సాక్షి, హైదరాబాద్: సాంబార్ ఇడ్లీ, పూరీ–ఆలూ కుర్మా, ఉప్మా, వెజిటబుల్ పలావ్, ఉగ్గాని.. ఇలా సర్కార్ బడులలో విద్యార్థులకు ఉచితంగా.. వేడి వేడిగా రోజుకో అల్పాహారం అందించేలా మెనూ ఖరారయ్యింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకం ప్రారంభించేందుకు అధికా రులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. మహేశ్వరం మండలం రావిర్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్‌కి బదులు.. మంత్రి హరీశ్‌రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికార వర్గాలు తెలిపాయి.
ఇక రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గంలో ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అల్పాహార పథకం ప్రారంభిస్తారు. విద్యార్థులను బడికి రప్పించడం, వారికి తగిన పౌష్టికాహారం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 27,147 పాఠశాలల్లో 1–10వ తరగతి వరకు చదివే 23 లక్షల మంది విద్యార్థులకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే విద్యార్థులకు అల్పాహారం అందించనున్నారు.
హెచ్‌ఎంలకు నిర్వహణ బాధ్యత
రాష్ట్ర విద్యాశాఖ, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో అమలయ్యే ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని తొలుత నియోజకవర్గానికి ఒకటీ రెండు పాఠశాలల్లో లాంఛనంగా ప్రారంభిస్తారు. దసరా నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠ శాలల్లో పూర్తి స్థాయిలో అమలు చేస్తారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను, మెనూను విద్యా శాఖ వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం అమలు తీరును పర్యవేక్షించేందుకు ప్రత్యేక ట్రాకింగ్ మొబైల్ యాప్‌ను కూడా రూపొందించింది.
అన్ని రకాల విటమిన్స్ లభించే పౌష్టికాహారంతో రోజుకో రకమైన బ్రేక్‌ఫాస్ట్ ఉంటుందని అధికారులు తెలిపారు. పథకం నిర్వహణ బాధ్యత సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యా యులపైనే పెట్టారు. మండల నోడల్ అధికారి మండల స్థాయిలో, జిల్లా విద్యాశాఖాధికారి జిల్లా స్థాయిలో, పాఠశాల విద్య శాఖ రాష్ట్ర స్థాయిలో పథకం అమలు తీరును పర్యవేక్షిస్తుంది. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల అధికారులకు అల్పాహారం అందుతున్న తీరును పర్యవేక్షించే అధికారాలు ఇచ్చారు.
బ్రేక్‌ఫాస్ట్ అందించే వేళలివే..: మధ్యాహ్న భోజనం పథకం కార్మికులే అల్పాహారం తయారు చేస్తారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక పాఠశాలు ఉదయం 9.30 మొదలవుతాయి. ఆయా చోట్ల ఉదయం 8.45 గంటలకు విద్యార్థులకు అల్పాహారం అందిస్తారు. జంటనగరాల్లో ప్రైమరీ స్కూళ్ళు ఉదయం 8.45 గంటల నుంచి మొదలవుతాయి. దీనివల్ల ఈ స్కూళ్ళలో ఉదయం 8 గంటలకే బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 8.45 గంటలకు, జంటనగరాల్లో ఉదయం 8 గంటలకు అల్పాహారం అందిస్తారు.
ఆరు రోజులు..ఆరు రకాలు
సోమవారం: ఇండ్లీ సాంబార్ లేదాపచ్చడితో కూడిన గోధుమరవ్వ ఉప్మా
మంగళవారం: ఆలూ కుర్మాతో పూరీ లేదా టమాటో బాత్ సాంబార్‌తో
బుధవారం: సాంబార్ ఉప్మా లేదా చట్నీతో కూడిన బియ్యం రవ్వ కిచిడీ
గురువారం: మిల్లెట్స్ ఇడ్లీ విత్ సాంబార్ లేదా సాంబార్‌తో పొంగల్
శుక్రవారం: ఉగ్గానీ, పోహా,మిల్లెట్ ఇడ్లీ విత్ చట్నీలో ఏదో ఒకటి లేదా గోధుమరవ్వ కిచిడీ చట్నీతో
శనివారం: సాంబార్‌తో పొంగల్ లేదా వెజిటబుల్ పలావ్, రైతా, ఆలూకుర్మా
డ్రాపౌట్లు తగ్గిస్తుంది
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పౌష్టికా హారం అందించే ఈ పథకం విద్యార్థుల డ్రాపౌట్ల (బడి మానేవారి సంఖ్య)ను తగ్గిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను కోరారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రూ.672 కోట్లు తన వాటాగా ఖర్చు చేస్తోందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం కింద సన్న బియ్యంతో కూడిన భోజనం, వారానికి మూడు గుడ్లను అందిస్తున్నామని తెలిపారు. ఐరన్, సూక్ష్మ పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించే ఉద్దేశంతో రూ. 32 కోట్లు వెచ్చించి రాగి జావను ఇస్తున్నామని చెప్పారు. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment