కరోనా ఫస్ట్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొని ప్రపంచ దేశాలతో భేష్ అనిపించుకున్నాం. సెకండ్ వేవ్ వచ్చేసరికి చతికిలపడిపోయి చిన్నాచితకా దేశాల సాయం కూడా తీసుకున్నాం. మరి ఒకవేళ మూడో వేవ్ వస్తే ఎలా ఎదుర్కోగలం? పులి మీద పుట్రలా కొత్తగా పుట్టుకొచ్చిన డెల్టా ప్లస్ మరింత దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం కేసులు తగ్గి పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నా సెప్టెంబర్–అక్టోబర్‌లో థర్డ్ వేవ్ కాటేస్తుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అందరికీ వ్యాక్సినేషన్‌తో పాటు థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగ నిపుణులు చెప్పిన సలహాలు, సూచనలు, ప్రభుత్వాల సన్నద్ధత ఏమిటో చూద్దాం...
కరోనా పరీక్షలు
దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కరోనా పరీక్ష కేంద్రాలు, శాంపిల్ సేకరణ కేంద్రాలు లేవు. దేశం మొత్తం మీద 735 జిల్లాలకు గాను 31 జిల్లాల్లో ప్రజలకి కరోనా సోకిందన్న అనుమానం వస్తే పరీక్ష చేయించుకోవాలంటే మరో జిల్లాకు వెళ్లాలి. కరోనాని అరికట్టాలంటే త్వరగా పరీక్షలు నిర్వహించడం అంత్యంత ముఖ్యం. ప్రతి ఒక్కరికీ కిలోమీటర్ దూరంలోనే శాంపుల్ కలెక్షన్ కేంద్రాలు పెడితేనే థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడం సాధ్యపడుతుంది.
నిరుపేదలకు వైద్యం
మన దేశంలో నిరుపేదలకు వైద్యం అందుబాటులో లేదు. నేషనల్ స్టాటస్టికల్ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఓ) గణాంకాల ప్రకారం మన దేశ జనాభాలో 30% మందికి జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి వైద్యుల్ని సంప్రదించే అలవాటు లేదు. సెకండ్ వేవ్‌లో కోవిడ్ గ్రామాలకూ విస్తరించింది. అందువల్ల గ్రామీణుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు చేపట్టాలి. లక్షణాలను తేలికగా తీసుకోవద్దనేది ప్రజల్లోకి వెళ్లాలి. అప్పుడే కరోనా వ్యాప్తి నిరోధానికి అడ్డుకట్ట పడుతుంది.
ఆస్పత్రులు– ఆర్థిక భారం
కరోనా సోకి ఆస్పత్రికి వెళ్లాలంటే దడ పుట్టే రోజులున్నాయి. లక్షలకి లక్షలు బిల్లు చెల్లించలేక జనం కుదేలైపోతున్నారు. దేశ ప్రజల్లో 81% మంది నెలకి వచ్చే ఆదాయంలోనే ఆస్పత్రి ఖర్చులు కూడా భరించాలి. కరోనా వంటివి వస్తే అప్పో సొప్పో చేయాల్సిన దుస్థితి. మిగిలిన వారు ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. అందుకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలి.
హెల్త్ ఇన్సూరెన్స్‌లు
మొదటి రెండు కరోనా వేవ్‌లలో ఆస్పత్రి పాలైన కోవిడ్–19 రోగుల్లో 75 శాతం మందికి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ ఉన్న వారికి కరోనా చికిత్స మొత్తం కవర్ కావడం లేదు. నేషనల్ స్టాటస్టికల్ ఆఫీసు (ఎన్‌ఎస్‌ఓ) అంచనాల ప్రకారం రోగులకయ్యే మొత్తం ఖర్చులో 10 శాతం కూడా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి తిరిగి రావడం లేదు. దీంతో లక్షల్లో బిల్లులు కట్టుకోలేక జనం కరోనా పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. అదే హెల్త్ ఇన్సూరెన్స్ వ్యవస్థను పటిష్టపరిస్తే కరోనా రోగులు ధీమాగా ఆస్పత్రికి వెళ్లే రోజులొస్తాయి.
ఆక్సిజన్ ప్లాంట్స్
కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ లేక మనుషులు పిట్టల్లా రాలిపోయారు. థర్డ్ వేవ్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పీఎం కేర్ ఫండ్స్ నిధులను వినియోగించి వివిధ జిల్లాల్లో 850 వరకు ఆక్సిజన్ ప్లాంట్లను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) ఏర్పాటు చేయడానికి సన్నాహాలు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి... పరిస్థితిని మెరుగుపరిచే దిశగా పలు చర్యలు చేపట్టాయి. స్వయం సమృద్ధంగా ఉండటానికే మొగ్గుచూపుతున్నాయి.
మాడ్యులర్ ఆస్పత్రులు
కరోనా సెకండ్‌వేవ్‌లో ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీ లేక, వైద్యం అందక సంభవించిన మరణాలు చూశాం. దానిని అధిగమించాలంటే మరిన్ని ఆస్పత్రులు ఉండాలి.. ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయి ఆస్పత్రుల నిర్మాణం సాధ్యం కాదు కాబట్టి ఆరోగ్య రంగ నిపుణులు మాడ్యులర్ ఆస్పత్రుల వైపు చూస్తున్నారు. ప్రధాన ఆస్పత్రికి అనుబంధంగా కట్టే ఈ ఆస్పత్రుల్ని రూ.3 కోట్ల ఖర్చుతో మూడు వారాల్లో నిర్మించడానికి అవకాశం ఉంటుంది. ఆరు నుంచి ఏడు వారాల్లో ఈ ఆస్పత్రుల్ని అందుబాటులోకి తీసుకురావచ్చు. ఆక్సిజన్ ప్లాంట్, ఐసీయూ సౌకర్యాలన్నీ ఇందులో ఉంటాయి. వారం రోజుల వ్యవధిలో అవసరమైన చోటుకి తరలించే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఆస్పత్రుల్ని 20, 50, 100 పడకలతో 50 వరకు నిర్మించడానికి కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది.
పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై అధిక ప్రభావం ఉంటుందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ, దీనిపై ఎక్కువగా ప్రచారం జరగడంతో పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, గోవా, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు పీడియాట్రిక్ కోవిడ్ కేర్ వార్డుల్ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌లు పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేశాయి.
కొత్త వైద్యులకు శిక్షణ
కోవిడ్ రోగుల సంఖ్య పెరిగపోవడం, కళ్ల ముందే రోగులు ప్రాణాలు వదిలేయడం, పీపీఈ కిట్లలో వాష్‌రూమ్‌కి వెళ్లే అవకాశం కూడా లేక గంటల తరబడి పని చేయడం వల్ల వైద్య సిబ్బంది నిస్సహాయులైపోతున్నారు. కోవిడ్ తర్వాత దేశంలో దాదాపు 13 లక్షల మంది డాక్టర్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన దేశంలో ప్రతీ 1,456 మందికి ఒక్క డాక్టర్ మాత్రమే ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందుకే వైద్య రంగంలోకి వచ్చిన జూనియర్ డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది కి శిక్షణ ఇస్తే వైద్యుల కొరత సమస్యని అధిగమించవచ్చు. మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడులు వైద్యలకు శిక్షణనిచ్చే అంశంపై దృష్టి సారించాయి.
హోం క్వారంటైన్ వ్యవస్థ
మన దేశంలో అధికశాతం కరోనా రోగులు ఇళ్లల్లోనే ఉండి కోలుకుంటున్నారు. ఇలాంటి రోగులకు కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ వారి ఆరోగ్యంపై పర్యవేక్షణ పెంచాలి. ఫోన్లలోనే వైద్యులు నిరంతరం వారి ఆరోగ్యాన్ని చూసే సదుపాయాలు కల్పించాలి.
–సాక్షి, నేషనల్ డెస్క్
పర్యవేక్షణే కీలకం
భారత్ కరోనా మూడో వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే నిరంతర పర్యవేక్షణ అత్యంత కీలకం. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న సమాచారంతో నిరంతరం అధ్యయనాలు చేస్తూ గ్రామాల్లో కోవిడ్ పరీక్షా కేంద్రాలను పెంచాలి. సెరో సర్వేలు చేస్తూ కరోనా ప్రబలే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలి. విస్తృతంగా పరిశోధనలు చేసి వివిధ కరోనా వేరియంట్లు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలి. దీనికి ఒక కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి.
– డాక్టర్ సౌమ్య స్వామినాథన్, డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్
Comments
Please login to add a commentAdd a comment