సంగారెడ్డి, జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ఎల్‌ఈడీ బల్బులను బిగించే ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సర్వే పూర్తి చేసిన ఐదు నెలల తర్వాత మున్సిపల్ అధికారులు బల్బులను బిగించే పనులను సోమవారం సాయంత్రం చేపట్టారు. ఎల్‌ఈడీ బల్బులను బిగించడం ద్వారా విద్యత్ ఖర్చు సగానికి సగం తగ్గుతుంది. మున్సిపల్ పరిధిలో వీటిని బిగించేందుకు వీలుగా డిమాండ్ సర్వే చేపట్టారు. సీడీఎంఏ (కమిషనర్ ఆఫ్ డైరెక్టరేట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) ద్వారా ఈపథకాన్ని అమలు చేసేందుకు ఈఈఎస్‌ఎల్ (ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) ముందుకు వచ్చింది. మున్సిపల్ పరిధిలో అవసరమయ్యే బల్బుల ఖర్చును సదరు సంస్థే భరిస్తుంది. బల్బులను బిగించడం, పాడైన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం లాంటి పనులను సైతం వారే చూసుకుంటారు. ఇందు కోసం పని చేసే సిబ్బంది వేతనాల కింద 30 శాతం మేర మున్సిపాలిటీ ఈఈఎస్‌ఎల్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పోను 70 శాతం మున్సిపాలిటీకి మిగులుబాటు అవుతుందనేది ఈ పథకం అంచనా.
పూర్తయితే రూ.2లక్షల మేర మిగులుబాటు..
ఎల్‌ఈడీ విద్యుత్ బల్బులను బిగించడం ద్వారా జహీరాబాద్ మున్సిపాలిటీకి ప్రతీనెల రూ.2లక్షల మేర మిగులు బాటు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నెలకు సుమారు రూ.7లక్షల మేర విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఎల్‌ఈడీ లైట్లను బిగిస్తే ఇందులో సగానికి సగం బిల్లు తగ్గుతుందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. మిగిలే రూ.3.50లక్షల్లో సుమారు రూ.లక్ష నిర్వహణ, విద్యుత్ బల్బులు దెబ్బతింటే మార్చడం లాంటి వాటి కోసం సదరు సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పోను ప్రతీనెల రూ.2లక్షల నుంచి రూ.2.50 లక్షల మేర మున్సిపాలిటీకి మిగులుబాటవుతుందని భావిస్తున్నారు.
పూర్తి స్థాయిలో సర్వే..
ఎల్‌ఈడీ బల్బులను బిగించేందుకు వీలుగా నిర్వహించిన సర్వేలో పలు వివరాలు సేకరించారు. పట్టణంలో ప్రస్తుతం ఉన్న పోల్స్ ఎన్ని, ఇంకా ఎన్ని అవసరం ఉన్నాయి?, ఏయే వాడలో ఎన్ని స్తంభాలున్నాయి. ఒక్కో ఫీడర్ పరిధిలో ఎన్ని దీపాలు ఉన్నాయి.? కరెంటు బిల్లులు ఎంత మేర వస్తోంది అనే సమాచారాన్ని ఈఈఎస్‌ఎల్ సేకరించింది. ఎల్‌ఈడీ బల్బులను సాధ్యమైనంత త్వరగా బిగించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో పనుల్లో పురోగతి వచ్చే అవకాశం ఉన్నట్లు అప్పట్లో భావించారు.
అయినా ఏయే ప్రాంతాల్లో ఎంత మేర ఓల్టేజీ ఉన్న బల్బులను బిగించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జూన్ నెలాఖరు వరకల్లా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని భావించినప్పటికీ మొదలు పెట్టలేదు. ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో 3వేల మేర విద్యుత్ స్తంభాలు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు మొత్తం 4,300 విద్యుత్ స్తంభాలు అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద ప్రస్తుతం చేపడుతున్న విద్యుత్ దీపాల బిగింపు పూర్తయితే జహీరాబాద్ పట్టణం విద్యుత్ కాంతులతో జిగేల్‌మననుంది. 65వ జాతీయ రహదారి, రైల్వే ఓవర్ బ్రిడ్జి, పట్టణంలోని అనేక రోడ్లు, కాలనీలు మెరిసిపోనున్నాయ.
బిగించేందుకు ఆరు టీములు
మున్సిపల్ పరిధిలో ఎల్‌ఈడీ బల్బులను బిగించేందుకు ఆరు టీములను ఏర్పాటు చేశారు. ఒక్కో టీములో ఇద్దరు చొప్పున మొత్తం 12 మంది పనులు నిర్వహిస్తారు. ఆరు టీములకు ఆయా వార్డులను కేటాయించారు.
జహీరాబాద్ ఇక జిగేల్
Published Wed, Sep 27 2017 2:23 PM | Last Updated on Wed, Sep 27 2017 2:23 PM
Advertisement