అవకాశాల గని.. ఆరోగ్య రాజధాని | City set to become a medical hub soon | Sakshi
Sakshi News home page

అవకాశాల గని.. ఆరోగ్య రాజధాని

Published Wed, Jul 23 2014 3:11 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

అవకాశాల గని.. ఆరోగ్య రాజధాని - Sakshi

అవకాశాల గని.. ఆరోగ్య రాజధాని

ఇప్పటికే ఐటీ హబ్‌గా పేరుగాంచిన భాగ్యనగరి ప్రస్తుతం మెడికల్ హబ్‌గా అవతరిస్తోంది. వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల తోపాటు.. డాక్టర్ రెడ్డీస్, దివీస్ లేబొరేటరీస్, అరబిందో, శాంతా బయోటెక్నిక్స్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు నగరంలోనే కొలువుదీరాయి. మరోవైపు దేశవిదేశాల నుంచి వివిధ వ్యాధుల చికిత్స, మెరుగైన వైద్య సేవల కోసం నగరానికి వచ్చేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో హెల్త్‌కేర్ రంగం అపార అవకాశాల నిలయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో హెల్త్‌కేర్ రంగం విస్తరణ, ఇన్‌స్టిట్యూట్లు, కోర్సులు, ఉద్యోగావకాశాలపై ఫోకస్..
 
 భారత్‌లో హెల్త్‌కేర్ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. తదనుగుణంగా ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నానాటికీ విస్తృతమవుతున్నాయి. ప్రస్తుతం మనదేశ ఆరోగ్య రంగంలో 3.8 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం ప్రతిఏటా 13.4 శాతం వృద్ధి సాధిస్తోంది. దీన్నిబట్టి 2022 నాటికి అదనంగా 13.3 మిలియన్ల మందికి అవకాశాలు దక్కనున్నాయి. ఈ సెక్టార్‌లో డిమాండ్, సప్లై మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అవసరానికి సరిపడ నిపుణులు లభించడం లేదు. భారత్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగంలో దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం 15 లక్షల ఫిజీషియన్లు, 10 లక్షల మంది నర్సులు అవసరం. డాక్టర్లు, నర్సులతోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజిస్టులు, డైటీషియన్లు, న్యూట్రీషనిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, హెల్త్‌కేర్ మేనేజర్లు భారీ సంఖ్యలో కావాలి.
 
 పారామెడికల్ కోర్సులతో ప్రయోజనం ఎంతో:
 డాక్టర్లకు సహాయకులుగా విధులు నిర్వహించే పారామెడికల్ నిపుణులకు కూడా మంచి అవకాశాలున్నాయి. ఎక్స్‌రే, స్కానింగ్, ఈసీజీ సేవలు అందించడం, యూరిన్, రక్త పరీక్షలు నిర్వహించడం ఇలా ఎన్నో విభాగాల్లో వీరికి ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్‌బోర్డ్ (ఏపీపీఎంబీ).. డిప్లొమా కోర్సుల్లో భాగంగా.. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ టెక్నీషియన్, హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మేల్), ఆఫ్తాల్మాలిక్ అసిస్టెంట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, పర్‌ఫ్యూషన్ టెక్నీషియన్, డయాలసిస్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనియస్ట్, మైక్రో సర్జరీ, ఎనస్థీషియా టెక్నీషియన్, క్యాత్‌ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, డార్క్‌రూం అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్ వంటి కోర్సులను అందిస్తోంది.

ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. తర్వాత ప్రాధాన్యతలవారీగా ఎంపీసీ, మిగిలిన గ్రూప్‌లవారికి ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీపీఎంబీ పరిధిలోనే ఈ కోర్సులు పూర్తిచేసినవారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి.  అపోలో హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్, మెడ్విన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, యశోద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సెన్సైస్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (కిమ్స్)లకు సొంత పారామెడికల్ ఇన్‌స్టిట్యూట్లు ఉన్నాయి.
 
 యూనివర్సిటీలు, కోర్సులు..
 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. ఎంబీఏలో హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమాలో హెల్త్ కమ్యూనికేషన్, హెల్త్ ఫిట్‌నెట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను అందిస్తోంది. వివరాలకు వెబ్‌సైట్: www.uohyd.ac.in. సిటీలో కొలువుదీరిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ సహకారంతో) ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్  www.braou.ac.in చూడొచ్చు.
 
 ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో).. పీజీ డిప్లొమాలో భాగంగా హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్‌మెంట్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. బ్యాచిలర్స్ డిగ్రీలో నర్సింగ్ (పోస్ట్ బేసిక్), డిప్లొమా కోర్సుల్లో నర్సింగ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తోంది. సర్టిఫికెట్ కోర్సుల్లో భాగంగా న్యూట్రిషన్ అండ్ చైల్డ్‌కేర్, న్యూబార్న్ అండ్ ఇన్‌ఫాంట్ కేర్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌కేర్, హెచ్‌ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇగ్నోకు హైదరాబాద్‌లో ప్రాంతీయ కేంద్రం ఉంది.  వివరాలకు: http://rchyderabad.ignou.ac.in/    
 
 ఉద్యోగావకాశాలు:
  ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. కార్పొరేట్ ఆస్పత్రులు.. తమ శాఖలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. 1500 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ పబ్లిక్ హెల్త్ సెంటర్ (పీహెచ్‌సీ)లు ఏర్పాటు కానున్నాయి. వీటన్నింటిలో వైద్యులు మొదలుకొని, ఫార్మసిస్ట్, పారామెడికల్ నిపుణులు, హాస్పిటల్ మేనేజ్‌మెంట్ - అడ్మినిస్ట్రేటర్లు, క్లినికల్ రీసెర్చ్ నిపుణుల వరకు అవసరం ఎంతగానో ఉంది.  
 
   భారత్.. మెడికల్ టూరిజానికి హబ్‌గా మారుతోంది. విదేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందుతోంది. మనదేశం అందించే ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో వైద్య అవసరాల కోసం భారత్‌ను, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలను సందర్శించేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇలా మనదేశానికి వచ్చేవారి సంఖ్య ఏటా నాలుగు లక్షల వరకు ఉంటోంది. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 12 లక్షలకు చేరుకుంటుందని ఒక అంచనా! ఈ క్రమంలో వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు లభించడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు.
 
 ప్రతిష్టాత్మక సంస్థ.. కోర్సులు:
 నగరంలో కొలువుదీరిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) కూడా బీఎస్సీ (నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ), మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ), మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ (ఎంహెచ్‌ఎం), పీజీ డిప్లొమా ఇన్ పారామెడికల్ సెన్సైస్, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ (పార్ట్‌టైం), పీజీ కోర్స్ ఇన్ డయాబెటీస్ వంటి కోర్సులను అందిస్తోంది. కోర్సును బట్టి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. మరిన్ని వివరాలకు  వెబ్‌సైట్ http://www.nims.edu.in/ చూడొచ్చు.  
 
 ఫార్మా కోర్సులు:
 ఫార్మాలో డిప్లొమా ఇన్ ఫార్మసీ నుంచి బీఫార్మసీ, ఫార్మ్‌డీ, ఎంఫార్మసీ, ఎంబీఏలో ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నగరంలో ఎన్నో విద్యా సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఫార్మా కోర్సులను అందించడంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)కు ఉత్తమ సంస్థగా గుర్తింపు ఉంది. ఈ సంస్థ నగరంలోనే కొలువుదీరింది. ఇక్కడ ఎంఫార్మ్, పీహెచ్‌డీ (ఫార్మసీ)లో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.  
 
 హెల్త్‌కేర్‌లో విస్తృత అవకాశాలు

శ్రీ హెల్త్‌కేర్ రంగంలో నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఏటా 15శాతం వృద్ధిని నమోదు చేస్తున్న ఈ రంగంలో నైపుణ్యాలున్న సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అవసరాలకు, అందుబాటులోని మానవ వనరు లకు మధ్య.. బాగా అంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హెల్త్‌కేర్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయనడంలో సందేహం లేదు. హెల్త్‌కేర్ రంగంలో పనిచేయాలంటే సాఫ్ట్ స్కిల్స్ ఎంతో ప్రధానం. వాటితోపాటు టెక్నికల్, మెడికల్ నైపుణ్యాలుండాలి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఉన్నత బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. తప్పులు చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తే లభించే తృప్తే గొప్ప ప్రోత్సాహకరంగా ఉంటుంది.
 - డా.కె. హరిప్రసాద్,
 సీఈఓ- సెంట్రల్ రీజియన్, అపోలో హాస్పిటల్స్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement