటను గ్రామ యూనిట్ పరిధిలో చేర్చారు. ఈ నెల 31 తేదీ వరకు ప్రీమియం డబ్బులు చెల్లించి బీమా పొందేలా అవకాశం కల్పించారు. అంతే కాకుండా పత్తి పంటకు ఈ నెల 15వ తేదీ గడువు విధించింది. వరి, పసుపు, కంది, సోయా, మినుము, పెసర, జొన్న పంటలకు మండల యూనిట్ జాబితాలో బీమా సౌకర్యం ప్రకటించారు. ఖరీఫ్‌లో రైతులకు తక్కువ వర్షపాతం, ప్రతికూల పరిస్థితులతో పంటలు నష్టపోతే బీమా పథకం వర్తిస్తుంది. మీ సేవా కేంద్రాల్లో ఫసల్ బీమా పథకానికి సంబంధించి రైతులు మీ సేవ కేంద్రాల్లో బీమా ప్రీమియం డబ్బులను చెల్లించాలి. సహకార, గ్రామీణ, ఇతర జాతీయ బ్యాంకుల్లో పంట రుణాలను పొందిన రైతులకు బ్యాంక్ అధికారులే బీమా సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటారు. రుణం పొందని రైతులు వ్యవసాయాధికారులను సంప్రదిస్తే బీమా సౌకర్యం వివరాలను తెలియజేస్తారు. యూనిట్ వారీగా బీమా.. రైతులు పండిస్తున్న పంటలకు మూడు రకాల బీమా చేయనున్నారు. అందులో మొక్కజొన్న పంటలను గ్రామ యూనిట్ పరిధిలో చేర్చారు. గ్రామంలో మొక్కజొన్న పంట నష్టం వాటిల్లితే అదే గ్రామ పరిధిలోని విస్తీర్ణంలో దిగుబడిని బట్టి బీమా సొమ్మును చెల్లిస్తారు. అయితే కంది, జొన్న, వరి, సోయా, పెసర, మినుములాంటి పంటలను మండల యూనిట్ జాబితాలో చేర్చారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే మండలాన్ని పరిగణలోకి తీసుకొని బీమా వర్తించే విధంగా నిబంధనలు రూపొందించారు. పత్తి పంటకు మాత్రం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బీమా వర్తించేలా ప్రభుత్వం ఫసల్ బీమాను అమలు చేస్తోంది. పంటలను బట్టి వాణిజ్య, సాధారణ పంటలుగా గుర్తించారు. వాణిజ్య పంటలకు బీమా పరిహారం అధికంగా ఉంటుంది. పత్తి, పసుపు పంటలు నష్టపోతే బీమాను అధికంగా చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీమా చేయించండి వాతావరణ విపత్కర పరిస్థితుల్లో పంటలు నష్టపోతే బీమా ఎంతగానో ఉపయోగపడుతుంది. అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందవచ్చు. ప్రభుత్వం బీమా చేయించేందుకు ఈ నెలాఖరు వరకు పంటల వారీగా గడువు ఇచ్చింది. పంటలు సాగుచేస్తున్న రైతులు బీమా ప్రీమియం చెల్లించండి. పంటలు నష్టపోతే లాభదాయకంగా ఉంటుంది. – బి.నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి -
నవల్గాలో మద్యం నిషేధం!
సాక్షి, బషీరాబాద్(సంగారెడ్డి): యువతను పెడదారి పట్టిస్తున్న మద్యంను కట్టడి చేయడానికి బషీరాబాద్ మండలం నవల్గా గ్రామ పంచాయతీ నడుం బిగించింది. గ్రామంలో నడుపుతున్న బెల్టు షాపుల భరతం పట్టాలని నిర్ణయించింది. దీని కోసం సర్పంచ్ డి. నర్సింహులు బుధవారం పంచాయతీ కార్యవర్గ అత్యవసర సమావేశం నిర్వహించారు. జులై ఒకటి నుంచి గ్రామంలోని మద్యపానం నిషేధిస్తూ పంచాయతీ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇకపై బెల్టు షాపులన్నీ మూసి వేయాలని నోటీసులు జారీకి రంగం సిద్ధం చేశారు. జులై ఒకటి నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం అమలు చేస్తున్నందున ఇకపై బెల్టు షాపులు నడిపితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆబ్కారీ శాఖ అధికారులకు సర్పంచ్ లేఖ రాశారు. బషీరాబాద్ మండలం నవల్గా మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ యువత, కార్మికులు ఎక్కువగా ఉంటారు. అయితే సాయంత్రం అయితే చాలు మద్యం ప్రియులు మద్యం తాగి రోడ్లమీద హల్చల్ చేస్తున్నారు. మద్యం మత్తులో తరుచూ గొడవలు జరుగుతుండటమే కాకుండా న్యూసెన్స్ చేస్తున్నారు. ఇదే విషయమై గ్రామ సర్పంచ్ పలుమార్లు హెచ్చరించినా మార్పురాలేదు. అయితే గ్రామంలో జరుగుతున్న గొడవలకు ప్రధాన కారణం బెల్టు షాపులని భావించిన సర్పంచ్ డి.నర్సింహులు మద్యం బంద్ చేస్తే అన్ని సమస్యల పరిష్కారం అవుతాయని సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల ఒకటి నుంచి గ్రామంలో మద్యపాన నిషేధం చేస్తూ పంచాయతీలో తీర్మానం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో బెల్టు షాపుల వలన యువత పెడదారి పడుతున్నారని అన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా మద్యానికి బానిస అవుతున్నారన్నారు. అలాగే గని కార్మికులు కూడా ఎక్కువగా ఉండడంతో మద్యానికి బానిసై కాపురాల్లో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. వీటన్నింటిని పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గ్రామంలో బెల్టు షాపులు పూర్తిగా బంద్ చేయాలని ఆబ్కారీ శాఖ అధికారులకు కూ డా లేఖ రాసినట్లు సర్పంచ్ వెల్లడించారు. లేఖ మరోవైపు సర్పంచ్ తీసుకున్న నిర్ణయాన్ని గ్రామంలోని మహిళలు, విద్యావంతులు, విద్యార్థులు స్వాగతించారు. సర్పంచ్ తీసుకున్న నిర్ణయానికి ఆయన్ని అభినందనలు తెలిపారు.. అలాగే గ్రామంలో స్వచ్ఛతపై కూడగా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని సర్పంచ్ చెప్పా రు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలక్రిష్ణ, ఉప సర్పంచ్ మాల లాలప్ప, కార్యదర్శి లక్ష్మీకాంత్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విజయ్‌కుమార్, మహేష్, వార్డు సభ్యులు సిద్దయ్య, ఆనంద్, మొగులమ్మ, పార్వతమ్మ, మొగులమ్మ, రాములమ్మ, లక్ష్మీ, అంగన్వాడీ టీచరు పాల్గొన్నారు. -
సంగారెడ్డి జిల్లా ఎస్ఈ కంపెనీ ముందు కార్మికుల ఆందోళన
-
కాంగ్రెస్ హయాంలో అంతా అవినీతే
హత్నూర(సంగారెడ్డి) : కాంగ్రెస్‌లో హయాంలో అంతా అవినీతేనని, కేంద్ర, రాష్ట్ర మంత్రులు స్కామ్‌లు చేసి జైలుకు వెళ్ళారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం హత్నూర మండలం పన్యాల గ్రామంలో రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లతో కలిసి ఆయన రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలన్న సదుద్దేశ్యంతో దేశానికే ఆదర్శంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన కేసీఆర్‌కి రావడంతోనే రైతుబంధు, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, కళ్యాణలక్ష్మి, ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్బుక్లో ప్రచారం చేస్తామని చెప్పడం కాదు దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతున్న రైతుల సంక్షేమం కోసం పాస్‌పుస్తకాలు ఇచ్చిన ప్రభుత్వం మాది అని తేల్చి చెప్పారు. గత పాలనలో లంచం లేనిదే ప్రజలకు పనులు జరగలేదన్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ పాలనలో నిజాయితితో పనిచేస్తున్నారన్నారు. రైతులను పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు రైతులకు పెట్టుబడి చెక్కులు ఇస్తుంటే విమర్శించటం ఏమిటని ప్రశ్నించారు. రైతు పక్షపాతిగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 24గంటలు ఉచితకరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ది అన్నారు. కాంగ్రెస్ పాలనలో నాయకులు హైదరాబాద్‌లోని క్లబుల్లో ఉంటూ రాష్ట్రాన్ని అధోగతి చేశారని ఎద్దేవా చేశారు. ఆరునెలల క్రితం జైలులో ఉండివచ్చిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు సీఎం సీటు కోసం తహతహలాడుతున్నారని వారి కలలు కలలాగే మిగిలిపోతాయన్నారు. బ్రహ్మదేవుడు దిగివచ్చినా టీఆర్ఎస్ను కదిలించలేరని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎత్తిపోతలతో రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. మండలంలోని మంజీర పరివాహక ప్రాంతంపై చెక్‌డ్యాంలు కట్టి ఎత్తిపోతల ద్వారా గొలుసుకట్టు చెరువులను నింపి రైతులకు సాగునీరు అందిస్తామని తెలిపారు. పన్యాల గ్రామానికి రూ. 20 లక్షల రూపాయలతో పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు. రైతుబంధు దేశానికే ఆదర్శం : కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. అనంతరం చెక్కులను వ్యవసాయ సాగు కోసమె వినియోగిస్తామని రైతులచేత కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం రైతుబంధు పథకం ప్రవేశపెట్టి రైతులను రాజును చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డిలు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ పల్లె జయశ్రీ, మార్కెట్ కమిటీ చైర్మన్ హంసీబాయి, మండల రైతుసమన్వసమితి కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, నాయకులు అక్బర్, ఎల్లదాస్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు శివశంకర్‌రావు, నీరుడి అశోక్, నరేందర్‌తోపాటు రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికా>రులు తదితరులు పాల్గొన్నారు. -
జైలు మ్యూజియం
సంగారెడ్డి నుంచి మంగళపర్తి నర్సింలు: రెండు శతాబ్దాల పైచిలుకు చరిత్ర కలిగిన నిర్మాణం ఇప్పుడు మ్యూజియంగా మారింది. నిజాం కాలంలో గుర్రాల పునరుత్పత్తి కేంద్రంగా వెలిగి అనంతరం జైలుగా రూపాంతరం చెంది సుమారు 60 సంవత్సరాలు సేవలు అందించిన నిర్మాణంలో ఎన్నో ఆసక్తికర అంశాలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం దీన్ని పూర్తి స్థాయి జైలు మ్యూజియంగా తీర్చిదిద్దుతున్నారు. దేశంలోనే ఓ జైలు మొదటిసారిగా ఇలా పర్యాటక కేంద్రంగా మారింది. రాష్ట్ర జైళ్లశాఖ డీఐజీ వినయ్‌కుమార్‌సింగ్ ఆలోచనలతో రూపుదిద్దుకున్న మ్యూజియం.. నేడు పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. జైలులో బ్యారక్ల నిర్మాణం, కేటాయించే గదులు, యూనిఫాం, వంటశాల, ఖైదీలతో పని చేయించిన విధానం.. తదితరాలు కళ్లకు కట్టినట్టు కన్పిస్తాయి. 220 ఏళ్ల క్రితమే నిర్మాణం సంగారెడ్డి సంస్థానంగా కొనసాగుతున్న క్రమంలో సుమారు రెండు శతాబ్దాల క్రితం భారీ కోటగోడలు నిర్మించారు. అనంతరం ఈ ప్రాంతం గోల్కొండ నవాబుల పాలనలోకి వెళ్లడంతో హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడం, సైనిక సంపత్తిలో భాగంగా అవసరమైన గుర్రాల పునరుత్పత్తి కేంద్రంగా, సైన్యం విడిది కేంద్రంగా దీన్ని ఉపయోగించారు. స్వాతంత్య్రం వచ్చాక జైలుగా మారింది. ప్రాభవం కోల్పోకుండా.. అన్ని హంగులతో కంది ప్రాంతంలో సువిశాలమైన సంగారెడ్డి జిల్లా జైలును 2012లో ప్రారంభించడంతో కొన్నాళ్లపాటు పాత జైలు ఉనికి కోల్పోయి శిథిలావస్థకు చేరింది. ఈ సమయంలో జైళ్లశాఖ డీజీగా పనిచేస్తున్న వీకే సింగ్ ఆలోచనతో జైలుకు మరమ్మతులు చేసి 2016 జూన్ 5న మ్యూజియంగా మార్చి ప్రారంభించారు. ఈ మ్యూజియంలోకి ప్రవేశ రుసుంగా రూ.10 వసూలు చేస్తున్నారు. ఆయుర్వేదిక్ విలేజ్... ప్రజలకు ఆయుర్వేదిక్ సేవలు అందించడానికి మ్యూజియం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. సోమవారం (నేడు) హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆయుర్వేదిక్ విలేజ్‌ను ప్రారంభిస్తారు. కేరళలో ప్రసిద్ధి చెందిన పంచకర్మ వైద్య విధానాన్ని ఇక్కడ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. -
రెడీ.. మనకో వెల్నెస్ సెంటర్
సంగారెడ్డి టౌన్: స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్‌ను సకల హంగులతో ప్రారంభానికి సిద్ధం చేశారు. దీన్ని ఈ నెల 8న (నేడు) వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిçస్టుల ఆరోగ్య పథకం కింద దీన్ని ఏర్పాటు చేసింది. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంట్రవెన్షన్ సెంటర్ కింద ఉన్న గదులను ఆధునీకరించి ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఏర్పాటుతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు అత్యుత్తమ వైద్య సేవలు అందనున్నాయి. దీనికిగాను ప్రభుత్వం ప్రత్యేకంగా 25 మంది సిబ్బందిని నియమించింది. మరో 20 మంది సిబ్బందిని నియమించాల్సి ఉన్నట్లు వెల్నెస్ సెంటర్ అధికారులు తెలిపారు. ముగ్గురు ఎంబీబీఎస్, ఆర్థో, కార్డియాలజిస్టు, ముగ్గురు స్పెషలిస్టులు, ఒక గైనకాలజిస్టు, ఒక జనరల్ మెడిసిన్, ఒక డెంటల్, ఒక పిల్లల వైద్య నిపుణుడి తోపాటు డెంటల్, ఫిజియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ తదితర సేవలు అందనున్నాయి. జిల్లాలోని ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబ సభ్యులు ఈ ఆరోగ్య పథకం కింద సేవలు పొందాలంటే మొన్నటి వరకు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న వెల్నెస్ సెంటర్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకొని అక్కడి నుంచి ఇతర ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చేది. జిల్లా కేంద్రంలోనే వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడంతో నిపుణులైన డాక్టర్ల సేవలు అందనున్నాయి. ఇక నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడదు. సర్జరీ అవసరమైన రోగులకు, ఇక్కడ అందుబాటులో లేని సేవల కోసం మాత్రమే హైదరాబాద్ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుంది. గతంలో హైదరాబాద్‌లోని వెల్నెస్ సెంటర్‌కు వెళ్లేందుకు ఇబ్బందులు పడేవారు. స్థానికంగానే జిల్లాలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు కావడంతో ఇక్కడి నుంచే నేరుగా పెద్ద ఆస్పత్రులకు రెఫర్ చేయించుకొని అక్కడికి వెళ్లి వైద్య సేవలు నేరుగా పొందే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులకు దూరంగా ఉన్న కొన్ని కుటుంబాలు వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. ఉదయం 9 నుంచి ఓపీ సేవలు కార్పొరేట్ స్థాయిలో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు అవుతుండడంతో సంబంధిత ఆరోగ్య పథకం లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓపీ సేవలు ఉదయం 9 గంటల నుండి ఐదున్నర గంటల వరకు, ఉదయం 8 గంటల నుండి డయాగ్నస్టిక్ పరీక్షల సేవలు అందుబాటులో ఉంటాయి. రోగులు ఇతర ఆస్పత్రులకు వెళ్లాలంటే ఈ వెల్నెస్ సెంటర్ నుంచి రెఫర్ చేయించుకొని వెళ్లవచ్చు. ఇక్కడ ఔట్ పేషెంట్ సేవలు మాత్ర మే అందుబాటులో ఉంటాయి. నగదు రహిత వైద్యం ఇక్కడ లభించనుంది. రోగులకు అయ్యే ఖర్చు ప్రభుత్వం పూర్తిగా భరిస్తుంది. వైద్యంతోపాటు పరీక్షలు, మందులు ఉచితంగా అందించనున్నారు. వెల్నెస్ సెంటర్‌తోపాటు రాష్ట్రంలోని 14 కార్పొరేట్ ఆస్పత్రులు, మరో 200 ప్రైవేట్ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఎక్కడైనా నగదు రహిత వైద్యం ఈ స్కీమ్ కింద చేయించుకోవచ్చు. సాధారణ జబ్బులకు మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లోనే చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ వైద్యం లభించని పక్షంలో ప్రైవేట్ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లగా చేరవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్లు, కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం పొందవచ్చు. అలా చేరిన 48 గంటల్లోగా ఈజేహెచ్ఎస్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 1899 రకాల వ్యాధులకు ఈజేహెచ్ఎస్ కింద చికిత్స అందిస్తారు. వెల్నెస్ సెంటర్‌ను పరిశీలించిన సీఈఓ సంగారెడ్డి టౌన్: జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంట ర్ను ఈహెచ్ఎస్ జెహెచ్ఎస్ సీఈఓ కె.పద్మజ బుధవారం పరిశీ లించారు. ఈ నెల 8న (నేడు) వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించి ప్రభుత్వ ఉద్యోగు లు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించనున్నట్లు ఆమె తెలిపారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుతో స్థానికంగానే మెరుగైన వైద్యం అందనుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు ధన్యవాదాలు సంగారెడ్డి టౌన్: జిల్లాలోని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలు అందించేందుకు వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేసినందుకుగాను మంత్రి హరీశ్‌రావు, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌కు ధన్యవాదా లు తెలుపుతున్నానని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యకాంత్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వెల్నెస్ కేంద్రాన్ని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్నెస్ సెంటర్లో సౌకర్యాలు బాగున్నాయన్నారు. ఆయనతోపాటు సంఘం ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, సభ్యులు మనోజ్, రఘు, రవి, విఠల్‌రెడ్డి, రవిశంకర్, జమ్లా ఉన్నారు. -
జహీరాబాద్ ఇక జిగేల్
సంగారెడ్డి, జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ఎల్ఈడీ బల్బులను బిగించే ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సర్వే పూర్తి చేసిన ఐదు నెలల తర్వాత మున్సిపల్ అధికారులు బల్బులను బిగించే పనులను సోమవారం సాయంత్రం చేపట్టారు. ఎల్ఈడీ బల్బులను బిగించడం ద్వారా విద్యత్ ఖర్చు సగానికి సగం తగ్గుతుంది. మున్సిపల్ పరిధిలో వీటిని బిగించేందుకు వీలుగా డిమాండ్ సర్వే చేపట్టారు. సీడీఎంఏ (కమిషనర్ ఆఫ్ డైరెక్టరేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) ద్వారా ఈపథకాన్ని అమలు చేసేందుకు ఈఈఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) ముందుకు వచ్చింది. మున్సిపల్ పరిధిలో అవసరమయ్యే బల్బుల ఖర్చును సదరు సంస్థే భరిస్తుంది. బల్బులను బిగించడం, పాడైన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లాంటి పనులను సైతం వారే చూసుకుంటారు. ఇందు కోసం పని చేసే సిబ్బంది వేతనాల కింద 30 శాతం మేర మున్సిపాలిటీ ఈఈఎస్ఎల్కు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పోను 70 శాతం మున్సిపాలిటీకి మిగులుబాటు అవుతుందనేది ఈ పథకం అంచనా. పూర్తయితే రూ.2లక్షల మేర మిగులుబాటు.. ఎల్ఈడీ విద్యుత్ బల్బులను బిగించడం ద్వారా జహీరాబాద్ మున్సిపాలిటీకి ప్రతీనెల రూ.2లక్షల మేర మిగులు బాటు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకు సుమారు రూ.7లక్షల మేర విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఎల్ఈడీ లైట్లను బిగిస్తే ఇందులో సగానికి సగం బిల్లు తగ్గుతుందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. మిగిలే రూ.3.50లక్షల్లో సుమారు రూ.లక్ష నిర్వహణ, విద్యుత్ బల్బులు దెబ్బతింటే మార్చడం లాంటి వాటి కోసం సదరు సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పోను ప్రతీనెల రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షల మేర మున్సిపాలిటీకి మిగులుబాటవుతుందని భావిస్తున్నారు. పూర్తి స్థాయిలో సర్వే.. ఎల్ఈడీ బల్బులను బిగించేందుకు వీలుగా నిర్వహించిన సర్వేలో పలు వివరాలు సేకరించారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న పోల్స్ ఎన్ని, ఇంకా ఎన్ని అవసరం ఉన్నాయి?, ఏయే వాడలో ఎన్ని స్తంభాలున్నాయి. ఒక్కో ఫీడర్ పరిధిలో ఎన్ని దీపాలు ఉన్నాయి.? కరెంటు బిల్లులు ఎంత మేర వస్తోంది అనే సమాచారాన్ని ఈఈఎస్ఎల్ సేకరించింది. ఎల్ఈడీ బల్బులను సాధ్యమైనంత త్వరగా బిగించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో పనుల్లో పురోగతి వచ్చే అవకాశం ఉన్నట్లు అప్పట్లో భావించారు. అయినా ఏయే ప్రాంతాల్లో ఎంత మేర ఓల్టేజీ ఉన్న బల్బులను బిగించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జూన్ నెలాఖరు వరకల్లా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని భావించినప్పటికీ మొదలు పెట్టలేదు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో 3వేల మేర విద్యుత్ స్తంభాలు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు మొత్తం 4,300 విద్యుత్ స్తంభాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద ప్రస్తుతం చేపడుతున్న విద్యుత్ దీపాల బిగింపు పూర్తయితే జహీరాబాద్ పట్టణం విద్యుత్ కాంతులతో జిగేల్‌మననుంది. 65వ జాతీయ రహదారి, రైల్వే ఓవర్ బ్రిడ్జి, పట్టణంలోని అనేక రోడ్లు, కాలనీలు మెరిసిపోనున్నాయ. బిగించేందుకు ఆరు టీములు మున్సిపల్ పరిధిలో ఎల్ఈడీ బల్బులను బిగించేందుకు ఆరు టీములను ఏర్పాటు చేశారు. ఒక్కో టీములో ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది పనులు నిర్వహిస్తారు. ఆరు టీములకు ఆయా వార్డులను కేటాయించారు.