సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యే అవకాశముంది.. ఎంత పరిమాణంలో విత్తనాలు, ఎరువులు అవసరమో అంచనా వేసింది. మరో నెల రోజుల్లో తొలకరి పలకరించే వీలుండటంతో అందుకు సంబంధించిన కసరత్తు పూర్తిచేయడంలో నిమగ్నమైంది. గతేడాది తరహాలోనే 1.68 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కావొచ్చని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో వరుసగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలను, భూగర్భ జలాలను నమ్ముకుని మెట్ట పంటలకే రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు.
సాగునీటి వనరులు లేవు. దీంతో ఎప్పటిలాగే జిల్లాలో పత్తి అధిక మొత్తంలో సాగవుతుందని అంచనా వేశారు. జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 60,417 హెక్టార్లు. ఇంతే మొత్తంలో వచ్చే ఖరీఫ్‌లో సాగవుతుందని భావిస్తున్నారు. అయితే, గతేడాది రికార్డు స్థాయిలో 69వేల హెక్టార్లలో జిల్లా రైతులు సాగుచేశారు. వర్షాలు సకాలంలో కురిస్తే అదే స్థాయిలో సాగు విస్తీర్ణం పెరగొచ్చని భావిస్తున్నారు. పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న, వరి పంట వేయనున్నారు. కందుల సాగుపైనా రైతులు దృష్టి సారిస్తున్నారు. ఖరీఫ్‌లో సాగయ్యే అన్ని పంటలకు కలిపి సుమారు 26వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా వేశారు.
సబ్సిడీపై విత్తనాలు
పత్తి మినహా ఇతర పంటల విత్తనాలపై రైతులకు సబ్సిడీ లభిస్తుంది. పంటను బట్టి విత్తనాలపై సబ్సిడీ ధర మారుతుంది. అయితే, ఇప్పటివరకు కొన్ని పంటల విత్తనాలకే సబ్సిడీ ధరను నిర్ణయించారు. మిగితా వాటి ధరను ప్రకటించాల్సి ఉంది. సోయాబీన్ క్వింటా ధర రూ.6,150 కా>గా.. సబ్సిడీపై రూ.2,500లకే రైతులకు అందజేశారు. అలాగే క్వింటా జీలుగ ధర రూ.5,150 కాగా.. రాయితీపై రూ.3,350కు విక్రయిస్తారు. జొన్న, కొర్రలు, సజ్జలు, అండ్రు కొర్రలు తదితర చిరుధాన్యాలపై 65 శాతం, వేరుశనగ, నువ్వులు, ఆముదంపై 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. సబ్సిడీ విత్తనాలు ఇప్పుడిప్పుడో గోదాంలకు చేరుతున్నాయి. తొలకరి ప్రారంభానికి ముందే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్), రైతు సేవా కేంద్రాలు (ఏఆర్‌ఎస్‌కే), జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) తదితర కేంద్రాల నుంచి రైతులు విత్తనాలు పొందవచ్చు. రైతు ఆధార్ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ పత్రాలను సమీప ఏఈఓను సంప్రదించి సబ్సిడీపై విత్తనాలు పొందవచ్చు.
పత్తి విత్తనాల ధర ఇలా..
ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న డీలర్లు మాత్రమే విత్తనాలు విక్రయించాలి. ఇతరులు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే అది నేరమే. ఈ విషయంలో జిల్లా వ్యవసాయ అధికారులు పకడ్బందీగా వ్యహరిస్తున్నారు. అంతేగాక ఎమ్మార్పీకి మించి విక్రయించకూడదు. వ్యవసాయ శాఖ పత్తి విత్తనాల ధరను నిర్ణయించింది. 450 గ్రాముల తూకం కలిగిన బీజీ–1 విత్తనాలను రూ.635, బీజీ–2 విత్తనాలను రూ.730కు మాత్రమే రైతులకు అమ్మాలి.
ముందే సాగుచేయాలి
రైతుల పొలాల్లో కావాల్సిన స్థాయిలో సారం లేదు. ఈ లోటును అధిగమించేందుకు పచ్చిరొట్ట ఎరువులను విరివిగా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జనుము, జీలుగ, పిల్లిపెసర వంటిని వేసుకోవడానికి ఇదే మంచి తరుణమని చెబుతున్నారు. ఇప్పుడు వేసుకుంటేనే తొలకరి నాటికి పంట కావాల్సిన పోషకాల్లో సమతుల్యత ఏర్పడుతుందని వివరిస్తున్నారు. తద్వారా మంచి దిగుబడులు సాధ్యమవుతాయని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment