![COVID-19 Economic relief packages across the world - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/14/ISTOCK-1.jpg.webp?itok=I6E1KW-F)
ఇదొక సంక్షోభ సమయం. కంటికి కనిపించని శత్రువుతో పోరాడే సందర్భం. ప్రపంచ దేశాలన్నీ ఆరోగ్యంగా, ఆర్థికంగా ఛిన్నాభిన్నమైన విషాదం. వందల కోట్ల మంది పనులు మానేసి ఇంటి పట్టున కూర్చుంటే ఏ దేశం కూడా మనుగడ సాగించే పరిస్థితి లేదు. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడానికి అన్ని దేశాలు సహాయ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. భారత్ స్వావలంబనే ప్రధానంగా కోవిడ్ సహాయ ప్యాకేజీని ప్రకటిస్తే ఒక్కో దేశానిది ఒక్కో దారి.
కోవిడ్–19తో కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమివ్వడానికి కేంద్రంలోని మోదీ సర్కార్ ప్రకటించిన భారీ ప్యాకేజీ స్థూల జాతీయోత్పత్తిలో అత్యధికంగా ఖర్చు పెట్టిన జీ–20 దేశాల్లో అయిదో స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా సాయంలో చూసుకుంటే హాంకాంగ్‌తో కలిసి భారత్ 19వ స్థానాన్ని పంచుకుంది. 2008 ఆర్థిక మాంద్యం కంటే అధికంగా ప్రపంచదేశాలన్నీ అతలాకుతలమైపోవడంతో సహాయ ప్యాకేజీలే భవిష్యత్‌కి బాటలు వేసేలా రూపొందించాయి. హాంకాంగ్, కోస్తారికా, కెనడా వంటి దేశాలు ఉద్యోగాలు కోల్పోయిన వారికి నగదు రూపంలో సాయం చేశాయి. నెదర్లాండ్స్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగస్తుల 90 శాతం వరకు వేతనాలను ప్రభుత్వమే పరిస్థితి చక్కబడే వరకు చెల్లించేలా ప్యాకేజీ రూపొందిస్తే, ఫ్రాన్స్ ఉద్యోగుల గ్రాస్ వేతనంలో 84% చెల్లిస్తోంది.
అమెరికా
కరోనాతో దెబ్బతిన్న అమెరికా దేశ చరిత్రలోనే అతి పెద్ద ప్యాకేజీని ప్రకటించింది. రెండున్నర లక్షల కోట్లకుపైగా డాలర్లతో ఆర్థిక వ్యవస్థకి ఊపిరిలూదడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మూడు దశల్లో ఖర్చు పెట్టిన అమెరికా నాలుగో దశ విడుదలపై కసరత్తు చేస్తోంది. కరోనా ఎయిర్ రిలీఫ్ అండ్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజీ (కేర్స్) పేరుతో దీనికి అమెరికా సెనేట్ అంగీకరించింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, కోవిడ్ సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోయిన వారు, విద్యార్థుల ఉన్నత విద్యా రుణాలు మాఫీ, ఫుడ్ బ్యాంకులు, కోవిడ్‌పై పరిశోధనలు, వ్యాక్సిన్ అభివృద్ధి వంటి వాటిపై అమెరికా భారీగా నిధుల్ని భారీగా వెచ్చించింది.
యూకే
బ్రిటన్ స్వయం ఉపాధికే తన రిలీఫ్ ప్యాకేజీలో పెద్ద పీట వేసింది. సొంతంగా వ్యాపారాలు చేసే వారికి ఎక్కువ నిధులు కేటాయించి ఆదుకుంది. కోవిడ్ కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి స్వయం ఉపాధి కల్పించే పథకాలు ప్రవేశపెట్టింది. వ్యాపారాలు చేసే వారికి రుణాలు మంజూరు చేసింది. కోవిడ్ మళ్లీ విజృంభించే సంకేతాలు ఉండడంతో భవిష్య నిధికి కొంత కేటాయింపులు జరిపింది.
ఇటలీ
ఇటలీ తన ప్యాకేజీలో ఆరోగ్య రంగ ఉత్తేజంపైనే దృష్టి పెట్టింది. కంపెనీల్లో శుభ్రత, శానిటైజేషన్, ఉద్యోగులకు మాస్క్‌లు వంటివి కల్పించడం కోసం 50శాతం పన్నుల్లో మినహాయింపునిచ్చింది. చిన్నారుల సంక్షేమం, ప్రజలు కట్టాల్సిన పన్నుల మినహాయింపు వంటి చర్యలు తీసుకుంది.
కెనడా
కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్న కెనడా సహాయ ప్యాకేజీ కేటాయింపుల్లో ప్రశంసలందుకుంది. చిన్న తరహా పరిశ్రమలు నడిపే వారికి 75% అద్దె తగ్గింపు, చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు, విద్యార్థులు, సేవా రంగంలో ఉండేవారిని ఎక్కువగా ఆదుకుంది. అంతే కాకుండా స్వదేశీ ఉత్పత్తులకు ఊతమిచ్చేలా ప్యాకేజీని రూపొందించింది. ఇక ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఆ దేశం నెలకి 2 వేల కెనడా డాలర్ల చొప్పున నాలుగు నెలలు నిరుద్యోగ భృతి కింద ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment