భారీ సీపీఎస్‌ఈల సీఎండీల సమావేశంలో ఆర్థికమంత్రి
న్యూఢిల్లీ: కరోనా ప్రేరిత సమస్యల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి మరో ఉద్దీపన ప్రకటన అవకాశం ఉందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఒక సూచనప్రాయ ప్రకటన చేశారు. అధికార బాధ్యతల్లో తన అనుభవాలకు సంబంధించి 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ రాసిన ఒక పుస్తకాన్ని ఆవిష్కరించిన నిర్మలాసీతారామన్ ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా మహమ్మారి ప్రభావాలపై కేంద్రం మదింపు ప్రక్రియను అక్టోబర్ నుంచీ ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. మదింపు ఫలితాలకు సంబంధించి ఆర్థికశాఖ ప్రకటన చేస్తుందనీ తెలిపారు. ‘మరో ఉద్దీపన అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు. లోతైన సంప్రదింపుల అనంతరం మేము ఇప్పటివరకూ 2 ఉద్దీపనలను ప్రకటించాము’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర రంగాలను వర్గీకరించడానికి ఆర్థికశాఖ త్వరలో క్యాబినెట్‌ను సంప్రదిస్తుందని కూడా ఆర్థికమంత్రి తెలిపారు.
వ్యయాలపై సీపీఎస్‌ఈలకు నిర్మలాసీతారామన్ సూచన
ఇదిలావుండగా, బొగ్గు, పెట్రోలియం, సహజవాయువు శాఖల కార్యదర్శులతోపాటు.. 14 భారీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల (సీపీఎస్‌ఈ) సీఎండీలతో ఆర్థిక మంత్రి సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీపీఎస్‌ఈలు 2020–21లో నిర్దేశించుకున్న మూలధన వ్యయ లక్ష్యాల్లో 75% డిసెంబర్‌కి చేరుకోవాలని.. తద్వారా ఆర్థిక వృద్ధికి మద్దతుగా నిలవాలని కోరారు. కరోనా కారణంగా కుంటుపడిన ఆర్థిక వృద్ధిని తేజోవంతం చేసేందుకు గాను ఆర్థిక మంత్రి వివిధ భాగస్వాములతో భేటీ కావడం ఇది నాలుగోది. మూలధన వ్యయాలను 2020–21, 2021–22లో వేగవం తం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. 2019–20కి 14 సీపీఎస్‌ఈలు రూ.1,11,672 కోట్లను మూలధన వ్యయాల రూపంలో ఖర్చు చేయాలని నిర్దేశించుకోగా.. రూ.1,16,323 కోట్లు (104%) ఖర్చు చేసినట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.1,15,934 కోట్ల వ్యయాలను అవి లక్ష్యంగా పెట్టుకోగా.. తొలి 6 నెలల్లో (సెప్టెంబర్ నాటికి) కేవలం రూ.37,423 కోట్లనే వ్యయం చేశాయి.
తయారీపై దృష్టి పెట్టాలి: ముకేశ్
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, భారత్ మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో 70% వాటా ఉన్న తయారీ రంగంలో పెట్టుబడులపై భారత్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తీసుకుంటున్న చర్యల ఫలితాలు, భవిష్యత్తులో పరిశ్రమలు, సేవా రంగాల పనితీరుపై సమగ్ర మదింపు జరపాలని సూచించారు. దేశ స్వయం సమృద్ధి విషయంలో ఇది కీలకమన్నారు. ‘ఒక పాఠశాల ఉపాధ్యాయుని కుమారుడైన మా తండ్రి 1960లో ముంబైలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన దగ్గర ఉంది కేవలం రూ.1,000. భవిష్యత్ వ్యాపారాలు, ప్రావీణ్యతల్లో పెట్టుబడి పెడితే మనం కలలుగన్న భారతాన్ని మనమే నిర్మించుకోగలమన్న విశ్వాసం ఆయనది. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలను, కంపెనీలను సృష్టించగలమన్న నమ్మకం ఆయన సొంతం’ అని ముకేశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment