1,000 కోట్ల సమీకరణకు గ్లోబల్ హాస్పిటల్స్ రెడీ
వైదొలగనున్న ఎవర్‌స్టోన్, ఆనంద్ రాఠీ
జనవరిలో డీల్ పూర్తికావొచ్చు
గ్లోబల్ హాస్పిటల్స్ సీఎండీ రవీంద్రనాథ్
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: హెల్త్‌కేర్ రంగంలో దేశంలోనే నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ హాస్పిటల్స్ రుణ భారాన్ని మరింత తగ్గించుకొని, ప్రస్తుతం ఇన్వెస్టర్లుగా కొనసాగుతున్న సంస్థలకు ఎగ్జిట్ దారి (తమ వాటాలను అమ్ముకొనేవీలు) చూపేందుకు వీలుగా నిధుల సమీకరణ చేపట్టింది. దీనికోసం రూ వెయ్యి కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హెల్త్‌కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్, ఓవర్‌సీస్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని గ్లోబల్ హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు.
శుక్రవారం సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ... బేరింగ్ ఏసియా, ఏటీ క్యాపిటల్, టీపీజీ గ్రోత్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్ లాంటి సంస్థలతో నిధుల సమీకరణ సంబంధించి చర్చలు పలు దఫాలుగా జరిపామని, వీటితో పాటు మరిన్ని సంస్థలతో కూడా చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. ‘నిధుల సేకరణకు మేం సమాయత్తమౌతున్నాం. పలు సంస్థలతో చర్చలను ప్రారంభించాం. ప్రాధమిక దశలను దాటి చర్చల్లో మరింత స్పష్టమైన పురోగతి సాధించాం. జనవరిలో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది’ అని రవీంద్రనాథ్ తెలిపారు.
సంస్థలో ప్రధాన ఇన్వెస్టర్లయిన ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ఎవర్‌స్టోన్ క్యాపిటల్ (35 శాతం), పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ ఆనంద్ రాఠీలకు (10 శాతం) కలిపి మొత్తం 45 శాతం వాటా ఉంది. గత ఏడు సంవత్సరాలుగా ఇందులో పెట్టుబడులు పెట్టారు. హెల్త్‌కేర్ రంగంలో మూలధనంపై వ్యయం (కాస్ట్ ఆఫ్ క్యాపిటల్) సంవత్సరానికి 15 శాతంపైనే ఉండటంతో రుణ భారాన్ని మోయడం తలకుమించిన భారం అవుతోంది. రుణ పత్రాల ద్వారా కాకుండా ఈక్విటీ నిధులను సమీకరించాలని గ్లోబల్ హాస్పిటల్స్ గత కొంత కాలంగా యోచిస్తోంది. 2016లో ఐపీవో ద్వారా పెట్టుబడుల మార్కెట్లో ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది.
గ్లోబల్ హాస్పిటల్స్‌కు 2,200 పడకల సామర్థ్యంతో ప్రస్తుతం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై,ముంబైలలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లున్నాయి. కిడ్నీ, లివర్, గుండె, ఊపిరితిత్తులతో పాటు మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సేవలను విజయవంతంగా అందించే సంస్థగా గ్లోబల్ హాస్పిటల్స్ అంతర్జాతీయ ఖ్యాతినార్జించింది. హెల్త్ టూరిజం పెంపొందించటంలో ప్రధానపాత్ర పోషిస్తోంది.
హాట్‌కేక్‌లా మారిన హెల్త్‌కేర్ రంగం..
హెల్త్‌కేర్ రంగం ప్రస్తుతం పెట్టుబడులకు హాట్‌కేక్‌లా మారింది. కొనుగోళ్లు, విలీనాలకు ఫార్మా తర్వాత హెల్త్‌కేర్ రంగం ముందుందని జియోజిత్ పీఎన్‌బీ పారిబస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ అలెక్స్ మ్యాథ్యూస్ తెలిపారు. పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ. 3,000 కోట్లు సమీకరించేందుకు హెల్త్‌కేర్ గ్లోబల్, ఎస్‌ఆర్‌ఎల్ డయాగ్నాస్టిక్స్ (ఫార్టిస్ గ్రూప్), ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, థైరో కేర్ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయన్నారు.