health care sector
-
SBI: హెల్త్‌కేర్ బిజినెస్ లోన్ ద్వారా ఎంత రుణం పొందవచ్చు ?
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని ఎస్బీఐ ‘ఆరోగ్యం హెల్త్‌కేర్ బిజినెస్ లోన్’ను ఆవిష్కరించింది. కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఆరోగ్య సంరక్షణ రంగానికి మద్దతుగా రుణ పథకాన్ని తీసుకొచ్చింది. ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్‌లు, డయాగ్నోస్టిక్స్ ల్యాబ్‌లు, పాథాలజీ ల్యాబ్‌లు, తయారీ కంపెనీలు, సరఫరాదారులు, దిగుమతిదారులు, రవాణా సంస్థలు ఇలా ఆరోగ్యసంరక్షణ రంగంతో ముడిపడిన అన్ని రంగాల కంపెనీలకు ఈ పథకం కింద రుణాలను ఎస్బీఐ మంజూరు చేయనుంది. సామర్థ్య విస్తరణ లేదా ఆధునికీకరణ లేదా మూలధన అవసరాల కోసం టర్మ్‌లోన్‌ను తీసుకునేందుకు అర్హులని బ్యాంకు తెలిపింది. గరిష్టంగా రూ. 100 కోట్లు మెట్రో కేంద్రాల్లో అయితే ఒక్కో దరఖాస్తుదారు గరిష్టంగా రూ.100 కోట్లను తీసుకోవచ్చు. ఇతర ప్రాంతాల్లో రుణ గరిష్ట పరిమితి రూ.10–20 కోట్ల మధ్యనుంది. రూ.2 కోట్ల వరకు తీసుకునే రుణాలకు ఎటువంటి తనఖా / హామీనిగానీ సమర్పించాల్సిన అవసరం లేదు. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత హెల్త్ కేర్ రంగాన్ని బలోపేతం చేసేందుకు వీలుగా భారీ ఎత్తున రుణాలుఏ మంజూరు చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. దానికి తగ్గట్టుగా ఎస్బీఐ హెల్త్ కేర్ బిజినెస్ లోన్‌ను ప్రవేశపెట్టింది. చదవండి : డీమోనిటైజేషన్: ఆవి డబ్బులే, వివరణ అవసరం లేదు -
మన సన్నద్ధత ఎంత?
కరోనా ఫస్ట్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ దేశాలతో భేష్ అనిపించుకున్నాం. సెకండ్ వేవ్ వచ్చేసరికి చతికిలపడిపోయి చిన్నాచితకా దేశాల సాయం కూడా తీసుకున్నాం. మరి ఒకవేళ మూడో వేవ్ వస్తే ఎలా ఎదుర్కోగలం? పులి మీద పుట్రలా కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ మరింత దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం కేసులు తగ్గి పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నా సెప్టెంబర్–అక్టోబర్‌లో థర్డ్ వేవ్ కాటేస్తుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ వ్యాక్సినేషన్‌తో పాటు థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగ నిపుణులు చెప్పిన సలహాలు, సూచనలు, ప్రభుత్వాల సన్నద్ధత ఏమిటో చూద్దాం... కరోనా పరీక్షలు దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కరోనా పరీక్ష కేంద్రాలు, శాంపిల్ సేకరణ కేంద్రాలు లేవు. దేశం మొత్తం మీద 735 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో ప్రజలకి కరోనా సోకిందన్న అనుమానం వస్తే పరీక్ష చేయించుకోవాలంటే మరో జిల్లాకు వెళ్లాలి. కరోనాని అరికట్టాలంటే త్వరగా పరీక్షలు నిర్వహించడం అంత్యంత ముఖ్యం. ప్రతి ఒక్కరికీ కిలోమీటర్ దూరంలోనే శాంపుల్ కలెక్షన్ కేంద్రాలు పెడితేనే థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడం సాధ్యపడుతుంది. నిరుపేదలకు వైద్యం మన దేశంలో నిరుపేదలకు వైద్యం అందుబాటులో లేదు. నేషనల్ స్టాటస్టికల్ ఆఫీసు (ఎన్ఎస్ఓ) గణాంకాల ప్రకారం మన దేశ జనాభాలో 30% మందికి జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి వైద్యుల్ని సంప్రదించే అలవాటు లేదు. సెకండ్ వేవ్‌లో కోవిడ్ గ్రామాలకూ విస్తరించింది. అందువల్ల గ్రామీణుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి. లక్షణాలను తేలికగా తీసుకోవద్దనేది ప్రజల్లోకి వెళ్లాలి. అప్పుడే కరోనా వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట పడుతుంది. ఆస్పత్రులు– ఆర్థిక భారం కరోనా సోకి ఆస్పత్రికి వెళ్లాలంటే దడ పుట్టే రోజులున్నాయి. లక్షలకి లక్షలు బిల్లు చెల్లించలేక జనం కుదేలైపోతున్నారు. దేశ ప్రజల్లో 81% మంది నెలకి వచ్చే ఆదాయంలోనే ఆస్పత్రి ఖర్చులు కూడా భరించాలి. కరోనా వంటివి వస్తే అప్పో సొప్పో చేయాల్సిన దుస్థితి. మిగిలిన వారు ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలి. హెల్త్ ఇన్సూరెన్స్‌లు మొదటి రెండు కరోనా వేవ్‌లలో ఆస్పత్రి పాలైన కోవిడ్–19 రోగుల్లో 75 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కరోనా చికిత్స మొత్తం కవర్ కావడం లేదు. నేషనల్ స్టాటస్టికల్ ఆఫీసు (ఎన్ఎస్ఓ) అంచనాల ప్రకారం రోగులకయ్యే మొత్తం ఖర్చులో 10 శాతం కూడా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తిరిగి రావడం లేదు. దీంతో లక్షల్లో బిల్లులు కట్టుకోలేక జనం కరోనా పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ వ్యవస్థను పటిష్టపరిస్తే కరోనా రోగులు ధీమాగా ఆస్పత్రికి వెళ్లే రోజులొస్తాయి. ఆక్సిజన్ ప్లాంట్స్ కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ లేక మనుషులు పిట్టల్లా రాలిపోయారు. థర్డ్ వేవ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీఎం కేర్ ఫండ్స్ నిధులను వినియోగించి వివిధ జిల్లాల్లో 850 వరకు ఆక్సిజన్ ప్లాంట్లను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి... పరిస్థితిని మెరుగుపరిచే దిశగా పలు చర్యలు చేపట్టాయి. స్వయం సమృద్ధంగా ఉండటానికే మొగ్గుచూపుతున్నాయి. మాడ్యులర్ ఆస్పత్రులు కరోనా సెకండ్‌వేవ్‌లో ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీ లేక, వైద్యం అందక సంభవించిన మరణాలు చూశాం. దానిని అధిగమించాలంటే మరిన్ని ఆస్పత్రులు ఉండాలి.. ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి ఆస్పత్రుల నిర్మాణం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్య రంగ నిపుణులు మాడ్యులర్ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. ప్రధాన ఆస్పత్రికి అనుబంధంగా కట్టే ఈ ఆస్పత్రుల్ని రూ.3 కోట్ల ఖర్చుతో మూడు వారాల్లో నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఆరు నుంచి ఏడు వారాల్లో ఈ ఆస్పత్రుల్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆక్సిజన్ ప్లాంట్, ఐసీయూ సౌకర్యాలన్నీ ఇందులో ఉంటాయి. వారం రోజుల వ్యవధిలో అవసరమైన చోటుకి తరలించే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఆస్పత్రుల్ని 20, 50, 100 పడకలతో 50 వరకు నిర్మించడానికి కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది. పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ, దీనిపై ఎక్కువగా ప్రచారం జరగడంతో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, గోవా, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పీడియాట్రిక్ కోవిడ్ కేర్ వార్డుల్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లు పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశాయి. కొత్త వైద్యులకు శిక్షణ కోవిడ్ రోగుల సంఖ్య పెరిగపోవడం, కళ్ల ముందే రోగులు ప్రాణాలు వదిలేయడం, పీపీఈ కిట్లలో వాష్‌రూమ్‌కి వెళ్లే అవకాశం కూడా లేక గంటల తరబడి పని చేయడం వల్ల వైద్య సిబ్బంది నిస్సహాయులైపోతున్నారు. కోవిడ్ తర్వాత దేశంలో దాదాపు 13 లక్షల మంది డాక్టర్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన దేశంలో ప్రతీ 1,456 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందుకే వైద్య రంగంలోకి వచ్చిన జూనియర్ డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది కి శిక్షణ ఇస్తే వైద్యుల కొరత సమస్యని అధిగమించవచ్చు. మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడులు వైద్యలకు శిక్షణనిచ్చే అంశంపై దృష్టి సారించాయి. హోం క్వారంటైన్ వ్యవస్థ మన దేశంలో అధికశాతం కరోనా రోగులు ఇళ్లల్లోనే ఉండి కోలుకుంటున్నారు. ఇలాంటి రోగులకు కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ వారి ఆరోగ్యంపై పర్యవేక్షణ పెంచాలి. ఫోన్లలోనే వైద్యులు నిరంతరం వారి ఆరోగ్యాన్ని చూసే సదుపాయాలు కల్పించాలి. –సాక్షి, నేషనల్ డెస్క్ పర్యవేక్షణే కీలకం భారత్ కరోనా మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే నిరంతర పర్యవేక్షణ అత్యంత కీలకం. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సమాచారంతో నిరంతరం అధ్యయనాలు చేస్తూ గ్రామాల్లో కోవిడ్ పరీక్షా కేంద్రాలను పెంచాలి. సెరో సర్వేలు చేస్తూ కరోనా ప్రబలే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలి. విస్తృతంగా పరిశోధనలు చేసి వివిధ కరోనా వేరియంట్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలి. దీనికి ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. – డాక్టర్ సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ -
ఆరోగ్యరంగానికి అరకొర వ్యయమే
‘ఆరోగ్య పరిరక్షణ ఎట్టకేలకు ప్రధాన పాత్ర పోషించబోతోంది’ అని మొన్న ఆర్థిక సర్వే ప్రక టించింది. బడ్జెట్లో ప్రతిపాదించిన ఆరు కీలక స్తంభాల్లో ఆరోగ్యం మొదటిది. ప్రజారోగ్యానికీ, శ్రేయస్సుకూ ఈసారి కేటాయింపులు 137 శాతం పెంచుతున్నామని సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సగర్వంగా చెప్పారు. అయితే మాట్లాడినంత ఘనంగా పరిస్థితేమీ లేదని బడ్జె ట్ను తరచి చూస్తే అర్థమవుతుంది. కరోనా మహ మ్మారి తీవ్రత నేపథ్యంలో ఆరోగ్యరంగానికి కేటా యింపులు ముందుగా ఊహించిందే. మన ఆరోగ్య వ్యవస్థ లోని లోపాలను కరోనా బహిర్గతం చేసింది. రోగ వ్యాప్తిగానీ, దాని పర్యవసానంగా కలిగిన మర ణాలుగానీ అంచనా వేసినంతగా లేకపోవటం అదృ ష్టమే. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యరంగానికి వన రులు పుష్కలంగా వుండేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద వుంది. ఆరోగ్యరంగంపై సమగ్ర దృష్టి సారిస్తూ వ్యాధి నిరోధకత, స్వస్థ పర చటం, శ్రేయస్సు అనే మూడు అంశాలను పటిష్ట పరచాలని నిర్ణయించామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన అనే పేరిట కొత్త పథకాన్ని కూడా ప్రకటించారు. ఆరోగ్య పరిరక్షణ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రాథ మిక, మాధ్యమిక, ప్రాంతీయ స్థాయిల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచటం దీని ధ్యేయం. వచ్చే ఆరేళ్లలో ఇందుకోసం రూ. 64,180 కోట్లు వ్యయం చేస్తారు. అంటే ఏడాదికి దాదాపు రూ. 10,700 కోట్లు. నిరుడు ఆరోగ్యానికి రూ. 67,484 కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల ప్రకారం చూస్తే అది రూ. 94,452 కోట్లకు పెరి గింది. ఈ ఏడాది దాన్ని రెట్టింపు చేసి, వచ్చే మూడు నాలుగేళ్లలో క్రమేపీ పెంచుకుంటూ పోతే తప్ప ఆరోగ్య రంగ వ్యయంపై మనం పెట్టు కున్న లక్ష్యాలను సాధించటం సాధ్యం కాదు. ఆరోగ్య రంగ వ్యయాన్ని పెంచాల్సిన అవస రాన్ని ఆర్థిక సర్వే కూడా అంగీకరించింది. ఆరోగ్య పరిరక్షణకయ్యే ఖర్చులో 60శాతం ప్రజానీకం వాటా వుండగా మిగిలింది ప్రభుత్వ వ్యయం. మన జీడీపీలో ప్రస్తుతం ఆరోగ్యరంగ వాటా 1 శాతం కన్నా చాలా తక్కువ. దీన్ని 3 శాతానికి పెంచితే తప్ప ప్రజలపై భారం తగ్గదు. 2017నాటి జాతీయ జాతీయ ఆరోగ్య విధానం కూడా ఈ మాటే చెప్పింది. మెరుగైన ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రపంచంలోని 180 దేశాల్లో మన స్థానం 145. ఈసారి పరిస్థితి మారుతుందనుకుంటాము. కానీ ఆమె కేటాయించిన రూ. 2,23,846 కోట్లలో పౌష్టి కాహారం, మంచినీటి సదుపాయం, పారిశుద్ధ్యం అంశాలపై చేసే ఖర్చు కూడా వుంది. వీటికి ప్రాధా న్యత లేదని ఎవరూ అనరు. కానీ ఆరోగ్య వ్యయంగా ఆ అంశాలను చూపడం సరికాదు. అలాగే వ్యాక్సిన్ల కోసం చేసిన రూ. 35,000 కోట్ల కేటాయింపు కూడా ఈ ఏడాదికి పరిమితమైనది. దాన్ని రెగ్యులర్ ఆరోగ్య బడ్జెట్లో భాగంగా పరి గణించలేం. మన ఆరోగ్య రంగ బడ్జెట్ జీడీపీలో ఇప్పటికీ 0.34 శాతం మాత్రమే. జాతీయ ఆరోగ్య విధాన లక్ష్యాన్ని సాధించాలంటే 2021– 22లో జీడీపీలో 1.92 శాతం ఆరోగ్యానికి ఖర్చు చేయాలని ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే చెప్పింది. అందుకు మనం ఎంత దూరంలో వున్నామో చూస్తే ఆశ్చర్యం కలుగు తుంది. కరోనా మహమ్మారి వంటిది కూడా మన ప్రభుత్వాన్ని కదిలించలేకపోతే దాన్ని మరేది ప్రభావితం చేయగలదు? – ప్రొఫెసర్ దీపా సిన్హా -
దూసుకెళ్తున్న మార్కెట్లు : హెల్త్‌కేర్ షేర్లు జూమ్
సాక్షి, ముంబై: కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేయడంతో ఆ హెల్త్ కేర్ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగతున్నాయి. ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించిన నేపథ్యంలో హెల్త్ కేర్ షేర్లు ఒక్కసారిగా జూమ్ అయ్యాయి. నారాయణ హెల్త్ కేర్ 2 శాతం, అపోలో ఒకశాతం, గ్లోబల్‌హెల్త్ కేర్ ఫోర్టిస్ 2 శాతానికి పైగా లాభాలతో కొనసాగున్నాయి. దీంతో సెన్సెక్స్ 936 పాయింట్లు ఎగిసి 47 వేలను అధిగమించింది. నిఫ్టీ 241 పాయింట్ల లాభంతో 13875 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్,హెల్త్ కేర్ రంగ షేర్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. మహమ్మారి కట్టడిలో భారత్ ప్రపంచానికి మార్గదర్శనం చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ బడ్జెట్లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశామన్న ఆమె... ఏళ్లలో రూ . 64,180 కోట్ల వ్యయంతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సెంటర్‌ను బలోపేతం చేయనున్నామని, ఇందుకోసం దేశంలో కొత్త 15 సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి ప్రకటించారు. -
హెల్త్‌కేర్ కంపెనీలకు లిథియం బ్యాటరీలు
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డిటౌన్: దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారిపై పోరు సాగిస్తున్న హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీలకు ఐఐటీ హైదరాబాద్‌లో పురుడు పోసుకున్న ‘ప్యూర్ ఈవీ’స్టార్టప్ కంపెనీ లిథియం బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఈ బ్యాటరీలను వెంటిలేటర్లు, రోబోటిక్ శానిటరీ పరికరాల్లో ఉపయోగిస్తారు. లిథియం బ్యాటరీల ఉపయోగాపై ‘ప్యూర్ ఈవీ’కొంతకాలంగా పరిశోధలను చేస్తోంది. ఇప్పటికే ఈ స్టార్టప్ తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్ వాహనాల్లో లిథియం బ్యాటరీలను ఉపయోగిస్తోంది. తేలికగా ఉండే లిథియం బ్యాటరీలను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే వీలుండటంతో పాటు ఎక్కువసేపు పనిచేస్తాయి. వివిధ వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే ఈ బ్యాటరీలు ఇతర బ్యాటరీలతో పోలిస్తే అత్యంత మెరుగైనవి. జీవన్‌లైట్‌లో లిథియం బ్యాటరీలు ఐఐటీ హైదరాబాద్ అనుబంధ సెంటర్ ఫర్ హెల్త్‌కేర్ ఎంట్రప్రెన్యూర్షిప్ (సీఎఫ్హెచ్ఈ)కు చెందిన ఏరోబయోసిస్ ఇన్నోవేషన్ అనే స్టార్టప్ అత్యవసర సమయాల్లో ఉపయోగించే ‘జీవన్ లైట్’అనే వెంటిలేటర్‌ను తయారుచేసింది. తక్కువ ధరలో లభించే ఈ వెంటిలేటర్‌ను ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. జీవన్‌లైట్ వెంటిలేటర్లోనూ ప్యూర్ ఈవీ రూపొందించిన లిథియం బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఎమర్జింగ్ ఐటీ టెక్నాలజీ ద్వారా ఫోన్ యాప్ ద్వారా జీవన్‌లైట్‌ను ఆపరేట్ చేయొచ్చు. జేసీబీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రస్తుతం జీవన్‌లైట్ వెంటిలేటర్లను పెద్దసంఖ్యలో తయారుచేస్తోంది. కాగా రోబోటిక్ హెల్త్‌కేర్ టెక్ డివైజెస్‌ను తయారుచేస్తున్న ఓ ప్రైవేటు సంస్థకు కూడా ప్యూర్ ఈవీ లిథియం బ్యాటరీలను సరఫరా చేస్తోంది. ఐఐటీ హైదరాబాద్ స్టార్టప్ ప్యూర్ ఈవీ లిథియం బ్యాటరీలు అత్యంత నాణ్యత కలిగినవని మెకానికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ నిశాంత్ దొంగరి వెల్లడించారు. -
అమెజాన్‌లో ప్రముఖ కార్డియాలజిస్ట్
అమెజాన్ అంటే ప్రపంచ ఈ-కామర్స్ మార్కెట్లో ఓ సంచలనం. ఈ కంపెనీ కన్ను ఇప్పుడు 3 ట్రిలియన్ డాలర్ల హెల్త్ కేర్ రంగంపై పడింది. హెల్త్ కేర్ రంగంలోనూ తన సత్తా ఏమిటో నిరూపించుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో భాగంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ మౌలిక్ మజ్ముదార్ను నియమించుకుంది. అమెజాన్‌లో తనను నియమించుకున్నట్టు తెలుపుతూ.. మజ్ముదార్ తన ట్విటర్ అకౌంట్లో కొత్త రోల్ గురించి ప్రకటించారు. ఈ టెక్నాలజీ కంపెనీ మజ్ముదార్ను నియమించుకోకముందు, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్లో హెల్త్ కేర్ ట్రాన్సఫర్మేషన్ ల్యాబ్‌కు కార్డియాలజిస్ట్‌గా, అసోసియేట్ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించేవారు. ఎంఐటీలో లెక్చరర్ కూడా. ల్యాబ్‌లో ఆయన అధునాతన మెడికల్ టెక్నాలజీస్‌ను ఔషధాల్లో ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాలపై పరిశోధనలు చేసేవారు. అయితే అమెజాన్‌లో ఆయన కొత్త ఏ బాధ్యతలను నిర్వర్తించనున్నారో మాత్రం వెల్లడించలేదు. కేవలం ఉత్తేజకరమైన, సవాల్‌తో కూడిన బాధ్యతలను తాను స్వీకరించనున్నట్టు మాత్రమే పేర్కొన్నారు. ఇప్పటికే హెల్త్‌కేర్‌లో కూడా పలు టీమ్స్‌తో అమెజాన్ పనిచేస్తోంది. మెడిసిన్లను హాస్పిటల్స్‌కు, క్లినిక్స్‌కు అమ్మేలా ఓ బిజినెస్ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని అమెజాన్ యోచిస్తున్నట్టు తెలిసింది. హెల్త్ కేర్ కంపెనీలకు ఏఐ ఆధారిత టెక్నాలజీస్, ఇతర అధునాతన టెక్నాలజీలను తన క్లౌడ్ టీమ్ విక్రయించబోతున్నట్టు సమాచారం. హెల్త్ కేర్‌లో వాయిస్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి అలెక్సాలో ఓ మంచి బృందమే పనిచేస్తుంది. జూన్‌లో అమెజాన్ ఆన్లైన్ ఫార్మసీ పిల్ప్యాక్ను కూడా కొనుగోలు చేసింది. తన ఉద్యోగులకు వైద్య ఖర్చులు తగ్గించడానికి ఈ కంపెనీ, జేపీ మోర్గాన్, బెర్క్ షైర్ హాత్వేలతో భాగస్వామ్యం కూడా ఏర్పరుచుకుంది. ప్రస్తుతం హెల్త్ కేర్‌పై కన్నేసిన టెక్నాలజీ కంపెనీల్లో కార్డియాలజిస్ట్‌లకు భారీ డిమాండ్ ఉంది. దిగ్గజ టెక్ కంపెనీలు అమెజాన్, గూగుల్, ఆపిల్ కంపెనీలు వీరి నియామకాలపై ఎక్కువగా దృష్టి సారించాయి. 1/ Very emotional day: After decade of medical training (@NorthwesternMed @HopkinsMedicine @BrighamWomens), five years on the faculty @MGHMedicine and @harvardmed, leading #digitalhealth @mgh_htl, I have decided to leave academia to take on an exciting & challenging role @amazon — Maulik Majmudar, MD (@mdmajmudar) August 20, 2018 -
హెల్త్‌కేర్ రంగంలో మెరుగైన సంస్కరణలు
ఢిల్లీలో హెల్త్‌కేర్ ఇండియా నివేదిక ఆవిష్కరణలో కేటీఆర్ సాక్షి, న్యూఢిల్లీ: హెల్త్ కేర్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన సంస్కరణలు చేపడుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం ఢిల్లీలో ఫార్మాసూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన హెల్త్‌కేర్ ఇండియా నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఫార్మా రంగ సమస్యలు, చేరుకోవాల్సిన లక్ష్యాలపై సమావేశంలో చర్చించారు. హైదరాబాద్‌లో ఫార్మా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలను కేటీఆర్ వివరించారు. వాటి ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఫార్మాసూటికల్ వర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
1,000 కోట్ల సమీకరణకు గ్లోబల్ హాస్పిటల్స్ రెడీ
వైదొలగనున్న ఎవర్‌స్టోన్, ఆనంద్ రాఠీ జనవరిలో డీల్ పూర్తికావొచ్చు గ్లోబల్ హాస్పిటల్స్ సీఎండీ రవీంద్రనాథ్ సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: హెల్త్‌కేర్ రంగంలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ హాస్పిటల్స్ రుణ భారాన్ని మరింత తగ్గించుకొని, ప్రస్తుతం ఇన్వెస్టర్లుగా కొనసాగుతున్న సంస్థలకు ఎగ్జిట్ దారి (తమ వాటాలను అమ్ముకొనేవీలు) చూపేందుకు వీలుగా నిధుల సమీకరణ చేపట్టింది. దీనికోసం రూ వెయ్యి కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెల్త్‌కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. శుక్రవారం సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ... బేరింగ్ ఏసియా, ఏటీ క్యాపిటల్, టీపీజీ గ్రోత్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ లాంటి సంస్థలతో నిధుల సమీకరణ సంబంధించి చర్చలు పలు దఫాలుగా జరిపామని, వీటితో పాటు మరిన్ని సంస్థలతో కూడా చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. ‘నిధుల సేకరణకు మేం సమాయత్తమౌతున్నాం. పలు సంస్థలతో చర్చలను ప్రారంభించాం. ప్రాధమిక దశలను దాటి చర్చల్లో మరింత స్పష్టమైన పురోగతి సాధించాం. జనవరిలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది’ అని రవీంద్రనాథ్ తెలిపారు. సంస్థలో ప్రధాన ఇన్వెస్టర్లయిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఎవర్‌స్టోన్ క్యాపిటల్ (35 శాతం), పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ ఆనంద్ రాఠీలకు (10 శాతం) కలిపి మొత్తం 45 శాతం వాటా ఉంది. గత ఏడు సంవత్సరాలుగా ఇందులో పెట్టుబడులు పెట్టారు. హెల్త్‌కేర్ రంగంలో మూలధనంపై వ్యయం (కాస్ట్ ఆఫ్ క్యాపిటల్) సంవత్సరానికి 15 శాతంపైనే ఉండటంతో రుణ భారాన్ని మోయడం తలకుమించిన భారం అవుతోంది. రుణ పత్రాల ద్వారా కాకుండా ఈక్విటీ నిధులను సమీకరించాలని గ్లోబల్ హాస్పిటల్స్ గత కొంత కాలంగా యోచిస్తోంది. 2016లో ఐపీవో ద్వారా పెట్టుబడుల మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. గ్లోబల్ హాస్పిటల్స్‌కు 2,200 పడకల సామర్థ్యంతో ప్రస్తుతం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై,ముంబైలలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లున్నాయి. కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులతో పాటు మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను విజయవంతంగా అందించే సంస్థగా గ్లోబల్ హాస్పిటల్స్ అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. హెల్త్ టూరిజం పెంపొందించటంలో ప్రధానపాత్ర పోషిస్తోంది. హాట్‌కేక్‌లా మారిన హెల్త్‌కేర్ రంగం.. హెల్త్‌కేర్ రంగం ప్రస్తుతం పెట్టుబడులకు హాట్‌కేక్‌లా మారింది. కొనుగోళ్లు, విలీనాలకు ఫార్మా తర్వాత హెల్త్‌కేర్ రంగం ముందుందని జియోజిత్ పీఎన్బీ పారిబస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ అలెక్స్ మ్యాథ్యూస్ తెలిపారు. పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించేందుకు హెల్త్‌కేర్ గ్లోబల్, ఎస్ఆర్ఎల్ డయాగ్నాస్టిక్స్ (ఫార్టిస్ గ్రూప్), ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, థైరో కేర్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయన్నారు. -
అవకాశాల గని.. ఆరోగ్య రాజధాని
ఇప్పటికే ఐటీ హబ్‌గా పేరుగాంచిన భాగ్యనగరి ప్రస్తుతం మెడికల్ హబ్‌గా అవతరిస్తోంది. వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల తోపాటు.. డాక్టర్ రెడ్డీస్, దివీస్ లేబొరేటరీస్, అరబిందో, శాంతా బయోటెక్నిక్స్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు నగరంలోనే కొలువుదీరాయి. మరోవైపు దేశవిదేశాల నుంచి వివిధ వ్యాధుల చికిత్స, మెరుగైన వైద్య సేవల కోసం నగరానికి వచ్చేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో హెల్త్‌కేర్ రంగం అపార అవకాశాల నిలయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో హెల్త్‌కేర్ రంగం విస్తరణ, ఇన్స్టిట్యూట్లు, కోర్సులు, ఉద్యోగావకాశాలపై ఫోకస్.. భారత్‌లో హెల్త్‌కేర్ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. తదనుగుణంగా ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నానాటికీ విస్తృతమవుతున్నాయి. ప్రస్తుతం మనదేశ ఆరోగ్య రంగంలో 3.8 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం ప్రతిఏటా 13.4 శాతం వృద్ధి సాధిస్తోంది. దీన్నిబట్టి 2022 నాటికి అదనంగా 13.3 మిలియన్ల మందికి అవకాశాలు దక్కనున్నాయి. ఈ సెక్టార్లో డిమాండ్, సప్లై మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అవసరానికి సరిపడ నిపుణులు లభించడం లేదు. భారత్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగంలో దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం 15 లక్షల ఫిజీషియన్లు, 10 లక్షల మంది నర్సులు అవసరం. డాక్టర్లు, నర్సులతోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజిస్టులు, డైటీషియన్లు, న్యూట్రీషనిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, హెల్త్‌కేర్ మేనేజర్లు భారీ సంఖ్యలో కావాలి. పారామెడికల్ కోర్సులతో ప్రయోజనం ఎంతో: డాక్టర్లకు సహాయకులుగా విధులు నిర్వహించే పారామెడికల్ నిపుణులకు కూడా మంచి అవకాశాలున్నాయి. ఎక్స్‌రే, స్కానింగ్, ఈసీజీ సేవలు అందించడం, యూరిన్, రక్త పరీక్షలు నిర్వహించడం ఇలా ఎన్నో విభాగాల్లో వీరికి ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్బోర్డ్ (ఏపీపీఎంబీ).. డిప్లొమా కోర్సుల్లో భాగంగా.. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ టెక్నీషియన్, హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మేల్), ఆఫ్తాల్మాలిక్ అసిస్టెంట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, పర్ఫ్యూషన్ టెక్నీషియన్, డయాలసిస్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనియస్ట్, మైక్రో సర్జరీ, ఎనస్థీషియా టెక్నీషియన్, క్యాత్‌ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, డార్క్‌రూం అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్ వంటి కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. తర్వాత ప్రాధాన్యతలవారీగా ఎంపీసీ, మిగిలిన గ్రూప్లవారికి ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీపీఎంబీ పరిధిలోనే ఈ కోర్సులు పూర్తిచేసినవారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అపోలో హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్, మెడ్విన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సెన్సైస్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (కిమ్స్)లకు సొంత పారామెడికల్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. యూనివర్సిటీలు, కోర్సులు.. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. ఎంబీఏలో హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమాలో హెల్త్ కమ్యూనికేషన్, హెల్త్ ఫిట్‌నెట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందిస్తోంది. వివరాలకు వెబ్సైట్: www.uohyd.ac.in. సిటీలో కొలువుదీరిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సహకారంతో) ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.braou.ac.in చూడొచ్చు. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో).. పీజీ డిప్లొమాలో భాగంగా హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. బ్యాచిలర్స్ డిగ్రీలో నర్సింగ్ (పోస్ట్ బేసిక్), డిప్లొమా కోర్సుల్లో నర్సింగ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తోంది. సర్టిఫికెట్ కోర్సుల్లో భాగంగా న్యూట్రిషన్ అండ్ చైల్డ్‌కేర్, న్యూబార్న్ అండ్ ఇన్ఫాంట్ కేర్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌కేర్, హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇగ్నోకు హైదరాబాద్‌లో ప్రాంతీయ కేంద్రం ఉంది. వివరాలకు: http://rchyderabad.ignou.ac.in/ ఉద్యోగావకాశాలు: ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. కార్పొరేట్ ఆస్పత్రులు.. తమ శాఖలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. 1500 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ పబ్లిక్ హెల్త్ సెంటర్ (పీహెచ్సీ)లు ఏర్పాటు కానున్నాయి. వీటన్నింటిలో వైద్యులు మొదలుకొని, ఫార్మసిస్ట్, పారామెడికల్ నిపుణులు, హాస్పిటల్ మేనేజ్మెంట్ - అడ్మినిస్ట్రేటర్లు, క్లినికల్ రీసెర్చ్ నిపుణుల వరకు అవసరం ఎంతగానో ఉంది. భారత్.. మెడికల్ టూరిజానికి హబ్‌గా మారుతోంది. విదేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందుతోంది. మనదేశం అందించే ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో వైద్య అవసరాల కోసం భారత్‌ను, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలను సందర్శించేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇలా మనదేశానికి వచ్చేవారి సంఖ్య ఏటా నాలుగు లక్షల వరకు ఉంటోంది. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 12 లక్షలకు చేరుకుంటుందని ఒక అంచనా! ఈ క్రమంలో వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు లభించడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక సంస్థ.. కోర్సులు: నగరంలో కొలువుదీరిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) కూడా బీఎస్సీ (నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ), మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ), మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం), పీజీ డిప్లొమా ఇన్ పారామెడికల్ సెన్సైస్, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ (పార్ట్‌టైం), పీజీ కోర్స్ ఇన్ డయాబెటీస్ వంటి కోర్సులను అందిస్తోంది. కోర్సును బట్టి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ http://www.nims.edu.in/ చూడొచ్చు. ఫార్మా కోర్సులు: ఫార్మాలో డిప్లొమా ఇన్ ఫార్మసీ నుంచి బీఫార్మసీ, ఫార్మ్‌డీ, ఎంఫార్మసీ, ఎంబీఏలో ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నగరంలో ఎన్నో విద్యా సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఫార్మా కోర్సులను అందించడంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)కు ఉత్తమ సంస్థగా గుర్తింపు ఉంది. ఈ సంస్థ నగరంలోనే కొలువుదీరింది. ఇక్కడ ఎంఫార్మ్, పీహెచ్డీ (ఫార్మసీ)లో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. హెల్త్‌కేర్‌లో విస్తృత అవకాశాలు శ్రీ హెల్త్‌కేర్ రంగంలో నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఏటా 15శాతం వృద్ధిని నమోదు చేస్తున్న ఈ రంగంలో నైపుణ్యాలున్న సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అవసరాలకు, అందుబాటులోని మానవ వనరు లకు మధ్య.. బాగా అంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హెల్త్‌కేర్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయనడంలో సందేహం లేదు. హెల్త్‌కేర్ రంగంలో పనిచేయాలంటే సాఫ్ట్ స్కిల్స్ ఎంతో ప్రధానం. వాటితోపాటు టెక్నికల్, మెడికల్ నైపుణ్యాలుండాలి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఉన్నత బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. తప్పులు చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తే లభించే తృప్తే గొప్ప ప్రోత్సాహకరంగా ఉంటుంది. - డా.కె. హరిప్రసాద్, సీఈఓ- సెంట్రల్ రీజియన్, అపోలో హాస్పిటల్స్ -
అవకాశాల వేదిక.. ఆప్టోమెట్రీ
దేశంలో హెల్త్ కేర్ రంగంలో విస్తృత అవకాశాలు కల్పిస్తున్న మరో రంగం ఆప్టోమెట్రీ. కళ్లలో ఏర్పడే సమస్యలను గుర్తించడం, సంబంధిత పరీక్షలను నిర్వహించడం, తగిన చికిత్సను సూచించడం వంటి అంశాలను అధ్యయనం చేసే శాస్త్రమే ఆప్టోమెట్రీ. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించటంలో ఆప్టోమెట్రీషియన్ల పాత్ర ఎంతో కీలకం. అవసరాలకు సరిపడ మానవవనరులు లేకపోవడంతో ఇటీవలి కాలంలో ఈ కోర్సుకు చాలా డిమాండ్ ఏర్పడింది. దాంతో కోర్సు పూర్తయిన వెంటనే జాబ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆప్టోమెట్రీ కెరీర్‌పై ఫోకస్.. ఆప్టోమెట్రీ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ‘ఆప్టోస్’ అంటే కళ్లు లేదా చూపు, ‘మెటీరియా’ అంటే కొలత అని అర్థం. కంటి ఆసుపత్రుల్లో నేత్ర వైద్యులకు అనుబంధంగా సేవలు అందించే వృత్తి నిపుణులను ఆప్టోమెట్రీస్ట్స్‌గా వ్యవహరిస్తారు. ఒక అంచనా మేరకు దేశంలో ప్రతి రెండులక్షల జనాభాకు ఒక ఆప్టోమెట్రీషియన్ ఉన్నాడు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే ఇది చాలా స్వల్పం. అమెరికా, యూరోపియన్ దేశాల్లో ప్రతి 10 వేల మంది జనాభాకు ఒక ఆప్టోమెట్రీషియన్ ఉన్నాడు. పెరుగుతున్న జనాభా, అవసరాల దృష్ట్యా దేశంలో నేడు రెండు లక్షల మంది క్వాలిఫైడ్ ఆప్టోమెట్రీషియన్ల అవసరం ఉంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఆప్టోమెట్రీ రంగం 20 శాతం మేర విస్తరిస్తోంది. దాంతో ఆమేరకు అవకాశాలు అధికమవుతున్నాయి. ప్రవేశం ఇలా: ఆప్టోమెట్రిక్ రంగానికి సంబంధించి విభిన్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అభ్యసించడం ద్వారా ఈ రంగంలోకి ప్రవేశించవచ్చు. దేశంలో ఆప్టోమెట్రీకి సంబంధించి అందుబాటులో ఉన్న కోర్సులు.. బీఎస్సీ ఆనర్స్ ఇన్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్, డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, బ్యాచిలర్ ఇన్ క్లినికల్ ఆప్టోమెట్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ. వీటికి అర్హత 10వ తరగతి/ఇంటర్మీడియెట్ (సెన్సైస్). ఉన్నత విద్య విషయానికొస్తే..ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ కోర్సు తర్వాత పీజీ చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఎంఆప్ట్, ఎంఫిల్, ఎంఎస్, పీహెచ్డీ కోర్సులను ఎంచుకోవచ్చు. అమెరికాలో ఓడీ (డాక్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ) కోర్సు చేయవచ్చు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ: ఇగ్నో... ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్తాల్మిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్స్ సహకారంతో బీఎస్సీ (ఆనర్స్) ఇన్ ఆప్టోమెట్రీ అండ్ ఆఫ్తాల్మిక్ టెక్నిక్స్ కోర్సును నిర్వహిస్తుంది. అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ). ప్రతి ఏడాది జూన్ నుంచి అకడెమిక్ సెషన్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం డిసెంబర్ నుంచి మే 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అర్హత కోర్సులో సాధించిన మార్కులు (90 శాతం వెయిటేజీ), ఇంటర్వ్యూ(10 శాతం వెయిటేజీ) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. థియరీ క్లాసులను ఇగ్నో నిర్వహిస్తుంది. ప్రాక్టికల్స్ మాత్రం సంబంధిత ఐ హాస్పిటల్స్/ఐ రీసెర్చ్ సెంటర్స్/ ఐ ఇన్స్టిట్యూట్లలో ఉంటాయి. వివరాలకు: www.ignou.ac.in మన రాష్ట్రంలో: మన రాష్ట్రంలో ఆప్టోమెట్రీకి సంబంధించి డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్ (డీఓఎం), డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ (డీఓఏ), బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆప్టోమెట్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వివరాలు.. డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్: ఈ కోర్సుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి 614 సీట్లు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్: ఈ కోర్సుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కలిపి 1,781 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హత: ఇంటర్మీడియెట్(బైపీసీ). సీట్లకు సరిపడ విద్యార్థులు లేనిపక్షంలో ఎంపీసీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం సాధారణంగా జూన్/జూలై నెలలో వెలువడుతుంది. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు కౌన్సెలింగ్ ద్వారా ఈ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తుంది. వివరాలకు: www.appmb.org బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆప్టోమెట్రీ: మన రాష్ట్రంలో ఈ కోర్సును బిట్స్-పిలానీ సహకారంతో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్‌కు చెందిన బాస్క్ అండ్ లాంబ్ స్కూల్ అందిస్తోంది. వ్యవధి: నాలుగేళ్లు. అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ/ఎంపీసీ). అడ్మిషన్ ప్రక్రియ జూలైలో ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేస్తున్న ఇతర కోర్సులు.. ఆప్టోమెట్రీ ఇంటర్న్‌షిప్: మూడేళ్ల ఆప్టోమెట్రీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఆప్టోమెట్రీ ఫెలోషిప్: బీఎస్సీ-ఆప్టోమెట్రీ అర్హత ఉన్న విద్యార్థులకు ఏడాది ఫెలోషిప్, డిప్లొమా ఉన్న విద్యార్థులకు రెండేళ్ల ఫెలోషిప్ అందజేస్తున్నారు. విజన్ టెక్నిషియన్ కోర్సు: అర్హత: 10+2. ఏడాదికి రెండు సార్లు.. ఫిబ్రవరి, ఆగస్ట్‌లలో అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది. వివరాలకు: http://education.lvpei.org భారత్ సేవక్ సమాజ్(బీఎస్ఎస్-కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత సంస్థ) ఒకేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సులకు 10వ తరగతి ఉత్తీర్ణత చాలు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సులు చేసిన అభ్యర్థులకు మంచి డిమాండ్ ఉంది. చిన్నచిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రాధమిక కంటి ఆసుపత్రులు, ఆప్టికల్స్ షోరూంలను నిర్వహించడం ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు. నెలకు కనీసం రూ.15వేలకు పైగా సంపాదించవచ్చు. ఏపీ పారా మెడికల్ బోర్డు నిర్వహించే ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సులకు సాధారణంగా ప్రతి జూన్ రెండో వారంలో నోటిఫికేషన్ వెలువడుతుంది. ఏపీ పారా మెడికల్ బోర్డు ద్వారా కోర్సులు చేసిన వారికి మన రాష్ట్రంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలో తప్పనిసరిగా ఆప్టోమెట్రీ, ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ పోస్టులను ఏర్పాటు చేయాలి. ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు స్కూల్ ఐ హెల్త్ సర్వే, మొబైల్ ఐ క్యాంపులు, కేటరాక్ట్ స్క్రీనింగ్ చేయడంతోపాటు రిఫ్రాక్స్నిస్టుగా పనిచేయవచ్చు. - డాక్టర్ కోలా విజయ్‌శేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్, సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల. అవకాశాలు ఒక్క భారతదేశంలోనే దాదాపు కోటిమందికి అంధత్వమున్నట్లు అంచనా. వీటిలో దాదాపు 80 శాతం అంధత్వ సమస్యలను శిక్షణ పొందిన నిపుణుల సేవలు, ప్రాథమిక వసతులు కల్పించడం ద్వారా ప్రారంభస్థాయిలోనే నివారించవచ్చు. ఈ నేపథ్యంలో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్ సేవలు ఎంతో కీలకమైనవి. కాబట్టి ఆప్టోమెట్రీ రంగంలో కోర్సులు పూర్తి చేసిన వారికి వెంటనే ఉపాధి ఖాయమని చెప్పొచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌గా కెరీర్ మొదలు పెట్టొచ్చు. తర్వాత అర్హత, అనుభవం ఆధారంగా సొంతంగా క్లినిక్ ప్రారంభించవచ్చు. ఐ హాస్పిటల్స్, ఐ బ్యాంక్స్, కంటాక్ట్ లెన్స్-ఆఫ్తాల్మిక్ పరిశ్రమలు, ఆప్టికల్ షో రూమ్స్, ఐ-కేర్ సంబంధిత ప్రొడక్ట్స్‌ను తయారు చేసే సంస్థలు వీరికి కెరీర్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆసక్తి ఉంటే సంబంధిత కోర్సులను ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్లలో ఫ్యాకల్టీగా కూడా స్థిరపడొచ్చు. ఒకప్పటిలా కేవలం పట్టణాలకే పరిమితం కాకుండా మండల కేంద్రాల్లోను ఐ హాస్పిటల్స్ విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రంగంలోకి ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు కూడా ప్రవేశించడం.. సదరు అభ్యర్థులకు డిమాండ్‌ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో సంబంధిత వైద్యులకు సహాయం చేసే ఆప్టోమెట్రీషియన్ల అవసరం కూడా అనివార్యమైంది. ఈ నేపథ్యంలో కూడా విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో కూడా ఆప్టోమెట్రిక్ అభ్యర్థులకు అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తోన్న క్రమంలో కొత్తగా మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులను నెలకొల్పుతుండడం, ఖాళీగా ఉన్న పారా మెడికల్ పోస్టులను భర్తీ చేస్తుండడం కూడా ఆప్టోమెట్రీ అభ్యర్థులకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా ఈఎస్ఐ, ఆర్మ్డ్ ఫోర్సెస్ వంటి ప్రభుత్వ విభాగాలు కూడా వీరిని నియమించుకుంటాయి. వేతనాలు: కెరీర్ ప్రారంభంలో సంబంధిత ఫిజిషియన్స్, ఇన్స్టిట్యూట్, క్లినిక్స్‌లో అసిస్టెంట్‌గా పని చేయాలి. ఈ సమయంలో వీరికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు లభిస్తుంది. తర్వాత ఈ రంగంలోని ఉన్నత విద్య పూర్తి చేయడం ద్వారా డాక్టర్‌కు సమానమైన హోదాకు చేరుకోవచ్చు. ఈ సమయంలో నెలకు రూ. 30 వేల నుంచి రూ. 60 వేల వరకు సంపాదించవచ్చు. కావల్సిన లక్షణాలు సేవా దృక్ఫథం, ఓర్పు, సహనం, అంకిత భావం కళ్లు, లెన్సెస్‌తో పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి కచ్చితత్వం, సున్నితత్వాన్ని కలిగి ఉండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, సమయస్ఫూర్తి సమయంతో నిమిత్తం లేకుండా కష్టపడే తత్వం నిర్ణయాత్మక సామర్థ్యం జట్టుగా, సమన్వయంతో పని చేసే తత్వం శాస్త్రీయ వైఖరి, విశ్లేషణాత్మక సామర్థ్యం అనుకూలతలు: చక్కని హోదా-ఆకర్షణీయమైన వేతనం మాంద్యం సోకని ఎవర్ గ్రీన్ ప్రొఫెషన్ ఉన్నత విద్యనభ్యసిస్తున్న సమయంలో పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు {పతి ఏటా విస్తరిస్తోన్న రంగం టాప్ మెడికల్ ప్రొఫెషన్లలో ఒకటి ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ -న్యూఢిల్లీ ఆంధ్రా మెడికల్ కాలేజీ-విశాఖపట్నం భారతీ విద్యాపీఠ్ యూనివర్సిటీ-పుణే ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్-హైదరాబాద్ సరోజినీ దేవి ఐ హాస్పిటల్-హైదరాబాద్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్-పిలానీ మణిపాల్ యూనివర్సిటీ-మణిపాల్