విద్యార్థినితో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి రూరల్: ప్రభుత్వ, రాజకీయ కార్యకలాపాలతో నిత్యం తీరిక లేకుండా గడిపే ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు మాస్టారు అవతారం ఎత్తారు. శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన మంత్రి.. మండల కేంద్రమైన కందిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాంఘిక శాస్త్రం, గణితం తదితర సబ్జెక్టుల్లో పదో తరగతి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి విషయ పరిజ్ఞానాన్ని పరిశీలిం చారు. ఎన్ని ఎక్కాలు వచ్చు.. అని అడిగి 17వ ఎక్కం చదవాలని సూచించారు. విద్యార్థులు ఎవరూ చెప్పలేకపోయారు. కనీసం 12, 13వ ఎక్కం చెప్పాలని అడిగినా చెప్పలేని విద్యార్థులు తమకు కేవలం పదవ ఎక్కం వరకు మాత్రమే వచ్చని తెలిపారు.
తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో ఉపాధ్యాయుల పేర్లను రాయాలని మంత్రి అడగడంతో ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు మాత్రమే సక్రమంగా రాయగా, నలుగురు రాయలేకపోయారు. దీంతో మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే విద్యార్థులు ఎలా పాసవుతారని మంత్రి ఉపాధ్యాయులపై అసహనం వ్యక్తం చేశారు. అన్ని సబ్జెక్టుల్లో అవగాహన ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. చదువులో వెనుకబడి ఉంటే ఉత్తీర్ణత సాధించడం కష్టంగా ఉంటుందన్నారు. ఇలాంటి చదువులతో పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకొస్తారని ప్రశ్నించారు. వెనుకబడిన టెన్త్ విద్యార్థులపై శ్రద్ధపెట్టి ప్రత్యేక తరగతులు నిర్వహించి, బాగా చదివించాలని టీచర్లను ఆదేశించారు. విద్యార్థులందరూ పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణులయ్యేలా తీర్చిదిద్దాలన్నా రు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment