లండన్ ‘మత్తు’ వదిలించిన హైదరాబాద్ | London 'toxic' quits Hyderabad | Sakshi
Sakshi News home page

లండన్ ‘మత్తు’ వదిలించిన హైదరాబాద్

Published Tue, Jan 6 2015 1:00 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

London 'toxic' quits Hyderabad

మనిషి మంచా చెడా? ‘ఎస్ ఆర్ నో’ ఏదో ఒకటి స్పష్టంగా చెప్పు అని దబాయిస్తే సమాధానం చెప్పడం కష్టమవుతుంది. నిజాంల పాలనా అటువంటిదే. ఏడుగురు నిజాంలలో చివరి, ఏడో నిజాంల చివరి దశాబ్దం చీకటి పాలన. శతాబ్దాల మతసామరస్యపు హైదరాబాద్ కీర్తి పతాక ఏడో నిజాం హయాంలో అవనతం అయినా పూర్వుల మంచి పనులను ఆయనా కొనసాగించాడు. భాగ్యనగరంలోని 14 భవనాలనూ నేలమట్టం చేసింది ముస్లిమేతరులు కాదు, ఢిల్లీ నుంచి వచ్చి ‘ఫతే మైదాన్’లో విడిది చేసిన ఔరంగజేబు సైన్యాలు. హైదరాబాద్‌లో రామాలయపు విగ్రహ ప్రతిష్టాపనలో ముఖ్య అతిథి, ఆలయ నిర్వహణకు మాన్యాలు రాసి ఇచ్చిందీ ఏడుగురిలో ఒక నిజాం అని విస్మరించకూడదు. ఈ అంశాలను తరువాత వివరంగా ముచ్చటించుకుందాం. ‘అన్ హ్యాపీ ప్రిన్స్’ తండ్రి ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ ప్రపంచ మానవాళికి వేదనారహిత వైద్య సేవలు అందించడం కోసం దోహదపడిన వైనాన్ని చూద్దాం...
 
దోమకాటు వల్ల మలేరియా విస్తరిస్తుందని సర్ రోనాల్డ్ రాస్ అమీర్‌పేటలో పరిశోధనలు చేయడం, 1902లో నోబెల్ ప్రైజ్ పొందడం తెలిసిందే. ఉస్మానియా హాస్పిటల్ పాత పేరు అఫ్జల్‌గంజ్ హాస్పిటల్. దీని పేరు మారినా అందులోని ‘ఎడ్వర్డ్ లోరీ హాల్’ పేరు మారలేదు. ఎడ్వర్డ్ లోరీ ఎడిన్‌బరో, ప్యారిస్‌లలో చదివాడు. 1872లో ఆరో నిజాం వ్యక్తిగత వైద్యునిగా, హైదరాబాద్ మెడికల్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా, అఫ్జల్‌గంజ్ సూపరింటెండెంట్‌గా హైదరాబాద్ వచ్చారు.

అప్పటికి ఇంగ్లండ్‌లో వైద్య అవసరాలకు క్లోరోఫాం వినియోగంపై అస్పష్టత ఉండేది. ఎడిన్‌బరోలో 1847లో లావ్‌రీ గురువు డా.జేమ్స్ సిమ్సన్ తొలిసారి ఒక ఆపరేషన్ సందర్భంగా వినియోగించాడు. శ్వాసక్రియలో వచ్చే మార్పులను పర్యవేక్షిస్తూ క్లోరోఫాంను  వైద్య అవసరాలకు వినియోగించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ థియరీని స్కాటిష్ స్కూల్ అనేవారు. క్లోరోఫాం వినియోగం గుండెపై ప్రభావం చూపుతుంది. వాడేందుకు మరిన్ని పరిశోధనలు జరగాలి అని లండన్ వైద్యులు అనేవారు ఈ థియరీని లండన్ స్కూల్ అనేవారు. ఈ వివాదాల నేపథ్యంలో అనస్తీషియా రహిత ఆపరేషన్‌లలో బాధ అనివార్యమయ్యేది!
 
లండన్‌కు ‘హృదయం’ లేదు!

ఎడ్వర్‌‌డ లోరీ స్కాటిష్ థియరీ కరెక్ట్ అని నిరూపించదలచుకున్నాడు. లోరీ ఉత్సాహానికి మహబూబ్ అలీఖాన్ ప్రోత్సాహాన్నిచ్చాడు. లోరి నాయకత్వంలో మరో ముగ్గురు సభ్యులతో 1888లో క్లోరోఫాం కమిషన్ ఏర్పాటు చేశారు. కమిషన్ నిర్దారించిన అంశాలకు అభినందనగా హైదరాబాద్ మెడికల్ కాలేజీలో వేడుక జరిగింది. దేశవిదేశాల వైద్యరంగ ప్రముఖులు, రాజ ప్రముఖులు, విచ్చేసిన సమావేశంలో ఎడ్వర్‌‌డ లోరీ పరిశోధనా ఫలితాలను ప్రకటించారు. వేలాది ప్రయోగాల్లో ఒక్క సందర్భంలో కూడా క్లోరోఫాం హృదయంపై ప్రభావం చూపలేదని నివేదిక విడుదల చేశారు.

మానవాళికి బాధారహిత వైద్యసేవలు అందించగల క్లోరోఫామ్ విషయంలో లండన్ స్కూల్ ‘హృదయ’రహితంగా వ్యవహరించిందని చమత్కరించారు! ఎడ్వర్‌‌డ లోరీ పరిశోధనాఫలితాలు, ప్రసంగంపై బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ అధికార పత్రిక ‘లాన్సెట్’ పెదవి విరచింది. ఎడ్వర్‌‌డ లోరీ పరిశోధనలు యూరప్ ప్రమాణాల మేరకు లేవని, హృదయంపై క్లోరోఫాం చూపే దీర్ఘకాలిక నష్టాలను విస్మరించాయని, కేవలం కుక్కలపై కదాచిత్‌గా చేసిన ప్రయోగాలను పరిగణనలోకి తీసుకోలేమని వ్యాఖ్యానించింది.

వెయ్యి స్టెర్లింగ్ పౌండ్లతో ‘లాన్సెట్’కు ఆహ్వానం!

ఈ నేపథ్యంలో ఎడ్వర్‌‌డ లోరీ కోర్కెమేరకు ఆరవనిజాం రెండవ క్లోరోఫాం కమిషన్‌ను ఏర్పాటు చేశాడు. లండన్ స్కూల్ నుంచి ఒక నిపుణుడిని కమిషన్ సభ్యుడిగా ఆహ్వానించారు. ఆ సభ్యుడిని హైదరాబాద్ అతిథిగా గౌరవిస్తామని, రాకపోకలకు అయ్యే ఖర్చులకు 1000 స్టెర్లింగ్ పౌండ్‌లను ఇస్తామని ప్రకటించారు. ‘లాన్సెట్’ ఆ మేరకు డాక్టర్ థామస్ లాడర్ బ్రంటన్‌ను పంపింది. తొలి కమిషన్ సభ్యులతో పాటు బ్రంటన్, బ్రిటిష్ ఇండియా తరఫున మేజర్ జనరల్ గెరాల్డ్ బర్మ్‌ఫోర్డ్, హైదరాబాద్ మెడికల్ కౌన్సిల్ తరుఫున రుస్తుంజీలు ఎడ్వర్డ్ లోరీ నాయకత్వంలో పరిశోధనలు ప్రారంభించారు.

ఈ బృందంలో సేవలు అందించిన హైదరాబాదీ మహిళ డాక్టర్ రూపాబాయి ఫర్దూంజీ ప్రపంచంలో తొలి అనస్థీషియనిస్ట్ కావడం గమనార్హం. 1889 అక్టోబర్ 23న ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. రోజూ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేర్వేరు జంతువులపై ప్రయోగాలు చేశారు.

నవంబర్ 29న మేక, గుర్రం, కోతిపై జరిగిన క్లోరోఫాం ప్రయోగాలను ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ స్వయంగా పర్యవేక్షించారు. పరిశోధన ఫలితాలను కమిషన్ ప్రకటించక ముందే బ్రంటన్ ‘లాన్సెట్’ నాయకత్వానికి టెలిగ్రామ్ పంపారు... ‘నా పర్యవేక్షణలో 490కి పైగా కుక్కలు, గుర్రాలు, కోతులు, పిల్లులు, కుందేళ్లపై ప్రయోగాలు జరిగాయి. అధిక మోతాదు వల్ల ఏర్పడే దుష్పరిణామాలు, శ్వాసక్రియలో మార్పులు మినహా క్లోరోఫాం వినియోగం వల్ల గుండెపై ఎటువంటి ప్రత్యక్ష ప్రభావాలూ లేవు’ అని. ఇది తొలి కమిషన్ సారాంశమే. ఒక రకంగా   లండన్ స్కూల్‌కు హైదరాబాద్ పాఠం.

మహబూబ్‌కు ‘ఇంగ్లిష్’ వైద్యుల కృతజ్ఞత

హైదరాబాద్ రెండో క్లోరోఫామ్ కమిషన్ రిపోర్ట్ ఐదు విడతలుగా 1890 జనవరి నుంచి ‘లాన్సెట్’లో అచ్చయింది. తర్వాత వాల్యూంగా 1890 జూన్ 21న సారాంశాన్ని ప్రచురిస్తూ ఎడిటర్ ఇలా అన్నారు... ‘హైదరాబాద్ పరిశోధనలపై కొంత భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ, శాస్త్రీయ పరిశోధనలు చేసేందుకు ఆకాశమే హద్దుగా నిజాం ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహానికి ప్రపంచ వైద్య వృత్తికారుల తరఫున కృతజ్ఞతలు’. నేచర్ పత్రిక హైదరాబాద్ ప్రయోగాలను ప్రత్యేక వ్యాసాల్లో ప్రశంసించింది. అయితే క్లోరోఫాం వివాదం ఆగిపోలేదు. ‘స్కాటిష్- హైదరాబాద్ థియరీ’ తప్పని తర్వాత కాలంలో నిరూపితమైంది. ఇటీవలి కాలంలో డబ్ల్యూ స్టాన్లీ సైక్స్ ‘ఎస్సే ఆన్ ది ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ అనెస్థీషియా వాల్యూమ్ 3 (1982)’లోని 19 అధ్యాయాల్లో నాలుగు హైదరాబాద్ పరిశోధనలకు సంబంధించినవే. ఈ పరిశోధనలు సైన్స్ పురోగతికి బహుదా ఉపకరించాయని వైద్య చరిత్ర కొనియాడింది.

 రిటైర్మెంట్ తరువాత ఎడ్వర్డ్ లోరీ 1901లో ఇంగ్లండ్ వెళ్లారు. 1905లో మరణించారు. భార్యకు ప్రేమను తప్పితే ఏమీ మిగల్చలేదని తెలుసుకున్న మహబూబ్ అలీఖాన్, ఆ జీవన పర్యంతం ఆమెకు నెలకు 600 స్టెర్లింగ్ పౌండ్లు అందేలా ఏర్పాటు చేశారు.
 
 ప్రెజెంటేషన్: పున్నా కృష్ణమూర్తి
 narendrayan-23

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement