రైతుబంధు చూపి అన్నిటికీ కోత  | Kishan Reddy fires on CM KCR | Sakshi
Sakshi News home page

రైతుబంధు చూపి అన్నిటికీ కోత 

Published Mon, May 22 2023 3:10 AM | Last Updated on Mon, May 22 2023 3:10 AM

Kishan Reddy fires on CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రైతుల జీవన శైలి మారిపోయిందంటూ సీఎం కేసీఆర్‌ గొప్పులు చెప్పుకుంటున్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఒక్కో రైతుకు రూ.10 వేల సాయం అందిస్తుంటే, కేంద్రం ఒక్కో రైతుకు ఎరువుల రాయితీ రూపంలో ఎకరానికి రూ.18,254 ఇస్తోందని చెప్పారు. రైతుబంధు పథకాన్ని చూపి పంట నష్టానికి పరిహారం, పంటల బీమా తదితరాలన్నిటికీ కోతపెట్టిన ముఖ్యమంత్రి.. రైతులను తీవ్ర నష్టాలపాలు చేశారని విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  

అకాల వర్ష బాధితులకు అందని సాయం 
అకాల వర్షాలతో రాష్ట్రంలోని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, కానీ సీఎం కేసీఆర్‌ రైతులకు ఎలాంటి సాయం చేయలేదని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంటల బీమా పథకం ద్వారా సాయం అందుతుండగా.. తెలంగాణలో ఈ పథకం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు.

రాష్ట్రంలో పరిపాలనను సలహాదారులకు అప్పగించిన సీఎం.. తాను మహారాష్ట్రలోని బీఆర్‌ఎస్‌ బ్రాంచ్‌ ఆఫీస్‌లో బిజీగా గడుపుతున్నారన్నారు కేసీఆర్‌ తనకు తాను దేశ్‌ కీ నేత అని చెప్పుకుంటున్నారని, ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రాన దేశ్‌ కీ నేత కాలేరని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ను ఎంఐఎం పార్టీ నడిపిస్తోందని విమర్శించారు. అక్కడ ఒక్క వార్డు మెంబర్‌ గెలిచినందుకే సంబరపడుతున్నారన్నారు. 

హామీలన్నీ తుంగలో తొక్కారు..: సీఎం అవ్వకముందు కేసీఆర్‌ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని కేంద్రమంత్రి విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మొదట్లోనే వారిని మోసం చేశారన్నారు. రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌ రూమ్, వైద్యం, మౌలిక వసతులు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, మున్సిపాలిటీల అభివృద్ధి.. ఏ విషయంలోనూ మాట నిలబెట్టుకోలేదన్నారు. అలాంటి ముఖ్యమంత్రి మహారాష్ట్రకు వెళ్లి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మోదీ డిజిటల్‌ విప్లవం తీసుకురావడంతో పాటు సంక్షేమ పథకాలు వందకు వంద శాతం పేదలకు అందేలా చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాయితీ కింద ట్రాక్టర్లు ఇస్తుంటే వాటిని బీఆర్‌ఎస్‌ నాయకులు వారి బంధువులకు ఇచ్చుకున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీల వల్ల ఉత్పత్తి పెరుగుతోందని, కేంద్రం నిర్మాణాత్మకంగా సబ్సిడీని అందిస్తోందని కిషన్‌రెడ్డి చెప్పారు.

ఎరువుల సబ్సిడీతో కౌలు రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ధాన్యం కొనుగోలు ఒక్క కేంద్ర ప్రభుత్వం బాధ్యతే కాదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కానీ తెలంగాణలో మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని కేంద్రమంత్రి విమర్శించారు. 

అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారు 
రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను కేవలం అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని, ఈ నోట్ల రద్దులో తమ ప్లాన్‌ తమకు ఉందని కిషన్‌రెడ్డి చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ప్రభావం తెలంగాణలో ఏమాత్రం ఉండదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని, ఇక్కడ బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ మాత్రమేనని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రస్తుతం దీనికి అవకాశం లేదని చెప్పారు.  
 
కవిత అరెస్టు మా చేతుల్లో లేదు 
ఎమ్మెల్సీ కవిత అరెస్టు అంశం తమ చేతుల్లో లేదని కిషన్‌రెడ్డి అన్నారు. ఇది ఈ కేసును పరిశోధిస్తున్న సీబీఐ పరిధిలోని అంశమని చెప్పారు. సీబీఐ వద్ద పక్కా ఆధారాలు ఉన్నందునే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేశారన్నారు. అదే విధంగా అవినీతికి పాల్పడిన కర్ణాటకకు చెందిన బీజేపీ శాసన సభ్యుడిని కూడా అరెస్టు చేసినట్లు తెలిపారు.  

27న పరేడ్‌ గ్రౌండ్స్‌లో లక్షమందితో యోగా మహోత్సవం 
ప్రతి మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంచే సాధనంగా యోగాను ప్రపంచం గుర్తించిందని, ఐక్యరాజ్యసమితితో పాటు 200కు పైగా దేశాల్లో యోగా ప్రజల జీవితాల్లో భాగమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. జూన్‌ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 25 రోజుల కౌంట్‌ డౌన్‌గా సికింద్రాబాద్‌లోని పెరేడ్‌గ్రౌండ్స్‌లో ఈనెల 27న ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ఆదివారం టూరిజం ప్లాజాలో మీడియాతో ఆయన మాట్లాడారు. కౌంట్‌డౌన్‌ యోగా కార్యక్రమానికి హైదరాబాద్‌ జంట నగరాల నుంచి సుమారు లక్ష మంది వరకు హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కేంద్ర మంత్రులతో పాటు యోగా సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. జూన్‌ 21 కి వంద రోజుల ముందు నుంచే దేశంలోని ప్రజలందరినీ ఇందుకోసం సన్నద్ధం చేస్తున్నట్లు చెప్పారు. 

సీఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించాం 
మే 27వ తేదీ ఉదయం 5 గంటలకు పరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగే యోగా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కిషన్‌రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్‌కు కూడా ఆహా్వనం పంపినట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement