ఆరోగ్యశ్రీ సేవలు మరింత మెరుగు | Further improvement In Aarogyasri Health Services In AP | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ సేవలు మరింత మెరుగు

Published Mon, Oct 19 2020 3:34 AM | Last Updated on Mon, Oct 19 2020 4:38 AM

Further improvement In Aarogyasri Health Services In AP - Sakshi

సాక్షి, అమరావతి: ప్రతి పేదవాడికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ సేవలకు రాష్ట్ర ప్రభుత్వం మరింత పదును పెంచుతోంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వేల సంఖ్యలో వ్యాధులను చేర్చడం, రూ.1,000 బిల్లు దాటితే ఆ జబ్బును పథకం కిందకు తెచ్చి భారీ సంస్కరణలకు సర్కార్‌ తెరతీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పేదలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా మరిన్ని కీలక సంస్కరణలను ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఇక నుంచి ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న అన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల పర్యవేక్షణ బాధ్యతలను ఆయా జిల్లాల జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించింది.

ప్రతి జేసీ వారానికి రెండు ఆస్పత్రులను తనిఖీ చేయడంతోపాటు సేవలు సరిగా లేకుంటే ఆయా ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని ఆస్పత్రుల్లోనూ చక్కటి వైద్యం అందించాలని, రోగులను గౌరవప్రదంగా చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అప్పులు చేసి వైద్యం చేయించుకుని.. ఆ నగదు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే విధానం మారాలని, ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కోసం పంపే దరఖాస్తుల సంఖ్యను భారీగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు నగదు రహిత వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లూ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. రోగులకు సకాలంలో సరైన వైద్యం అందించేలా.. ప్రతి నెట్‌వర్క్‌ ఆస్పత్రిపైనా నిఘా ఉంచేలా యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది. 

అన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు 
అన్ని ఆస్పత్రుల్లోనూ తప్పనిసరిగా ఆరోగ్యమిత్రలు ఉండాలి. ప్రతి రోగికీ సాయమందించే బాధ్యత వీరిదే. ప్రతి ఆరోగ్యమిత్ర ఫోన్‌ నంబర్‌ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 581 ఆరోగ్యమిత్ర ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని నిర్ణయించారు. డిశ్చార్జి అయ్యే రోగికి 108 ద్వారా ఉచిత రవాణా సదుపాయం ఆరోగ్యమిత్ర దగ్గరుండి కల్పించాలి. ఆరోగ్య ఆసరా కింద ఇచ్చే నగదు సాయాన్ని డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లో రోగి ఖాతాలో జమయ్యేలా ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సిబ్బంది చూడాలి. 

ఫిర్యాదులు రాకుండా.. 
ప్రతి పేదవాడికీ మరింత మెరుగైన, నాణ్యమైన వైద్యమందించాలనే తపనతో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారు. ఇప్పటికే ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని ఆరోగ్యశ్రీ పథకాన్ని ముందుకు నడిపిస్తున్నారు. రాష్ట్రంలో అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు వైద్యం అందలేదు అనే మాట లేకుండా మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం.  
–ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి 

ఒక్కో కోఆర్డినేటర్‌కు 35 నుంచి 40 ఆస్పత్రులు 
ప్రతి జాయింట్‌ కలెక్టర్‌ (జేసీ) వారానికి రెండు ఆస్పత్రులను తనిఖీ చేసి బాధితులకు నాణ్యమైన వైద్యం అందిందా? లేదా? చూస్తారు. ఏదైనా ఆస్పత్రి వైద్య సేవల్లో నిర్లక్ష్యం చూపితే జేసీ అధ్యక్షతన ఉండే క్రమశిక్షణా కమిటీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అలాగే కోఆర్డినేటర్ల సంఖ్యను కూడా పెంచుతారు. ఒక్కో కోఆర్డినేటర్‌ 35 నుంచి 40 ఆస్పత్రులను పర్యవేక్షిస్తారు. అర్హత ఉన్న అందరికీ నగదు రహిత వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవడంతోపాటు సీఎం సహాయ నిధి కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్యను తగ్గిస్తారు. ఏయే వ్యాధుల చికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు వస్తున్నాయో పరిశీలించి.. ఆ వ్యాధులకు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో చికిత్స అందేలా చర్యలు చేపడతారు. 

ఈ ఆరు ఉండాల్సిందే.. 
నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రధానంగా 6 విభాగాలపై దృష్టి సారించాలి.  
► ఆస్పత్రుల్లో కనీస మౌలిక వసతులు 
► నర్సు, డ్యూటీ డాక్టర్, స్పెషలిస్టులతో కూడిన నిపుణులు
► నాణ్యమైన మందులు 
► రోజూ చక్కటి పారిశుధ్య నిర్వహణ  
► రోగులకు రోజూ పౌష్టికాహారం  
► ప్రతి ఆస్పత్రిలో ఆరోగ్యమిత్రతో కూడిన హెల్ప్‌డెస్క్‌ ఇవి లేని ఆస్పత్రులను జాబితా నుంచి తొలగిస్తారు. 

నాణ్యతను బట్టి ఆస్పత్రులకు రేటింగ్‌ 
ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలో నెట్‌వర్క్‌ ఆస్పత్రుల జాబితా సిద్ధంగా ఉంటుంది. ఏ ఆస్పత్రిలో సేవలు అందుతాయి? ఎక్కడకు వెళ్లాలి? వంటి సందేహాలను సచివాలయాలు తీరుస్తాయి. ఆరోగ్యశ్రీ సేవలపై అందరికీ అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు లేనివారికి తక్షణమే అందిస్తాయి. ప్రతి ఆస్పత్రికీ అవి అందిస్తున్న వైద్య సేవల్లో నాణ్యతను బట్టి మార్కులు ఉంటాయి. ఏ, ఏ ప్లస్, బీ కేటగిరీలుగా వీటిని విభజిస్తారు. ఈ 3 విభాగాల్లో లేని ఆస్పత్రులు 18 నెలల్లోగా తమ లోపాలు సరిదిద్దుకోవాలి.  

రేటింగ్‌ ఇలా.. 
► ఆస్పత్రిలో ఉన్న ఆరోగ్యమిత్ర రోజూ నాణ్యతపై ఇచ్చే నివేదికకు 25 మార్కులు
► డిశ్చార్జ్‌ సమయంలో రోగి అభిప్రాయాలకు 50 మార్కులు . 
► రోజూ ఐవీఆర్‌ఎస్‌ సిస్టమ్‌ ద్వారా రోగుల నుంచి తీసుకునే అభిప్రాయాలకు 25 మార్కులు 
వీటిలో మార్కులు తగ్గితే ఆ ఆస్పత్రులపై చర్యలుంటాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement