కేసీఆర్ పొగరు వల్లే 104 నుంచి 39కి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది
ఆయన ఎవరినో తొక్కడం కాదు.. ఎన్నికల్లో జనమే కేసీఆర్‌ను బొంద పెడతారు
షెడ్యూల్ ప్రకారమే నీళ్లు ఇస్తున్నాం.. విద్యుత్, తాగునీటి సమస్య రానివ్వం
విలేకరుల సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పొగరు కారణంగానే గత ఎన్ని కలకు ముందు 104 మందితో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య ఇటీవలి ఎన్నికల తర్వాత 39కి తగ్గిందని సాగు నీరు, పౌరసరఫరాల మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమ ర్శించారు. ఇప్పుడు అందులోనూ 25 మంది త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని జోస్యం చెప్పారు. శనివా రం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌లతో కలసి ఉత్తమ్ మాట్లాడారు.
కరీంనగర్ పర్యటనలో కేసీఆర్ అన్నీ అబద్ధాలు మాట్లాడారని, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఎవరినో తొక్కడం కాదని, లోక్‌సభ ఎన్నికల్లో జనమే కేసీ ఆర్‌ను బొంద పెడతారని వ్యాఖ్యానించారు. సాగునీటి రంగంపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఇంట్లో పడుకున్న కేసీఆర్ ఇప్పుడు నైరాశ్యంలో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
తమను బ్రోకర్, జోకర్ అంటున్న కేసీఆర్ లాగా తాము పాస్‌పోర్టులు అమ్ముకొని బ్రోకర్లుగా పనిచేయ లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ లాంటి పొగరుబోతు వ్యక్తి ని తానెప్పుడూ చూడలేదని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని వేరే దేశాల్లో అయితే ఉరి తీస్తారన్నారు.
కరువు తెచ్చింది కేసీఆరే..
కేసీఆర్ సాగునీటి రంగాన్ని పదేళ్లపాటు సర్వనాశనం చేశా రని, ఆయన కమీషన్ల కక్కుర్తి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పుట్టు కొచ్చిందని ఉత్తమ్ ఆరోపించారు. కరువును తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, కేసీఆరేనని, ఆయన మాటలు ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాగు, సాగునీటి అవసరాల కోసం కేసీఆర్ మొహం చూసి తాము నీళ్లు విడుదల చేయట్లేదని, షెడ్యూల్ ప్రకారమే విడుదల చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్, తాగునీటి సమస్య రాకుండా చూసుకుంటామని ఉత్తమ్ భరోసా ఇచ్చారు.
కేసీఆర్‌ను పాతిపెట్టాలి: జూపల్లి
కేసీఆర్ చవట, దద్దమ్మ కాబట్టే ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల నెత్తిన రూ. 8 లక్షల కోట్ల భారం మోపా రని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రాంతీయుడు అన్యాయం చేస్తే ప్రాంతంలోనే పాతిపెట్టా లన్న కాళోజీ అన్నట్టు కేసీఆర్‌ను పాతిపెట్టాలని వ్యాఖ్యానించారు.
ఆయన అధికారంలో ఉన్న పదేళ్లలో ఏనాడైనా పంట నష్టం పరిహారం రైతులకు ఇచ్చారా అని ప్రశ్నించారు. నాలుగు మాసాల తమ పాలన చూసే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా ఒక్క లోక్‌సభ స్థానం కూడా రాదని అన్నారు. ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండమని తాము ధైర్యంగా చెబుతున్నామని, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతే పార్టీని రద్దు చేసుకుంటానని చెప్పే ధైర్యం కేసీఆర్‌కు ఉందా అని సవాల్ విసిరారు.
తల ఎక్కడ పెట్టుకుంటావ్... కేసీఆర్: పొన్నం
మిషన్ కాకతీయ పేరుతో రూ. 40 వేల కోట్లు పెట్టి కేసీఆర్ చెరువుల్లో పూడికలు తీయిస్తే భూగర్భంలో ఉన్న నీళ్లు ఏమ య్యాయని రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయానన్న అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఉపయోగించిన భాషతోనే తాము కౌంటర్ ఇస్తే ఆయన తల ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. తాము రేపటి నుంచి ఫీల్డ్‌లోనే ఉంటామని, ఎవరు ఎవరిని తొక్కుతారో చూద్దామని సవాల్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment