బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న కాంగ్రెస్ నాయకులు
సంగారెడ్డి ,పటాన్‌చెరు టౌన్ : పాతది ఉండగా కొత్త సచివాలయం కట్టడం అవసరమా అని మాజీ రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ సెక్రెటరీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. మంగళవారం స్థానిక కార్పొరేటర్ శంకర్‌యాదవ్ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేసి సెక్రెటేరియెట్ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వి.హనుమంతరావు హాజరయ్యారు. ముందుగా కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఇంట్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ వాస్తు పిచ్చితో ముఖ్యమంత్రి చేస్తున్న తుగ్లక్ చేష్టలకు అంతూపొంతు లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి నివాసంకోసం బేగంపేట్‌లో గత ప్రభుత్వ హయాంలోనే రూ. 30 కోట్లతో పెద్ద భవనం నిర్మిస్తే దాని వాస్తు బాగా లేదని రూ.160 కోట్లతో దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేనంతగా ప్రగతి భవన్ పేరుతో రాజభవనం నిర్మించడం ఎంతవరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని పదే పదే చెప్పుకునే కేసీఆర్ ఇప్పటి వరకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఎందుకు కట్టలేదో చెప్పాలన్నారు.
కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చేసిన వాగ్దానాన్ని అటకెందుకు ఎక్కించారో జవాబు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్ చేయడం లేదని ఆయన విమర్శించారు. స్కాలర్‌షిప్‌ల కోసం నిధులు ఇవ్వడం లేదని వీహెచ్ ఆరోపించారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ తుంగలో తొక్కాడన్నారు. క్రీడాకారులు తమంతట తాము క్రీడల్లో గెలిస్తే వారికి సత్కారాలు చేస్తూ కోట్ల రూపాయలు నజరానాగా ఇస్తున్నావు గానీ దేశస్థాయిలో జరిగే వివిధ పోటీలలో గెలుస్తున్న స్థానిక క్రీడాకారులను ఎందుకు సత్కరించడం లేదని ప్రశ్నించారు. బైసన్‌పోల్ మైదానం ప్రస్తుతం పేదవర్గాల పిల్లలకు ఆటల వేదికగా ఉపయోగపడుతున్నదన్నారు.
ఆ మైదానాన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా నిర్మిస్తే అందరికీ ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం తన ఆలోచనను మానుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాలలో మంగళవారం 20 కేంద్రాల వద్ద బ్యాలెట్ బాక్సులు పెట్టి ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వద్ద లెక్కిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిన్నారం జెడ్ప్‌టీసీ సభ్యుడు ప్రభాకర్, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు హనుమత్ యాదగిరి, జిల్లా నాయకుడు దండోర నర్సింహ, డీసీసీ నాయకులు సామయ్య, మతిన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు మదాస్ రాజశేఖర్, మల్లేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి, మల్లేశంగౌడ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.