సాక్షి. జగిత్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నూతన వ్యవసాయ విధానం తుగ్లక్ పాలనను మరిపిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రైతుబంధును ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, అందుకే పనికిమాలిన మెలికలు పెడుతోందని మండిపడ్డారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్లు తగ్గిస్తుంటే.. ఈసారి పత్తి పంట విస్తీర్ణం పెంచాలనడం ఏమిటని ప్రశ్నించారు. కందులు, మినుముల కొనుగోలుకు మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకర ధోరణి అవలంబిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో పది లక్షల మందికి 1,600 పరీక్షలు చేస్తుంటే.. రాష్ట్రంలో 650 మందికి మాత్రమే చేయడం బాధ్యతారాహిత్యం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు లక్షల టెస్టులు చేస్తే తెలంగాణలో 22 వేలు మాత్రమే చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వలస కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కరోనా నియంత్రణకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చిన విరాళాల వివరాలు వెల్లడించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతుబంధు అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. గల్ఫ్ కార్మికుల క్వారంటైన్ చార్జీలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. అంతకుముందు రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment