
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల నగదు రహిత పథకం కింద వైద్య సేవలు పాక్షికంగా నిలిచిపోవడంతో ఆయా వర్గాలకు చెందిన రోగులు విలవిల్లాడుతున్నారు. ఈ నెల 20 నుంచి ఔట్‌పేషెంట్ (ఓపీ), వైద్య పరీక్షలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేరుకు ఓపీ, వైద్య పరీక్షలు నిలిపేశామని చెబుతున్నా ఇన్‌పేషెంట్ (ఐపీ) సేవలను కూడా అనేక ఆసుపత్రులు నిలిపేశాయి. వారం రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండటంతో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్) కింద రోజుకు సరాసరి 2 వేల మంది వరకు ఓపీ పేషెంట్లు రిజిస్టర్ అవుతుంటారు. ఆరోగ్యశ్రీ కింద దాదాపు 13 వేల మంది ఓపీ సేవలకు వస్తుంటారు. అంటే ఈ వారం రోజుల్లో దాదాపు లక్ష మందికి పైగా ఓపీ సేవల కోసం ప్రయత్నించారు. అందులో కొందరికి మాత్రం కొన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో, నిమ్స్‌లో వైద్యం అందింది. కానీ మరో 50 వేల మంది వరకు ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ పథకాల కింద ఎక్కడా వైద్య సేవలు అందలేదని ఆ శాఖ వర్గాలే అంచనా వేశాయి. దీంతో ఆయా రోగులంతా డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది.
అత్యవసర సేవలకూ బ్రేక్!
నెట్‌వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలను పాక్షికంగా నిలిపేయడంతో అనేకచోట్ల అత్యవసర సేవలనూ నిలిపేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన రమేశ్‌బాబు అనే వ్యక్తి తన సోదరికి డయాలసిస్ కోసం నిత్యం ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తుంటారు. కానీ ఆరోగ్యశ్రీ సేవలను నిలిపేయడంతో డయాలసిస్‌ను ఉచితంగా చేయడానికి ఆ ఆసుపత్రి నిరాకరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేన్సర్‌కు కీమోథెరపి వంటి చికిత్సలనూ అనేక ఆసుపత్రులు నిలిపేశాయి. కొన్ని రకాల అత్యవసర ఫాలోఅప్ వైద్య సేవలనూ అనేక ఆసుపత్రులు నిలిపేశాయి. దీంతో ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల కార్డులపైనే ఆధారపడిన బాధితులు ఘొల్లుమంటున్నారు.
రైతుబంధుకే ప్రాధాన్యం..
ఎన్నికల సమయం కావడంతో పేదలు, ఉద్యోగుల బాధను ఎవరూ పట్టించుకోవట్లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరీ విచిత్రమేంటంటే ఆరోగ్యశ్రీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సర్కారు ఆపద్ధర్మంలో ఉంటే అధికారులు నిర్లిప్తంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. నెట్‌వర్క్ ఆసుపత్రులు చెబుతున్నట్లు రూ.1,200 కోట్ల బకాయిలను చెల్లించడంలో సర్కారుకు అనేక పరిమితులున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు రైతుబంధు పథకానికి తప్ప వేటికీ నిధులు విడుదల చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. రైతుబంధుకు ఇప్పటివరకు రూ.3,700 కోట్లు అందజేసింది. పలు విడతలుగా సొమ్మును రైతుబంధు కింద రైతులకు పంపిణీ చేస్తుంది. దీంతో ఆరోగ్యశ్రీ సహా వేటికీ ప్రాధాన్యం ఇవ్వట్లేదు. అయితే ప్రభుత్వ ప్రాధాన్యం ఎలా ఉన్నా నెట్‌వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులను పిలిపించి వారితో చర్చించి ఎలాగైనా ఒప్పించడంలో వైద్యాధికారులు విఫలమయ్యారు. ‘సర్కారు డబ్బులు ఇవ్వట్లేదు. అందువల్ల మేం నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించట్లేదు. మేమేం చేయగలం’అంటూ వైద్యాధికారులు చేతులెత్తేస్తున్నారు.