నిజాం నిధులు వచ్చేస్తున్నాయ్‌..!  | Nizam Funds Back To India From Pakistan | Sakshi
Sakshi News home page

నిజాం నిధులు వచ్చేస్తున్నాయ్‌..! 

Published Sat, Nov 23 2019 3:07 AM | Last Updated on Sat, Nov 23 2019 5:23 AM

Nizam Funds Back To India From Pakistan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 1948 సెప్టెంబర్‌ 17వ తేదీకి కొన్ని గంటల ముందు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి లండన్‌లోని పాకిస్తాన్‌ హైకమిషనర్‌ అకౌంట్‌కు చేరిన నిజాం నిధులు మళ్లీ వెనక్కి వచ్చేస్తున్నాయి. సుమారు 70 ఏళ్ల నిధుల వివాదంపై అక్టోబర్‌ 3న లండన్‌ రాయల్‌ కోర్ట్‌ ఆఫ్‌ జస్టిస్‌.. 1948లో బదిలీ అయిన రూ.3.5 కోట్ల నిధు లు తిరిగి నిజాం వారసులు, భారత దేశానికే చెందుతా యని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

అయితే తమ తీర్పుపై పాకిస్తాన్‌కు అభ్యంతరాలుంటే నెల రోజుల్లో అప్పీల్‌ చేసుకోవాలని గడువు విధించింది. అయితే నవంబర్‌ 4వ తేదీ వరకు పాకిస్తాన్‌ అప్పీల్‌ రాయల్‌ కోర్టు ఆఫ్‌ జస్టిస్‌ ముందుకు రాకపోవటంతో నిధుల బదిలీ ఇక లాంచనమేనని నిజాం వారసులు భావిస్తున్నారు. 

306 కోట్లకు చేరిన నిధులు..  
హైదరాబాద్‌ సంస్థానం భారత్‌లో విలీనానికి కొన్ని గంటల ముందు నాటి ఆర్థికమంత్రిగా పనిచేసిన మీర్‌ నవాజ్‌ ఝంగ్‌కు చెందిన హైదరాబాద్‌లోని ఎస్‌బీహెచ్‌ అకౌంట్‌ నుంచి రూ.3.5 కోట్లు (1,007,940 పౌండ్ల 9 షిల్లింగ్‌లు) లండన్‌లో పాకిస్తాన్‌ హైకమిషనర్‌ రహమ తుల్లా అకౌంట్‌లోకి బదిలీ అయ్యాయి. భారత్‌లో హైదరాబాద్‌ విలీనం కావటం, ఉస్మాన్‌ అలీఖాన్‌ రాజ్‌ ప్రముఖ్‌గా నియామకం అయ్యాక ఈ నిధులు తిరిగి తనకు పంపాలంటూ ఉస్మాన్‌ అలీఖాన్‌ పాకిస్తాన్‌ను కోరినా ఫలితం కనిపించలేదు. దీంతో బ్రిటన్‌లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌లో ఉన్న ఆ నిధులు, వడ్డీలు కలుపుకుని ప్రస్తుతానికి రూ.306 కోట్లకు చేరాయి. 

భారత ప్రభుత్వం ఇంప్లీడ్‌.. 
ఈ నిధుల వివాదంపై పాకిస్తాన్‌తో న్యాయపరంగా కొట్లా డుతున్న నిజాం మనుమలు ముకర్రం ఝా, ముఫకం ఝాలకు మద్దతుగా 2013లో భారత ప్రభుత్వం లండన్‌ కోర్టులో ఇంప్లీడ్‌ అయింది. దీంతో పాకిస్తాన్‌ తన వాదనల వేగాన్ని పెంచి ‘భారత్‌ మాపై ఆక్రమణ చేస్తున్న సమయంలో ఆయుధాల కోసం నిజాం ఆ నిధుల్ని మాకు పం పారు.’ అని వాదనలను వినిపించినా.. కోర్టు కొట్టేసి నిధులను భారత్, నిజాం వారసులకు కేటాయించింది. అయితే ఈ నిధులను భారత్, నిజాం వారసులకు చెరో సగం చొప్పున పంచుతారా..? లేక భారత్‌కు 51 శాతం, వారసులకు 49 శాతం మేర పంచుతారా..? అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతివాల్సి ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement