V.Hanmantha Rao
-
గులాం నబీ సమక్షంలో కాంగ్రెస్ నేతల గలాటా
సాక్షి, హైదరాబాద్: గులాం నబీ ఆజాద్ రాష్ట్ర పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. గాంధీభవన్ వేదికగా ఆజాద్ సమక్షంలోనే పార్టీ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ మధ్య వాగ్వాదం జరిగింది. గాంధీభవన్ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ సీనియర్ నేతలంతా శవాలతో సమానమని షబ్బీర్ ఎలా అంటారని వీహెచ్ ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన షబ్బీర్ తానెప్పుడు అలా అన్నానో చెప్పాలని వీహెచ్‌ను నిలదీశారు. ‘నేను ఎవరితో మాట్లాడలేదు. మీడియాతో అసలే మాట్లాడలేదు. అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు’అంటూ వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆజాద్ కల్పించుకుని ఇద్దరికీ సర్దిచెప్పాల్సి వచ్చింది. టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వండి: కోమటిరెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ మంగళవారం గాంధీభవన్ హోరెత్తిపోయింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఆజాద్‌ను కలిసిన కోమటిరెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుపై కొంత చర్చ జరిగింది. కొందరు వీలైనంత త్వరగా పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కోరగా, మరికొందరు మున్సిపల్ ఎన్నికల తర్వాత మార్చాలని కోరారు. దీంతో ఆజాద్ స్పందిస్తూ.. ఆ విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఆజాద్‌తో సమావేశం ముగిసిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని ఆజాద్‌ను కోరినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని ఆయన వెల్లడించారు. -
ఆర్టీసీ సమ్మె : సూర్యాపేట డిపో దగ్గర ఉద్రిక్తత
సాక్షి, నల్లగొండ : సూర్యాపేట ఆర్టీసీ డిపో దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ధర్నాకు పూనుకున్నారు. తాత్కాలిక సిబ్బందిని గేటు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కార్మికులు డిపో ముందే బైఠాయించడంతో... బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ధర్నాలో కాంగ్రెస్, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి కార్మికులు, నేతలను అరెస్టు చేసి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మహిళా కార్మికురాలు ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. పోలీస్‌స్టేషన్‌లో కార్మికులు, నేతల ధర్నా కొనసాగుతోంది. ధర్నాలో పాల్గొన్న వీహెచ్ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నాలో వీహెచ్ పాల్గొన్నారు. పదో రోజుకు చేరిన సమ్మె సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి పదో రోజుకు చేరింది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తూ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా డిపోల ఎదుట బహిరంగ సభలు నిర్వహించారు. 15న రాస్తారోకోలు, 16న విద్యార్థుల ర్యాలీలు, 17న ధూందాం కార్యక్రమాలు, 18న బైక్ ర్యాలీలు చేపట్టాలని ఐకాస నిర్ణయించింది. -
కొత్త సచివాలయం అవసరమా?
సంగారెడ్డి ,పటాన్చెరు టౌన్ : పాతది ఉండగా కొత్త సచివాలయం కట్టడం అవసరమా అని మాజీ రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ సెక్రెటరీ వి.హనుమంతరావు ప్రశ్నించారు. మంగళవారం స్థానిక కార్పొరేటర్ శంకర్‌యాదవ్ ఆధ్వర్యంలో బస్టాండ్ సమీపంలో బ్యాలెట్ బాక్స్ ఏర్పాటు చేసి సెక్రెటేరియెట్ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలు సేకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వి.హనుమంతరావు హాజరయ్యారు. ముందుగా కార్పొరేటర్ శంకర్ యాదవ్ ఇంట్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ వాస్తు పిచ్చితో ముఖ్యమంత్రి చేస్తున్న తుగ్లక్ చేష్టలకు అంతూపొంతు లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి నివాసంకోసం బేగంపేట్‌లో గత ప్రభుత్వ హయాంలోనే రూ. 30 కోట్లతో పెద్ద భవనం నిర్మిస్తే దాని వాస్తు బాగా లేదని రూ.160 కోట్లతో దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేనంతగా ప్రగతి భవన్ పేరుతో రాజభవనం నిర్మించడం ఎంతవరకు న్యాయం అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని పదే పదే చెప్పుకునే కేసీఆర్ ఇప్పటి వరకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు కట్టలేదో చెప్పాలన్నారు. కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అని చేసిన వాగ్దానాన్ని అటకెందుకు ఎక్కించారో జవాబు ఇవ్వాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ చేయడం లేదని ఆయన విమర్శించారు. స్కాలర్‌షిప్‌ల కోసం నిధులు ఇవ్వడం లేదని వీహెచ్ ఆరోపించారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ తుంగలో తొక్కాడన్నారు. క్రీడాకారులు తమంతట తాము క్రీడల్లో గెలిస్తే వారికి సత్కారాలు చేస్తూ కోట్ల రూపాయలు నజరానాగా ఇస్తున్నావు గానీ దేశస్థాయిలో జరిగే వివిధ పోటీలలో గెలుస్తున్న స్థానిక క్రీడాకారులను ఎందుకు సత్కరించడం లేదని ప్రశ్నించారు. బైసన్‌పోల్ మైదానం ప్రస్తుతం పేదవర్గాల పిల్లలకు ఆటల వేదికగా ఉపయోగపడుతున్నదన్నారు. ఆ మైదానాన్ని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌గా నిర్మిస్తే అందరికీ ఉపయోగపడుతుందన్నారు. ఇప్పటికైనా సీఎం తన ఆలోచనను మానుకోవాలని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాలలో మంగళవారం 20 కేంద్రాల వద్ద బ్యాలెట్ బాక్సులు పెట్టి ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో వద్ద లెక్కిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిన్నారం జెడ్ప్‌టీసీ సభ్యుడు ప్రభాకర్, జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు హనుమత్ యాదగిరి, జిల్లా నాయకుడు దండోర నర్సింహ, డీసీసీ నాయకులు సామయ్య, మతిన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు మదాస్ రాజశేఖర్, మల్లేశ్ యాదవ్, మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి, మల్లేశంగౌడ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొత్త సచివాలయ నిర్మాణంపై ఓటింగ్: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణం అవసరమా, లేదా అనే దానిపై ఓటింగ్ నిర్వహిస్తున్నట్టుగా మాజీ ఎంపీ వి.హన్మంతరావు ఆదివారం చెప్పారు. ఈ నెల 26న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 20 కేంద్రాల్లో ఓటింగ్‌ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 27న సోమాజిగూడలో కౌంటింగ్ చేపడతామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన ముద్ర, పేరుతో పాటు వాస్తు పిచ్చితో కొత్త సచివాలయం నిర్మించాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త సచివాలయం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని విమర్శించారు. దీనిపై బ్యాలెట్ బాక్సుల ద్వారా ప్రజాభిప్రాయాన్ని చెప్పాలని కోరారు. ప్రజా ఫలితం తర్వాతనైనా సీఎం ఆలోచనలో మార్పు రావాలని వీహెచ్ ఆకాంక్షించారు. -
సిరిసిల్ల ఎస్పీని సస్పెండ్ చేయాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో దళితులపై దాడికి దిగిన జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలని, లేకుంటే ఈ నెల 30న దీక్షకు దిగుతానని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు హెచ్చరించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహంకారపూరిత మాటాలను మానుకోవాలని హెచ్చరించారు. ఇది ప్రజాస్వామ్య దేశమా? దొరల రాజ్యమా? అని ప్రశ్నించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేరెళ్ల బాధితులను మంత్రి కేటీఆర్ దొంగలాగా వెళ్లి పరామర్శించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఘటనలో ఎస్పీని వదిలి ఎస్ఐని సస్పెండ్ చేయడం సమంజసంకాదని వీహెచ్ అన్నారు. బాధితుల పక్షాన ప్రతిపక్షాలు పోరాడుతుంటే రాజకీయమంటూ నిందలు వేయడం తగదన్నారు. నేరెళ్ల ఘటనలో లారీ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు రూ.20 లక్షలు, పోలీసుల చేతిలో థర్డ్ డిగ్రీకి గురయిన వారికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.