రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని గమనించి పరిస్థితులకు అనుగుణంగానే సలహాలు, సూచనలు ఇస్తామని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్ స్పష్టం చేశారు. మూడేళ్లుగా తెలంగాణ వృద్ధిరేటు వేగంగా ముందుకెళ్తోందన్న ఆయన.. రైతుబంధు, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణ వంటివి రైతాంగ సమస్యల పరిష్కారానికి కీలకమైన ముందడుగని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలా? వద్దా? అనే విషయంలో ఆర్థిక సంఘం చెప్పేదేమీ ఉండదని.. జాతీయాభివృద్ధి మండలిదే తుది నిర్ణయమని ఎన్‌కే సింగ్ స్పష్టం చేశారు. జనాభా నియంత్రణ విషయంలో ఉత్తర, దక్షిణ భారతాలంటూ వేర్వేరుగా చూడటంలో అర్థం లేదని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారంలో తెలంగాణ, ఏపీల్లో 15వ ఆర్థిక సంఘం పర్యటించనున్న నేపథ్యంలో ఎన్‌కే సింగ్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ విశేషాలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఓ ఆర్థికవేత్తగా, రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు ఏడాదిగా 15వ ఆర్థిక సంఘం చైర్మన్ హోదాలో ఉన్నారు. ఈ కాలంలో మీకు సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?
ఎన్‌కే సింగ్: ఆర్థిక సంఘం చైర్మన్‌లు ఎవరైనా చెప్పేదొక్కటే. కఠినమైన సవాళ్లున్నాయి. అయితే చాలా పరిమితుల్లో పనిచేయాల్సిన కారణంగా.. ఈ సమస్యలను వీలైనంత త్వరగా నైపుణ్యంతో పరిష్కరించడం కష్టమవుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితిని మూడు అంశాలు మార్చేశాయి.
మొదటిది.. ప్రణాళికా సంఘం పనితీరులో మార్పుతీసుకురావడం. ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులను పక్కాగా ప్లాన్ చేయడం. ఈ ఏడాది రెవెన్యూ, మూలధనం లోటుంది. కానీ దీన్ని అధికారులు అంగీకరించరు.
రెండోది.. జీఎస్టీపై ఆర్థిక సంఘానికి పూర్తి పట్టుంటుంది. ఇది ప్రభుత్వానికి స్థిరమైన ఆదాయం. సంప్రదాయంగా వస్తున్న ఆర్థిక సమాఖ్య విధానంలో ఉన్న చాలా సమస్యల్లో జీఎస్టీ ద్వారా సానుకూల మార్పులొచ్చాయి. కామన్ మార్కెట్‌లో భారత్‌కు భారీ ప్రయోజనాలు చేకూరేందుకు అవకాశాలు కల్పించింది.
మూడోది.. రాష్ట్రాలు కోల్పోతున్న రెవెన్యూను తిరిగి పొందే సామర్థ్యాన్ని పెంపొందించడం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఈ సమస్యలపై మరోసారి సమీక్షించాల్సిన అవసరం ఉంది. ఇవి ఆర్థిక సంఘం ముందున్న ప్రధానమైన సవాళ్లు.
ప్రశ్న: జనాభా నియంత్రణ విషయంలో చర్యలు తీసుకున్నప్పటికీ తమకు అన్యాయం జరుగుతోందంటూ దక్షిణాది రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై మీరేమంటారు?
జవాబు: నివేదికలో ఏయే అంశాలుండాలనే దానిపై ఆర్థిక సంఘం ప్రమేయం ఉండదు. ఇది పూర్తిగా భారత రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఒకసారి నిబంధనలు రూపొందించాక వీటి ఆధారంగా పనిచేయడమే ఆర్థికసంఘం పని. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటున్నామన్నది వాస్తవం. ఈ విషయంలో మేమేమీ చేయలేం. వీటితోపాటుగా పలు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. జనాభా నియంత్రణలో సమర్థవంతంగా పనిచేసిన రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలుంటాయి. సమానత్వం, సామర్థ్యం మధ్య సమన్వయం చేయడం అంత సులువేం కాదు. భౌగోళిక అంశాల ఆధారంగా జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ప్రయత్నాలను విస్మరించడం ఆర్థిక సంఘం ఉద్దేశం కాదు. ఈ విషయంలో మేం చాలా విశాల ధృక్పథంతో ఉన్నాం. అసలు జనాభా నియంత్రణ విషయంలో దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడటం.. వాస్తవాలను తప్పుదారి పట్టించడమే. ఉత్తరాది రాష్ట్రాలైన పశ్చిమబెంగాల్, పంజాబ్, ఒడిశాలు ఈ విషయంలో ఎంతో ప్రగతిని కనబరిచాయి. అందుకే ఆర్థిక సంఘం.. రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యం, ప్రజలకోసం ఏవిధంగా నిధుల వినియోగం చేస్తున్నాయనేదాన్నే విశ్వసిస్తుంది.
14, 15వ ఆర్థిక సంఘాలు ఇంతవరకు ఏపీకి ప్రత్యేక హోదా గురించి ఏమీ మాట్లాడలేదు. ఈ దిశగా ఆర్థిక సంఘం ఏమైనా పునరాలోచన చేస్తుందా?
గతేడాది మేలో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించినపుడు ఈ అంశంపై చర్చ జరిగింది. ప్రత్యేక హోదా అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదనే అంశాన్ని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పాను. ప్రత్యేక హోదా అనే అంశం పూర్తిగా జాతీయాభివృద్ధి మండలి పరిధిలోకి వస్తుంది. ఇది పూర్తి రాజకీయ పరమైన అంశం. ఈ విషయంలో ఆర్థిక సంఘం ఇచ్చే సూచనలేమీ ఉండవు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. కర్ణాటకతోపాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో పెట్టుబడులకు నష్టం చేస్తాయంటూ పార్లమెంటు స్టాండింగ్ కమిటీ (ఆర్థికాంశాలు) చైర్మన్ వీరప్ప మొయిలీ పేర్కొన్నారు?
ఈ విషయం నాకు తెలియదు. ఆర్థికపరమైన అంశాలపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఈ వ్యాఖ్యలు చేసుంటే.. దీనిపై మేం స్పందించడం సరికాదు.
తెలంగాణ పర్యటన విషయానికొస్తే.. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం.. అప్పుల్లో కూరుకుపోవడంపై మీరేమంటారు?
గత మూడేళ్లలో తెలంగాణ గణనీయమైన ఆర్థిక వృద్ధిరేటు సాధించింది. గతంలో కంటే చాలా మెరుగైన ఫలితాలు సాధించింది. సాగునీటి పారుదల అంశాలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టారు. చెరువులను పునరుద్ధరిస్తోంది. సాగుకోసం భూగర్భ జలాలను పెంచేలా ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సానుకూల అభివృద్ధికి బాటలు పడ్డాయి. ఇందుకు ప్రోత్సహించాలి. దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పులు, ఆర్థిక లోటు, అనవసర ఖర్చులు తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంది. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మాకు నివేదిక అందింది. హైదరాబాద్ పర్యటనలో ఆ రాష్ట్ర అకౌంట్ జనరల్‌తో మాట్లాడతాం. పూర్తి ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి తదితర అంశాలపై సూచనలు ఇస్తాం.
ఇటీవలి మీ పంజాబ్ పర్యటనలో అక్కడి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అలాంటి సూచనలేమైనా ఇస్తారా?
వీటిపై ముందుస్తు ఊహాగానాలు చేయలేం. పంజాబ్ పరిస్థితులు అక్కడి సమస్యలు వేరు. అక్కడి ప్రభుత్వం చాలా అప్పుల్లో కూరుకుపోయినందుకు సూచనలిచ్చాం.
వాటర్ గ్రిడ్, చెరువుల పునరుద్ధరణ కోసం కేంద్ర నిధులివ్వాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది? రుణాలను కూడా మాఫీ చేయాలని అడుగుతోంది?
రాజ్యాంగ పరిధిలో నిబంధనలకు అనుగుణంగా పనిచేయడమే మా లక్ష్యం. ఒక రాష్ట్రానికి ఎక్కువ మేలు చేద్దామని ప్రయత్నిస్తే.. మిగిలిన రాష్ట్రాలకూ అది అమలవుతుంది. ఆర్టికల్ 275 కింద ఒక్కో రాష్ట్రం ద్రవ్యలోటును కూడా మేం పరిగణించాల్సి ఉంటుంది. దీంతోపాటు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను కూడా పోల్చి చూడాలి. తెలంగాణ పూర్తి ఆర్థిక స్థితిని చూశాకే ఏమైనా సూచనలు చేయాల్సిన అవసరం ఉందా అని ఆలోచిస్తాం.
వృద్ధి పథంలో ఉన్న తెలంగాణకు ఎఫ్‌ఆర్‌బీఎం కింద ఏమైనా అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాలుంటాయా?
మేం విశాల ధృక్పథంతో ఆలోచిస్తాం. ఇందులో భాగంగా పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 14వ ఆర్థిక సంఘం 3% ఆర్థిక లక్ష్యంలో 0.5% వెసులుబాటు కల్పించారు. మేం ఏం చేయాలనేది అన్ని విషయాలు క్రోడీకరించి నిర్ణయిస్తాం.
ఆర్థిక సంఘం దృష్టిలో.. తమకు నిధులు కావాలంటున్న మండలాలు, జిల్లా పరిషత్‌ల పరిస్థితేంటి?
ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఈ దిశగా మాకు ప్రతిపాదనలు పంపాయి. మేం ఇప్పటివరకు 18 రాష్ట్రాల్లో పర్యటించాం. దాదాపు ప్రతిచోటా ఈ డిమాండ్ కనిపించింది. 14వ ఆర్థిక సంఘం కేవలం పంచాయతీల నిధుల విషయంలో మాత్రమే నిర్ణయం తీసుకోవడంపై మేం అధ్యయనం చేస్తున్నాం. పంచాయతీరాజ్ వ్యవస్థలోని మూడు అంచెల వ్యవస్థకు నిధులిస్తే బాగుంటుందని భావిస్తున్నాం.
రాజకీయ ప్రజాకర్షణ కోసం తెలంగాణ సహా పలు రాష్ట్రాలు రుణమాఫీకి జై కొట్టడంపై మీరేమంటారు?
ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వ్యక్తిగత నిర్ణయం. ఈ అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదు. ఆర్టికల్ 293 కింద ఆర్థిక స్థోమత అంశాన్ని మాత్రం మేం పరిశీలిస్తాం. అయితే.. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యకు రుణమాఫీ ఒక్కటే పరిష్కారం కాదని మేం బలంగా విశ్వసిస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా నష్టాల్లో ఉంది. 14వ ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా కేంద్రం ఎందుకు వారికి సహకరించడం లేదు?
రెవెన్యూ లోటు నిధులు (ఆర్డీజీ) ఏ ఒక్కరి సొంత నిర్ణయం కాదు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. నిధుల సంక్రమణ విషయంలో ఆర్థిక సంఘం స్వతంత్రంగా సమీక్ష చేస్తుంది. ఒక్కో రాష్ట్రం పరిస్థితిని గమనిస్తాం. ప్రతి రాష్ట్రం ఆర్డీజీ కావాలంటుంది. కానీ అందరికీ ఇవ్వలేం. ఈ అంశంలో కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల సరఫరా విషయంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాకు స్పష్టత వచ్చింది. కేంద్రం ఏం ఆలోచిస్తుందనేది ఇంకా తెలియాలి. దీనికోసమే వేచి చూస్తున్నాం. ఆ తర్వాతే ఆర్డీజీకి అర్హులా? కాదా? అనే అంశాన్ని పరిశీలిస్తాం.
ప్రజాకర్షక పథకమైన రైతుబంధుపై విమర్శల గురించి మీరేమంటారు?
రైతుసమస్యలకు కొంతమేర ఉపశమనం కలిగించేందుకు తీసుకున్న చర్యలో రైతుబంధు కీలకమైంది. ఒడిశా ప్రభుత్వం కూడా కాలియా పేరుతో ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది. కేంద్రం కూడా ప్రతి రైతుకు రూ.6వేల రూపాయల ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ముందుకొచ్చింది. చాలారాష్ట్రాలు రైతు సమస్యలను పరిష్కరించేందుకు తమ ఆర్థిక స్థితికి అనుగుణంగా ప్రయత్నిస్తున్నాయి. స్థూల ఆర్థిక స్థిరత్వం విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ పర్యటనలో ఆ ప్రభుత్వంతో చర్చిస్తాం. ఎఫ్‌ఆర్‌బీఎం (ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్) విషయంలోనూ ప్రభుత్వంతో చర్చించాల్సిన అవసరం ఉంది.
ఆర్థిక సంఘం రాష్ట్రాల సమస్యలను పట్టించుకోదంటూ కేసీఆర్ చేస్తున్న విమర్శలపై?
తెలంగాణకు వీలైనంత సహాయం చేయాలనేదే నా ఉద్దేశం. ఆ రాష్ట్రం ఆర్థికంగా పరుగులు పెట్టే విషయంలో మేం చేయాల్సినవన్నీ చేస్తాం. దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణకు ఎక్కువ అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment