జోగిపేట (అందోల్): సాయంత్రం 5 గంటలు.. సంగారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు రోజూ జోగిపేట వచ్చి ఖాదిరాబాద్‌కు వెళుతుంది. ఆ సమయంలో ఎక్కువగా విద్యార్థులే ఈ బస్సులో ప్రయాణం చేస్తుంటారు. సోమవారం కూడా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులంతా జోగిపేట బస్టాండ్‌లో ఈ బస్ కోసం వేచిచూస్తున్నారు. అయితే ఖాదిరాబాద్‌కు వెళ్లేందుకు చాలా మంది విద్యార్థులు అక్కడ వేచి ఉన్నట్లు దూరం నుంచే గమనించిన సంగారెడ్డి డిపో బస్ కండక్టర్, వెంటనే ఖాదిరాబాద్ అని ఉన్న బోర్డును తిప్పేసి, సంగారెడ్డి బోర్డు పెట్టి ప్రయాణికులను తీసుకొని బస్టాండ్ నుంచి సంగారెడ్డి రూట్‌లో బయలుదేరారు.
దీంతో విద్యార్థులంతా వెంబడించి ఆ బస్సును అడ్డుకున్నారు. ‘ఖాదిరాబాద్ వెళ్లాల్సిన బస్సును సంగారెడ్డికి ఎందుకు తీసుకువెళుతున్నావ్’అంటూ కండక్టర్‌ను విద్యార్థులు నిలదీశారు. దీంతో రోడ్డుపై కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. బస్సును అరగంట సేపు నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. విద్యార్థుల బస్‌పాస్‌ల కారణంగా తమకు కలెక్షన్ రాదనే ఉద్దేశంతో బోర్డు తిప్పేసినట్లు పలువురు ఆరోపించారు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు దిగిపోవడంతో బస్సును తిప్పుకొని తిరిగి బస్టాండ్‌లోకి తీసుకువెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment