కరోనా ప్రభావంతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. మన జీడీపీలో ఇది 10 శాతం. ఈ 20 లక్షల కోట్లలో నిజానికి రూ.9.94 లక్షల కోట్ల ఉద్దీపనను ఇప్పటికే రకరకాలుగా అందజేసినట్లు తాజాగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీనికిప్పుడు రూ.1.7 లక్షల కోట్లు జత చేశామన్నారు. ఇదికాక మార్చి 27 నుంచి ఆర్‌బీఐ రూ.8.02 లక్షల కోట్ల విలువైన వివిధ ద్రవ్య చర్యలను ప్రకటించింది. ఈ ప్యాకేజీలో రూ.12.95 లక్షల కోట్లు ఆహార భద్రతకు, కూలీల నగదు పంపిణీకి (మనిషికి రూ.500 చొప్పున), గ్రామీణ ఉపాధి పథకానికి, సూక్ష్మ, మధ్యస్థ కంపెనీలకు రుణాలివ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారామె. ఈ ప్యాకేజీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో మిగతా దేశాలు ఏం చేశాయో ఒక్కసారి చూద్దాం...
చైనా... రూ.100 లక్షల కోట్లు
► ఉద్దీపన చర్యల నిమిత్తం జీడీపీలో 2.5 శాతాన్ని (34 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.25.5 లక్షల కోట్లు. దీన్లో రూ.12 లక్షల కోట్లమేర చర్యలను ఇప్పటికే అమలు చేసింది. మరో రూ.13 లక్షల కోట్ల మేర లోకల్ బాండ్లను కొనుగోలు చేసింది.
► రూ.32 లక్షల కోట్ల మేర వ్యవస్థలోకి నగదు పంపి లిక్విడిటీని పెంచింది. ఇంకా రుణాలున్న వారికి కొత్త రుణాలివ్వటానికి, రీ–డిస్కౌంట్ చేయడానికి మరో రూ.17 లక్షల కోట్లు కేటాయించింది.
► పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఏకంగా 1.5 శాతం వడ్డీ రేట్లను తగ్గించింది. (డాక్టర్ రెడ్డీస్ లాభం 764 కోట్లు)
జపాన్... రూ.80 లక్షల కోట్లు
► జీడీపీలో అత్యధికంగా 21.1 శాతాన్ని అత్యవసర ఆర్థిక ప్యాకేజీగా ప్రకటించింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.80లక్షల కోట్లు. కాకపోతే దీన్లో రూ.60 లక్షల కోట్లను వ్యాపారాలు, ఉద్యోగాల్ని రక్షించుకోవటానికే వినియోగిస్తోంది.
► చిన్న వ్యాపారాలకు రాయితీలపై రుణాలు అందిస్తోంది. లిక్విడిటీని మెరుగుపరచటానికి ప్రభుత్వ బాండ్ల సంఖ్యను పెంచటం, ఎక్కువసార్లు జారీ చేయటం వంటి చర్యలు తీసుకుంది.
జర్మనీ.. రూ.30 లక్షల కోట్లు
► కరోనా మహమ్మారిపై పోరాడటానికి జర్మనీ తన జీడీపీలో 10.7 శాతాన్ని (40 వేల కోట్ల డాలర్లు) కేటాయించింది. మన కరెన్సీలో ఇది రూ.30 లక్షల కోట్లు. దీన్లో సగం మొత్తాన్ని స్వల్పకాలిక పనులకు, ఉద్యోగాలను కాపాడటానికి వినియోగిస్తోంది.
► వివిధ వర్గాలకిచ్చే రుణాలను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 23 శాతానికి పెంచేలా (మన కరెన్సీలో 86.25 లక్షల కోట్లు) ప్రభుత్వ గ్యారంటీలను వినియోగిస్తోంది.
► ఇక అక్కడి స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ప్యాకేజీలు దీనికి అదనం. రుణాల చెల్లింపులకు కూడా జూన్ 30 వరకూ మూడు నెలల మారటోరియం ఇచ్చింది.
అమెరికా.. రూ.207 లక్షల కోట్లు
పే–చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్, ఆరోగ్య సంరక్షణ అభివృద్ధికి జీడీపీలో 2.3 శాతాన్ని (50 వేల కోట్ల డాలర్లు) ప్రకటించింది. మన కరెన్సీలో ఇది రూ.37.5 లక్షల కోట్లు. పే–చెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే... కంపెనీలు మూతబడే ప్రమాదాన్ని తప్పించడానికి అవి తమ ఉద్యోగులకిచ్చే జీతాల్లో 8 వారాల జీతాన్ని ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుంది. ఫిబ్రవరి నుంచి జూన్ 30 మధ్య ఏ సమయంలోనైనా ఈ 8 వారాల జీతం కోసం కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు.
► కరోనా వైరస్ ప్రభావం నుంచి ఉపశమనం పొందటానికి, జనానికి సాయం చేయడానికి. ఆర్థిక సహకారానికి ప్రభుత్వం ఏకంగా 2 లక్షల కోట్ల డాలర్ల (మన కరెన్సీలో 150 లక్షల కోట్లు) ప్యాకేజీని ఆమోదించింది.
► ఏప్రిల్ 2 నుంచి డిసెంబర్ 31 మధ్య కరోనా వైరస్ బారినపడి సెలవులు పెట్టుకున్నవారికి పెయిడ్ లీవ్ ఇచ్చేందుకు మరో 20.5 వేల కోట్ల డాలర్లు (రూ.15.35 లక్షల కోట్లు) కేటాయించింది.
► ఇదికాక ఫెడరల్ రిజర్వు బ్యాంకులకు తానిచ్చే సొమ్ముపై వసూలు చేసే వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చింది. ఇది ఏకంగా 1.5%తగ్గించడంతో ప్రస్తుతం వడ్డీ రేటు 0.25 శాతమే.
మనది 20.. అమెరికా 200!!
Published Thu, May 21 2020 1:45 AM | Last Updated on Thu, May 21 2020 8:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment