Doctor reddys
-
ప్రపంచంలో ప్రతీది ప్రకృతితో ముడిపడి ఉంటుంది: జి.వి. ప్రసాద్
ఒక ఫొటో వెయ్యి పదాలకు సమానం. పక్షులు, వన్య్రప్రాణల ఫొటోలు తీయాలంటే, గంటల కొద్దీ వేచి చూడాలి. వాటి ప్రశాంతతకు భంగం కలగకుండా ఫొటోలు తీయడం కత్తిమీద సాములాంటిదే. పారిశ్రామికవేత్త, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జి.వి. ప్రసాద్‌కి మాత్రం అది ఆటవిడుపు. ఆయన దేశ విదేశాల్లో పర్యటించి తీసిన ఫొటోలతో ఇటీవల ‘ది బర్డ్స్ అండ్ బిలీఫ్స్’ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా... సాక్షితో సంభాషణ. ►ఔషధాల తయారీ రంగంలో తీరిక లేకుండా ఉండే మీకు, పక్షుల కోసం పర్యటనలు, ఫొటోగ్రఫీ హాబీ ఎప్పటి నుంచి? గత పది, పదిహేనేళ్లుగా ఫొటోగ్రఫీ చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా పర్యటించి, స్వయంగా తీసిన ఫొటోల సమాహారమే ఈ పుస్తకం. కొన్ని ఫొటోలతో పుస్తకాన్ని తీసుకురావాలని, మరికొన్నింటితో ప్రదర్శన ఏర్పాటు చేయాలని నా ఆలోచన. గతంలో రెండు పుస్తకాలు ప్రచురించాను. ఒకటి అలాస్కా మీద, మరొకటి స్పితి వ్యాలీ. ఇది మూడో పుస్తకం. ► ‘బర్డ్స్ అండ్ బిలీఫ్స్’ లో మంచి కొటేషన్లు కూడా కనిపిస్తున్నాయి! నన్ను ప్రభావితం చేసే సూక్తులు కనిపించినప్పడు, విన్నప్పుడు పుస్తకంలో రాసుకోవడం నాకు పాతికేళ్లుగా అలవాటు. వాటిలో కొన్నింటిని ఇందులో పొందుపరిచాను. ఈ పుస్తకం నా అభిరుచికి, జ్ఞాపకాలకు నిలువుటద్దం. ►ఇందులో ఏఏ ప్రదేశాల పక్షులున్నాయి? మనదేశంలో దక్షిణాదిలో హైదరాబాద్, ఉత్తరాది నుంచి భరత్పూర్, కాన్హా నేషనల్ పార్క్. ఆఫ్రికా ఖండంలో కెన్యా, టాంజానియా, బొట్సువానా, నార్త్ ఆర్కిటిక్, అంటార్కిటికా తదితర ప్రాంతాల పక్షుల ఫొటోలున్నాయి. ఆంటార్కిటికాలో పెంగ్విన్స్ కూడా తీశాను. నార్త్ అమెరికాలో అలాస్కా కూడా కవర్ చేశాను. ఈ ప్రాంతాలలో కనిపించే పక్షులతో పాటు క్షీరదాలు, ప్రకృతి ఫొటోలూ తీశాను. కానీ, ఈ పుస్తకాన్ని మాత్రం పక్షుల కోసమే కేటాయించాను. ►వలస పక్షులు భారీగా వచ్చే ఆంధ్రప్రదేశ్, పులికాట్ సరస్సుకు వెళ్లారా? వెళ్లాను, ఫ్లెమింగో ఫొటోలు తీశాను. కానీ ఈ పుస్తకంలో ప్రచురించలేదు. ► బర్డ్ వాచింగ్ కోసం విభిన్నమైన అనేక ప్రాంతాలను సందర్శించారు. మీకు బాగా నచ్చిన ప్రదేశం, సందర్భం, ఫొటో ఏది? అలాస్కాలో ల్యాండ్ స్కేప్‌లు, మంచినీటి సరస్సులు, ఉప్పు నీటి చెరువులు, పొరలు పొరలుగా పేరుకుపోయిన మంచు... మొత్తంగా చూస్తే ప్రకృతి అద్భుతంగా స్ఫూర్తిదాయంగా అనిపిస్తుంటుంది. పెద్ద ఎలుగుబంట్లు, బాల్డ్ ఈగల్స్, సాల్మన్ చేపలతో పాటు రకరకాల చేపలుంటాయి. సముద్రం నుంచి మంచి నీటి సరస్సుల వైపుకు గుంపులుగా వచ్చే చేపల్ని చూడడం వర్ణించలేనటువంటి అనుభూతి. అలాగే మరొకటి... ఆఫ్రికాలో ప్రాణులు వలస వెళ్లడం. వైల్డ్ బీస్ట్ పెద్ద సంఖ్యలో నదిని దాటుతున్న దృశ్యం ఇప్పటికీ కళ్లముందు కదలాడుతోంది. ► ఆర్నిథాలజిస్టు ఆశిష్, కెమెరా మెళకువలు నేర్పిన సురేశ్ చిత్తూరి గురించి మీ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు! ఆశిష్‌తో చాలా ఏళ్ల పరిచయం. వాళ్ల పిల్లలు, మా పిల్లలు క్లాస్మేట్స్. బర్డ్ వాచింగ్‌ను పరిచయం చేసింది ఆయనే. ఇక శ్రీనివాస హ్యాచరీస్ సురేశ్ చిత్తూరి కూడా నాకు మంచి మార్గదర్శి. ► ఎన్నిరకాల పక్షులను ఫొటో తీశారు? రెండువందలకు పైగా పక్షి జాతులను ఫొటో తీశాను. ► మీ పుస్తకంలో పాలపిట్ట, కాకి, కోకిల కనిపించాయి. కానీ రామచిలుక కనిపించలేదు! అలాగే కొల్లేటి కొంగలు, చిల్కా సరస్సులో విహరించే పక్షులను మేము తర్వాతి పుస్తకంలో చూడవచ్చా? రామచిలుకల ఫొటో తీశాను. కానీ, పుస్తకానికి ఫొటోల ఎంపికలో వదలిపెట్టాను. కొల్లేరు వెళ్లలేదు. చిల్కా సరస్సుకు వచ్చే ఏడాది వెళదామనుకుంటున్నాను. ► మీ నేపథ్యం మొత్తం హైదరాబాదేనా? లేదు, పాక్షిక హైదరాబాదీని. నాల్గవ తరగతి వరకు హైదరాబాద్‌లో చదివాను. తర్వాత నెల్లూరులో 12వ తరగతి వరకు, రెండున్నరేళ్లు చెన్నై అన్నా యూనివర్సిటీ, ఆ తర్వాత చికాగోలో ఇలినాయీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజినీరింగ్, మాస్టర్స్ పర్డ్యూ (Purdue University) యూనివర్సిటీలో పూర్తి చేసి హైదరాబాద్‌కి వచ్చాను. ► పుస్తకం విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వన్య్ర΄ాణుల సంరక్షణ కోసం విరాళమని ప్రకటించారు. వన్య్రప్రాణుల సంరక్షణలో ప్రభుత్వం తగినంత శ్రద్ధ చూపట్లేదని అనుకుంటున్నారా? ప్రభుత్వం వన్య్రప్రాణుల సంరక్షణకు పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేస్తోంది. కానీ, ప్రభుత్వం ఒక్కటే అన్నింటినీ పరిష్కరించలేదు. వ్యక్తుల విరాళాలు చాలా ఉపయోగ పడతాయి. పర్యావరణం, వన్య్రప్రాణుల పరిరక్షణ ముఖ్యమైన అంశం అని నేను మద్దతు ఇస్తున్నాను. ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తున్నాం. పుస్తక విక్రయాలతో వచ్చే డబ్బు నాకవసరం లేదు. ఉచితంగా ఇస్తే పుస్తకం గౌరవం తగ్గిపోతుంది. అందుకే విక్రయాలను మంచి పనికి విరాళంగా ఇవ్వాలనుకున్నాను. ► అంజిరెడ్డి (డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకులు)గారు చెప్పినట్లుగా మన కుండ నిండిన తర్వాత, అదనంగా వచ్చి పడుతున్న నీటిని మరొకరికి ఉపయోగపడేలా చేయాలి అనే సూత్రాన్ని పాటిస్తున్నారా? ఆయన నుంచి అలాగే మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్నదేమిటి? మా నాన్నగారు (గ్రీన్ పార్క్ హోటల్ వ్యవస్థాపకులు) చాలా డీటెయిల్ ఓరియెంటెడ్. మనం చేస్తున్న పని గురించి సూక్ష్మ స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని చెబుతారు. వివరాలన్నీ సమగ్రంగా తెలుసుకున్న తర్వాతే మాట్లాడేవారు. మా మామగారు (అంజిరెడ్డి) విజన్ చాలా విస్తృతమైనది. వారిద్దరినీ ఒకే ’ఫ్రేమ్’లో చె΄్పాలంటే... ‘అడవి అందులో చెట్లు’ అని చెప్పవచ్చు. అంజిరెడ్డి గారి ద్వారా అడవిని చూస్తే, మా నాన్న గారి ద్వారా అందులో వృక్షాలను చూశాను. ► పాఠకులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ‘ప్రపంచంలోని ప్రతిదీ ప్రకృతితో ముడిపడి ఉంటుంది. మన ఆరోగ్యం అడవి ఆరోగ్యంతో ముడిపడి ఉంది. మన శ్రేయస్సు కోసం ప్రకృతి పరిరక్షణ తప్పనిసరి’ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ ‘కొంతవరకైనా ప్రకృతితో మమేకమవుదాం’ అనుకుంటే... ప్రకృతి పరిరక్షణ కోసం చేయగలిగిన చిన్న చిన్న పనులు అందరమూ చేయగలుగుతాం. శాస్త్రీయతకు గౌరవం డాక్టర్ రెడ్డీస్ సంస్థలో 1990 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్న జీవీ ప్రసాద్ ఆ సంస్థ ఎదుగుదల, 66 దేశాలకు విస్తరణలో తనవంతుగా విశేషమైన కృషి చేశారు. సశాస్త్రీయమైన పరిశోధనల పరంపరలో ఆయనను వరించిన కొన్ని ప్రత్యేక గుర్తింపులు... పురస్కారాలివి. వైపీఓ గ్లోబల్ ఇంపాక్ట్ అవార్డు– 2020 వి. కృష్ణమూర్తి అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ బై ద సెంటర్ ఫర్ ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్, 2019 బౌండరీ బ్రేకర్ లీడర్ అవార్డ్, సీఈఓ అవార్డ్స్ 2018 ఇండియా బిజినెస్ లీడర్ ఆఫ్ ద ఇయర్ బై సీఎన్‌బీసీ ఆసియా, 2015 ఇండియాస్ బెస్ట్ సీఈవో బై బిజినెస్ టుడే, 2014 ఇండియా టాలెంట్ మేనేజ్మెంట్ అవార్డ్ బై సీఎన్‌బీసీ ఆసియా, 2014 ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి -
DRDO రూపొందించిన 2DG సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్
-
2-డీజీ సాచెట్ ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్స్
సాక్షి, హైదరాబాద్: డీఆర్డీవో రూపొందించిన 2-డీజీ సాచెట్ ధరను రెడ్డీస్ ల్యాబ్స్ ప్రకటించింది. కరోనా చికిత్సలో 2-డీజీ సాచెట్ అద్భుతంగా పని చేస్తుందన్ని డీఆర్డీవో తెలిపింది. ఒక్కో 2డీజీ సాచెట్ ధర రూ.990గా రెడ్డీస్ ల్యాబ్స్ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది. కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’ ఔషధాన్నిడాక్టర్ రెడ్డీస్ గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి విదితమే. ముందుగా 10వేల సాచెట్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన విషయం తెలిసిందే. 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. చదవండి: భారత్: మరోసారి 2 లక్షలకు దిగువన కరోనా కేసులు Corona Vaccine: మిక్స్ చేస్తే పర్లేదా! -
కరోనా: మార్కెట్లోకి 2-డీజీ డ్రగ్ విడుదల
సాక్షి,హైదరాబాద్: కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్)’ ఔషధాన్నిడాక్టర్ రెడ్డీస్ గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ముందుగా 10వేల సాచెట్లను మార్కెట్లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన విషయం తెలిసిందే. 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీరంలో వైరస్ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత. చదవండి: డీఆర్డీవో గుడ్‌న్యూస్: కరోనా బాధితులకు కొత్త ఔషధం సిద్ధం -
కోవిడ్–19 చికిత్సకు నూతన విధానాలు: రెడ్డీస్
న్యూఢిల్లీ: ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కోవిడ్–19 చికిత్సకు నూతన విధానాలను అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది. కొన్ని నెలల్లో వీటిని అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. మహమ్మారి చికిత్సలో ఉపయోగించే ఔషధాల సరఫరాలో ఎటువంటి ఆటంకం ఉండబోదని స్పష్టం చేసింది. రెమ్‌డెసివిర్‌తోసహా పలు ఔషధాల సరఫరాను డిమాండ్‌కు తగినట్టు పెంచామని వివరించింది. ‘సాధ్యమైన అన్ని మార్గాల్లో, అత్యంత ఆవశ్యకతతో రోగులకు సేవ చేయాలని నిర్ణయించాం. కోవిడ్–19 చికిత్సకు కావాల్సిన నివారణ ఔషధాల అభివృద్ధి, వాణిజ్యీకరణకై వివిధ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం’ అని డాక్టర్ రెడ్డీస్ కో–చైర్మన్, ఎండీ జి.వి.ప్రసాద్ తెలిపారు. భారత్‌లో తొలి 25 కోట్ల డోసుల స్పుత్నిక్–వి వ్యాక్సిన్ విక్రయాలకు తమకు హక్కులు ఉన్నాయని కంపెనీ సీఈవో ఇరెజ్ ఇజ్రాయెలీ వెల్లడించారు. అన్నీ అనుకూలిస్తే 12 నెలల్లో ఈ డోసులను సరఫరా చేస్తామని చెప్పారు. -
వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా లైఫ్ సైన్సెస్
సాక్షి, హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ రంగాన్ని వచ్చే దశాబ్దకాలంలో వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రెండేళ్ల కాల పరిమితితో కూడిన లైఫ్ సైన్సెస్ సలహా నూతన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ లైఫ్ సైన్సెస్ సలహా కమిటీ తొలి సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2016లో నియమించిన కమిటీ కాల పరిమితి ముగియడంతో పరిశ్రమల శాఖ అధికారులు, ఫార్మా, బయో టెక్నాలజీ, వైద్య ఉపకరణాలు, డిజిటల్ హెల్త్ రంగాలకు చెందిన ప్రముఖులతో అధికారులు ఈ కొత్త కమిటీ ఏర్పాటుచేశారు. డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు చెందిన సతీష్‌రెడ్డి చైర్మన్‌గా, ‘బయోలాజికల్ ఈ’ఎండీ మహిమా దాట్ల వైస్ చైర్మన్‌గా, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్‌ను కన్వీనర్‌గా నియమిస్తూ కొత్త కమిటీ ఏర్పాటైంది. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల నడుమ ఈ కమిటీ సంధానకర్తగా పనిచేయనుంది. -
డాక్టర్ రెడ్డీస్ చేతికి...బెల్జియం యూసీబీ బ్రాండ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బెల్జియం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఔషధ సంస్థ యూసీబీకి చెందిన కొన్ని బయో ఫార్మాసూటికల్స్ బ్రాండ్స్‌ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కొనుగోలు చేసింది. దీంతో ఇండియా, నేపాల్, శ్రీలంక, మాల్దీవుల దేశాల్లో యూసీబీకి చెందిన కొన్ని బ్రాండెడ్ ఔషధాలు డాక్టర్ రెడ్డీస్ పరమవుతాయి. సుమారు రూ. 800 కోట్లతో (118 మిలియన్ యూరోలు) యూసీబీ బ్రాండ్లను కొనుగోలు చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2014లో ఈ బ్రాండ్స్ అమ్మకాల విలువ రూ. 150 కోట్లుగా ఉంది. ఈ ఒప్పందం ప్రకారం యూసీబీకి చెందిన 350 మంది ఉద్యోగులు కూడా డాక్టర్ రెడ్డీస్ పరిధిలోకి రానున్నారు. ఈ కొనుగోలుతో డిమాండ్ అధికంగా ఉండే, చిన్న పిల్లలు, చర్మ, శ్వాస సంబంధిత రంగాల్లోకి అడుగుపెట్టనున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ సోనిగ్ తెలిపారు. బాగా ప్రాచుర్యం పొందిన అట్రాక్స్, నూట్రోపిల్, ఎక్స్‌వెజైడాల్ వంటి బ్రాండ్స్ తమపరమైనట్లు తెలిపారు. వచ్చే మూడు నెలల్లో ఈ ఒప్పందం పూర్తవుతుందన్న ఆశాభావాన్ని అలోక్ వ్యక్తం చేశారు.ఈ వార్తల నేపథ్యంలో బుధవారం డాక్టర్ రెడ్డీస్ షేరు ఒక శాతం పెరిగి రూ. 3,526 వద్ద ముగిసింది. -
అవకాశాల గని.. ఆరోగ్య రాజధాని
ఇప్పటికే ఐటీ హబ్‌గా పేరుగాంచిన భాగ్యనగరి ప్రస్తుతం మెడికల్ హబ్‌గా అవతరిస్తోంది. వివిధ కార్పొరేట్ ఆస్పత్రుల తోపాటు.. డాక్టర్ రెడ్డీస్, దివీస్ లేబొరేటరీస్, అరబిందో, శాంతా బయోటెక్నిక్స్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు నగరంలోనే కొలువుదీరాయి. మరోవైపు దేశవిదేశాల నుంచి వివిధ వ్యాధుల చికిత్స, మెరుగైన వైద్య సేవల కోసం నగరానికి వచ్చేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో హెల్త్‌కేర్ రంగం అపార అవకాశాల నిలయంగా మారుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో హెల్త్‌కేర్ రంగం విస్తరణ, ఇన్స్టిట్యూట్లు, కోర్సులు, ఉద్యోగావకాశాలపై ఫోకస్.. భారత్‌లో హెల్త్‌కేర్ రంగం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. తదనుగుణంగా ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు నానాటికీ విస్తృతమవుతున్నాయి. ప్రస్తుతం మనదేశ ఆరోగ్య రంగంలో 3.8 మిలియన్ల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం ప్రతిఏటా 13.4 శాతం వృద్ధి సాధిస్తోంది. దీన్నిబట్టి 2022 నాటికి అదనంగా 13.3 మిలియన్ల మందికి అవకాశాలు దక్కనున్నాయి. ఈ సెక్టార్లో డిమాండ్, సప్లై మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అవసరానికి సరిపడ నిపుణులు లభించడం లేదు. భారత్‌లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్య రంగంలో దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయి. ఈ ధోరణి ఇలాగే కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. భారత్‌లో ప్రస్తుతం 15 లక్షల ఫిజీషియన్లు, 10 లక్షల మంది నర్సులు అవసరం. డాక్టర్లు, నర్సులతోపాటు ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియాలజిస్టులు, డైటీషియన్లు, న్యూట్రీషనిస్టులు, ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులు, హెల్త్‌కేర్ మేనేజర్లు భారీ సంఖ్యలో కావాలి. పారామెడికల్ కోర్సులతో ప్రయోజనం ఎంతో: డాక్టర్లకు సహాయకులుగా విధులు నిర్వహించే పారామెడికల్ నిపుణులకు కూడా మంచి అవకాశాలున్నాయి. ఎక్స్‌రే, స్కానింగ్, ఈసీజీ సేవలు అందించడం, యూరిన్, రక్త పరీక్షలు నిర్వహించడం ఇలా ఎన్నో విభాగాల్లో వీరికి ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్బోర్డ్ (ఏపీపీఎంబీ).. డిప్లొమా కోర్సుల్లో భాగంగా.. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఆప్టోమెట్రీ టెక్నీషియన్, హాస్పిటల్ ఫుడ్ సర్వీస్ మేనేజ్మెంట్ టెక్నీషియన్, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మేల్), ఆఫ్తాల్మాలిక్ అసిస్టెంట్, ఆడియోమెట్రీ టెక్నీషియన్, రేడియోథెరపీ టెక్నీషియన్, పర్ఫ్యూషన్ టెక్నీషియన్, డయాలసిస్, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్, రెస్పిరేటరీ థెరపీ టెక్నీషియన్, మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, హియరింగ్ లాంగ్వేజ్ అండ్ స్పీచ్ థెరపీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డెంటల్ హైజీనియస్ట్, మైక్రో సర్జరీ, ఎనస్థీషియా టెక్నీషియన్, క్యాత్‌ల్యాబ్ టెక్నీషియన్, రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్, డార్క్‌రూం అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్ వంటి కోర్సులను అందిస్తోంది. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. తర్వాత ప్రాధాన్యతలవారీగా ఎంపీసీ, మిగిలిన గ్రూప్లవారికి ప్రవేశాలు కల్పిస్తారు. ఏపీపీఎంబీ పరిధిలోనే ఈ కోర్సులు పూర్తిచేసినవారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. అపోలో హాస్పిటల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ సెంటర్, మెడ్విన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సెన్సైస్, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (కిమ్స్)లకు సొంత పారామెడికల్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. యూనివర్సిటీలు, కోర్సులు.. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. ఎంబీఏలో హెల్త్‌కేర్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమాలో హెల్త్ కమ్యూనికేషన్, హెల్త్ ఫిట్‌నెట్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందిస్తోంది. వివరాలకు వెబ్సైట్: www.uohyd.ac.in. సిటీలో కొలువుదీరిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సహకారంతో) ఎంబీఏ హాస్పిటల్ అండ్ హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.braou.ac.in చూడొచ్చు. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో).. పీజీ డిప్లొమాలో భాగంగా హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. బ్యాచిలర్స్ డిగ్రీలో నర్సింగ్ (పోస్ట్ బేసిక్), డిప్లొమా కోర్సుల్లో నర్సింగ్, న్యూట్రిషన్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తోంది. సర్టిఫికెట్ కోర్సుల్లో భాగంగా న్యూట్రిషన్ అండ్ చైల్డ్‌కేర్, న్యూబార్న్ అండ్ ఇన్ఫాంట్ కేర్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌కేర్, హెచ్ఐవీ అండ్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇగ్నోకు హైదరాబాద్‌లో ప్రాంతీయ కేంద్రం ఉంది. వివరాలకు: http://rchyderabad.ignou.ac.in/ ఉద్యోగావకాశాలు: ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. కార్పొరేట్ ఆస్పత్రులు.. తమ శాఖలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయి. 1500 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ పబ్లిక్ హెల్త్ సెంటర్ (పీహెచ్సీ)లు ఏర్పాటు కానున్నాయి. వీటన్నింటిలో వైద్యులు మొదలుకొని, ఫార్మసిస్ట్, పారామెడికల్ నిపుణులు, హాస్పిటల్ మేనేజ్మెంట్ - అడ్మినిస్ట్రేటర్లు, క్లినికల్ రీసెర్చ్ నిపుణుల వరకు అవసరం ఎంతగానో ఉంది. భారత్.. మెడికల్ టూరిజానికి హబ్‌గా మారుతోంది. విదేశాలతో పోలిస్తే తక్కువ ఖర్చుతోనే మెరుగైన వైద్యం అందుతోంది. మనదేశం అందించే ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో వైద్య అవసరాల కోసం భారత్‌ను, ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాలను సందర్శించేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇలా మనదేశానికి వచ్చేవారి సంఖ్య ఏటా నాలుగు లక్షల వరకు ఉంటోంది. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 12 లక్షలకు చేరుకుంటుందని ఒక అంచనా! ఈ క్రమంలో వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు లభించడం ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక సంస్థ.. కోర్సులు: నగరంలో కొలువుదీరిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) కూడా బీఎస్సీ (నర్సింగ్), ఎంఎస్సీ (నర్సింగ్), బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ), మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ), మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ (ఎంహెచ్ఎం), పీజీ డిప్లొమా ఇన్ పారామెడికల్ సెన్సైస్, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ (పార్ట్‌టైం), పీజీ కోర్స్ ఇన్ డయాబెటీస్ వంటి కోర్సులను అందిస్తోంది. కోర్సును బట్టి అర్హతలు వేర్వేరుగా ఉంటాయి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ http://www.nims.edu.in/ చూడొచ్చు. ఫార్మా కోర్సులు: ఫార్మాలో డిప్లొమా ఇన్ ఫార్మసీ నుంచి బీఫార్మసీ, ఫార్మ్‌డీ, ఎంఫార్మసీ, ఎంబీఏలో ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నగరంలో ఎన్నో విద్యా సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి. ఫార్మా కోర్సులను అందించడంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్)కు ఉత్తమ సంస్థగా గుర్తింపు ఉంది. ఈ సంస్థ నగరంలోనే కొలువుదీరింది. ఇక్కడ ఎంఫార్మ్, పీహెచ్డీ (ఫార్మసీ)లో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. హెల్త్‌కేర్‌లో విస్తృత అవకాశాలు శ్రీ హెల్త్‌కేర్ రంగంలో నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఏటా 15శాతం వృద్ధిని నమోదు చేస్తున్న ఈ రంగంలో నైపుణ్యాలున్న సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అవసరాలకు, అందుబాటులోని మానవ వనరు లకు మధ్య.. బాగా అంతరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో హెల్త్‌కేర్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయనడంలో సందేహం లేదు. హెల్త్‌కేర్ రంగంలో పనిచేయాలంటే సాఫ్ట్ స్కిల్స్ ఎంతో ప్రధానం. వాటితోపాటు టెక్నికల్, మెడికల్ నైపుణ్యాలుండాలి. ఈ రంగంలో ప్రవేశించాలనుకునేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఉన్నత బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. తప్పులు చేయడానికి ఏ మాత్రం అవకాశం ఉండదు. సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తే లభించే తృప్తే గొప్ప ప్రోత్సాహకరంగా ఉంటుంది. - డా.కె. హరిప్రసాద్, సీఈఓ- సెంట్రల్ రీజియన్, అపోలో హాస్పిటల్స్