
రైతుబంధు పథకం కింద ప్రభుత్వం అందజేస్తున్న పెట్టుబడి సాయం అనేక మంది రైతులకు అందలేదు. ఖరీఫ్ సీజన్ ఆరంభం నుంచి ఎదురుచూస్తున్నా ఇప్పటికీ తమ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా 38 శాతం మంది అన్నదాతలకు రైతుబంధు సాయం అందాల్సి ఉంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులపై పంటల సాగు భారం పడకూడదని రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పెట్టుబడి కింద రైతులకు ఎకరాకు ఈ సీజన్ నుంచి రూ.5 వేలు చొప్పున చెల్లిస్తోంది. ఈ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమచేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2.81 లక్షల మంది రైతులు ఉండగా ఇందులో 2.36 లక్షల మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు అందజేశారు. వీరిలో ఇంతవరకు 1.47 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే రైతుబంధు సొమ్ము జమైంది. మొత్తం రూ.161.24 కోట్ల డబ్బులు అన్నదాతలకు అందాయి. మరో 88,482 మంది రైతులకు పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. వీరికి సుమారు రూ.90 కోట్ల నిధులు అవసరం. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడమే జాప్యానికి కారణమని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
అప్పులు తెచ్చి సాగు..
రైతుబంధు సాయం అందుతుందున్న ధైర్యంతో చాలా మంది రైతులు అప్పు తెచ్చి పంటల సాగుచేస్తున్నారు. వాస్తవంగా సకాలంలో పెట్టుబడి సాయం అందితే.. కొంతలో కొంతైనా అప్పు భారం రైతులకు తప్పేది. రైతుబంధు సాయం అందజేతలో జాప్యం జరుగుతుండటంతో తమకు వడ్డీ భారం పెరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో కొందరికి ఖాతాల్లో డబ్బులు జమకాకపోగా.. మరికొందరు సాంకేతిక లోపాల వల్ల రైతుబంధుకు నోచుకోవడం లేదు. బ్యాంకు ఖాతా నంబర్లు, ఐఎఫ్‌ఎస్ కోడ్, ఆధార్‌నంబర్లు తదితర వివరాలు తప్పుగా నమోదు కావడం వల్ల డబ్బులు అందడం లేదు. ఇంకొందరు వీటిని సరిదిద్దడానికి సరైన వివరాలు ఇచ్చినా ఆన్‌లైన్‌లో ఇంకా అప్‌డేట్ కావడం లేదని తెలుస్తోంది. దీంతో సాయం ఖాతాల్లో జమ కావడం లేదు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ఒకటి రెండు రోజులు ఆలస్యంగానైనా రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment