గులాం నబీ సమక్షంలో కాంగ్రెస్‌ నేతల గలాటా  | Telangana Congress Leaders War of Words At Ghulam Nabi Azad Presence | Sakshi
Sakshi News home page

గులాం నబీ సమక్షంలో కాంగ్రెస్‌ నేతల గలాటా 

Published Wed, Nov 6 2019 8:18 AM | Last Updated on Wed, Nov 6 2019 8:38 AM

Telangana Congress Leaders War of Words At Ghulam Nabi Azad Presence - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గులాం నబీ ఆజాద్‌ రాష్ట్ర పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు వాగ్వాదానికి దిగారు. గాంధీభవన్‌ వేదికగా ఆజాద్‌ సమక్షంలోనే పార్టీ సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, షబ్బీర్‌ అలీ మధ్య వాగ్వాదం జరిగింది. గాంధీభవన్‌ వర్గాల సమాచారం ప్రకారం.. పార్టీ సీనియర్‌ నేతలంతా శవాలతో సమానమని షబ్బీర్‌ ఎలా అంటారని వీహెచ్‌ ఆజాద్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించిన షబ్బీర్‌ తానెప్పుడు అలా అన్నానో చెప్పాలని వీహెచ్‌ను నిలదీశారు. ‘నేను ఎవరితో మాట్లాడలేదు. మీడియాతో అసలే మాట్లాడలేదు. అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు’అంటూ వ్యాఖ్యానించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆజాద్‌ కల్పించుకుని ఇద్దరికీ సర్దిచెప్పాల్సి వచ్చింది.  

టీపీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వండి: కోమటిరెడ్డి 
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ మంగళవారం గాంధీభవన్‌ హోరెత్తిపోయింది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన వందలాది మంది కార్యకర్తలు గాంధీభవన్‌కు చేరుకుని కోమటిరెడ్డికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ఆజాద్‌ను కలిసిన కోమటిరెడ్డి తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడి మార్పుపై కొంత చర్చ జరిగింది. కొందరు వీలైనంత త్వరగా పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని కోరగా, మరికొందరు మున్సిపల్‌ ఎన్నికల తర్వాత మార్చాలని కోరారు. దీంతో ఆజాద్‌ స్పందిస్తూ.. ఆ విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఆజాద్‌తో సమావేశం ముగిసిన అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు టీపీసీసీ చీఫ్‌ పదవి ఇవ్వాలని ఆజాద్‌ను కోరినట్లు చెప్పారు. పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువస్తానని ఆయన వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement