సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డిటౌన్: దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిపై పోరు సాగిస్తున్న హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీలకు ఐఐటీ హైదరాబాద్‌లో పురుడు పోసుకున్న ‘ప్యూర్ ఈవీ’స్టార్టప్ కంపెనీ లిథియం బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఈ బ్యాటరీలను వెంటిలేటర్లు, రోబోటిక్ శానిటరీ పరికరాల్లో ఉపయోగిస్తారు. లిథియం బ్యాటరీల ఉపయోగాపై ‘ప్యూర్ ఈవీ’కొంతకాలంగా పరిశోధలను చేస్తోంది. ఇప్పటికే ఈ స్టార్టప్ తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్ వాహనాల్లో లిథియం బ్యాటరీలను ఉపయోగిస్తోంది. తేలికగా ఉండే లిథియం బ్యాటరీలను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే వీలుండటంతో పాటు ఎక్కువసేపు పనిచేస్తాయి. వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే ఈ బ్యాటరీలు ఇతర బ్యాటరీలతో పోలిస్తే అత్యంత మెరుగైనవి.
జీవన్‌లైట్‌లో లిథియం బ్యాటరీలు
ఐఐటీ హైదరాబాద్ అనుబంధ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ (సీఎఫ్‌హెచ్‌ఈ)కు చెందిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ అత్యవసర సమయాల్లో ఉపయోగించే ‘జీవన్ లైట్’అనే వెంటిలేటర్‌ను తయారుచేసింది. తక్కువ ధరలో లభించే ఈ వెంటిలేటర్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. జీవన్‌లైట్ వెంటిలేటర్‌లోనూ ప్యూర్ ఈవీ రూపొందించిన లిథియం బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఎమర్జింగ్ ఐటీ టెక్నాలజీ ద్వారా ఫోన్ యాప్ ద్వారా జీవన్‌లైట్‌ను ఆపరేట్ చేయొచ్చు. జేసీబీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం జీవన్‌లైట్ వెంటిలేటర్లను పెద్దసంఖ్యలో తయారుచేస్తోంది. కాగా రోబోటిక్ హెల్త్‌కేర్ టెక్ డివైజెస్‌ను తయారుచేస్తున్న ఓ ప్రైవేటు సంస్థకు కూడా ప్యూర్ ఈవీ లిథియం బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఐఐటీ హైదరాబాద్ స్టార్టప్ ప్యూర్ ఈవీ లిథియం బ్యాటరీలు అత్యంత నాణ్యత కలిగినవని మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ నిశాంత్ దొంగరి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment