సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రైతాంగానికి శుభవార్త. మరో మూడు రోజుల్లో ‘రైతుబంధు’ రెండో విడత సాయం చేతికందనుంది. పంట పెట్టుబడి కింద ఏటా ఎకరాకు రూ.8వేల నగదు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం.. రబీ సీజన్‌కు సంబంధించిన చెక్కులను 5వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు చెక్కులను ముద్రించేందుకు సన్నాహాలు చేస్తోంది. రైతుబంధు పథకానికి మే నెలలో శ్రీకారం చుట్టిన సర్కారు.. ఖరీఫ్‌కు సంబంధించిన చెక్కులను అందజేసిన సంగతి తెలిసిందే. తాజాగా రబీ సీజన్ సాయాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. జిల్లావ్యాప్తంగా తొలి విడతలో 2.87 లక్షల మందికి పెట్టుబడి ప్రోత్సాహకాన్ని అందించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో 2.42 లక్షల మందికి మాత్రమే పంపిణీ చేసింది.
వివిధ కారణాలతో మిగతావారికి సంబంధించిన చెక్కులను పెండింగ్‌లో పెట్టింది. ఈ సారి మాత్రం దాదాపు 3లక్షల మంది రైతులకు చెక్కులు జారీ కానున్నాయని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. అభ్యంతరాలతో గతంలో పక్కనపెట్టిన భూములకు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేసినందున సుమారు 15వేల మంది రైతులు అదనంగా చేరినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో రూ.283.28 కోట్లు పంపిణీ చేసిన యంత్రాంగం తాజాగా రూ.300 కోట్ల మేర రైతులకు అందజేయడానికి సన్నద్ధమవుతోంది.
మండల కేంద్రాలతో షురూ..
రైతుబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా భావించిన సర్కారు.. పట్టాదార్‌పాస్‌పుస్తకాలు, చెక్కులను ఏకకాలంలో పంపిణీ చేసింది. దీంతోపాటు చెక్కుల్లో ముద్రణా లోపాలు తలెత్తకుండా జాగ్రత్తపడింది. ఈ మేరకు రైతుకిచ్చే ప్రతి చెక్కు(లీఫ్)ను సునిశితంగా పరిశీలించింది. ఈ మేరకు నిర్దేశిత బ్యాంకు ప్రధాన కార్యాలయాల్లో వ్యవసాయశాఖాధికారులను అందుబాటులో ఉంచింది. దీంతో నిర్ధిష్ట సమయానికి రైతుల చేతికి సాయం అందింది. ఈ సారి మాత్రం ఈ ఇబ్బందుల నుంచి అధికారులకు విముక్తి కలుగనుంది. ధరణి వెబ్‌సైట్ నుంచే సమాచారాన్ని సేకరిస్తుండడం.. గతంలో ఒకసారి తప్పులను సరిదిద్దినందున చెక్కులను పరిశీలించే అవకాశంలేకుండా పోయింది.
దీంతో వ్యవసాయశాఖాధికారులకు చెక్కుల పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు జిల్లాలోని రైతుల చెక్కుల పంపిణీ సాధ్యపడదు గనుక.. మండల కేంద్రాల్లోని రైతులకు తొలుత చెక్కులను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మండల కేంద్రాల రైతుల చెక్కుల ముద్రణపై దృష్టి సారించింది. ఈ మేరకు వ్యవసాయశాఖకు కూడా సమాచారం అందజేసింది. మండల కేంద్రంలో మొదలుపెట్టి దశలవారీగా గ్రామాలకు విస్తరించాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment