ఖమ్మంవ్యవసాయం: పెట్టుబడి పైకం రైతుల ఖాతాల్లోకి చేరుతోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి రైతుబంధు పేరిట నూతన పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందించి.. రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి సీజన్‌కు ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి.. పకడ్బందీగా అమలు చేస్తోంది. దీంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌కు జిల్లాలో 2,79,198 మంది రైతులకు చెందిన 6.87 లక్షల ఎకరాల భూమికి రూ.343.10కోట్ల పెట్టుబడి సహాయం అందనుంది.
ఇప్పటికే ఈ ప్రక్రియను వ్యవసాయ శాఖ ప్రారంభించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సహాయం జమ అయ్యే విధంగా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. గత ఏడాది ఒక్కో సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయం అందించి ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు ఖరీఫ్, రబీ సీజన్లలో వేర్వేరుగా ఎకరాకు రూ. 4వేల చొప్పున పంటలకు పెట్టుబడి సహా యం రూ.8వేలను ప్రభుత్వం అందించింది. ఖరీఫ్ సీజన్‌లో చెక్కుల రూపంలో పెట్టుబడి అందించిన ప్రభుత్వం.. రబీ సీజన్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పెట్టుబడి సాయాన్ని రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. అదే విధానాన్ని ఈ ఏడాది కూడా కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు.
ఎకరాకు రూ.5వేల పెట్టుబడి సాయం
ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సహాయం అందిస్తోంది. గత ఏడాది సీజన్‌కు రూ.4వేల చొప్పున పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం.. రైతులను మరింతగా ప్రోత్సహించేందుకు ఈ ఏడాది నుంచి ఎకరాకు మరో రూ.వెయ్యి పెంచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతుబంధు పథకంలో ఎకరాకు సీజన్‌కు మరో రూ.వెయ్యి పెంచుతామని పేర్కొంది. మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో మరింత శ్రద్ధ చూపి.. ఖరీఫ్ సీజన్ నాటికి ఎకరాకు రూ.5వేల చొప్పున రైతులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించే ప్రక్రియను వ్యవసాయ శాఖ చేపట్టింది.
2,79,198 మంది రైతులకు ‘పెట్టుబడి’
జిల్లాలో సొంత భూములతో పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన 2,79,198 మంది రైతులకు ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతుబంధు పథకం వర్తించనుంది. ప్రభుత్వం గత ఏడాది నుంచి అందిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు, అటవీ భూములకు(పోడు) హక్కు పత్రాలు కలిగిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 6.87 లక్షల ఎకరాల భూమికి రూ.343.10కోట్లు కేటాయింపు జిల్లాలో వివిధ రకాలుగా పట్టాలు కలిగి ఉన్న 6.87 లక్షల ఎకరాల భూమికి ప్రభు త్వం పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం భూమి లో పంటల సాగుకు పెట్టుబడి సహాయంగా రూ.343.10కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ సహాయంతో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు తమ భూముల్లో సాగు చేసే పంటలకు సంబంధించిన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం లక్ష్యం కూడా అదే. పెట్టుబడి సహాయంతో పంటలను సాగు చేసుకోవాలని ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిçంచే ప్రయత్నాలు చేస్తోంది.
సద్వినియోగం చేసుకోవాలి..
ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు అందిస్తున్న రైతుబంధు పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలు కోసం రైతుబంధు పథకం నగదును వినియోగించుకోవాలి. ప్రభుత్వం చేపట్టిన ఈ పథకం రైతులకు, వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుంది. ఖరీఫ్ సీజన్‌కు అనుకూలంగా పెట్టుబడి సహాయం రైతులకు బ్యాంక్ ఖాతాల ద్వారా చేరుతుంది. ఆ ఖాతాల నుంచి నగదును వివిధ రకాలుగా పంట పెట్టుబడులకు వినియోగించుకోవచ్చు. – ఏ.ఝాన్సీలక్ష్మీకుమారి, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment