సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో రాష్ట్ర వైద్య శాఖకు ఐదు అవార్డులు లభించాయి. రాష్ట్ర ప్రజలకు పేపర్ రహిత వైద్య సేవలు వేగంగా చేరువ చేస్తూ, ఉత్తమ పని తీరు కనబరుస్తున్నందుకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మూడు విభాగాల్లో ఈ అవార్డులను ప్రకటించింది. పేపర్ రహిత వైద్య సేవల్లో భాగంగా ప్రతి వ్యక్తికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్‌లు సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 5.4 కోట్ల మందికి హెల్త్ ఐడీలను ఇచ్చారు. ఇందులో 3.79 కోట్ల మంది హెల్త్ ఐడీలకు వారి ఆరోగ్య రికార్డులను అనుసంధానించారు.
ఇలా డిజిటల్ హెల్త్ ఐడీలకు ఆరోగ్య రికార్డులను అనుసంధానించిన రాష్ట్రాల విభాగంలో ఏపీ ప్రథమ స్థానం పొందింది. జిల్లాల విభాగంలో దేశంలోనే తొలి మూడు అవార్డులూ వరుసగా ఏలూరు, విశాఖపట్నం, పల్నాడు జిల్లాలకొచ్చాయి. ఇంటిగ్రేటెడ్ విధానంలో హెల్త్ ఐడీలకు ఆరోగ్య రికార్డులు అనుసంధానించిన విభాగంలోనూ రాష్ట్రానికి మొదటి స్థానం లభించింది.
గతేడాది అక్టోబర్ 20 నుంచి డిసెంబర్ 10 మధ్య కనబరిచిన ఉత్తమ ప్రతిభకు ఈ అవార్డులిచ్చారు. అంతకు ముందు రెండు నెలల్లో పనితీరుకు ప్రకటించిన అవార్డుల్లోనూ ఏపీకి జాతీయ స్థాయిలో ఆరు లభించాయి. ఈ లెక్కన నాలుగు నెలల్లో రాష్ట్ర వైద్య శాఖకు జాతీయ స్థాయిలో 11 అవార్డులు వచ్చాయి.
ప్రజల ప్రాథమిక ఆరోగ్య వివరాలు నిక్షిప్తం
వైఎస్ జగన్ సీఎం అయిన నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పేపర్ రహిత వైద్య సేవల్లోనూ వేగంగా చర్యలు చేపడుతోంది. 2021 అక్టోబర్‌లో రాష్ట్ర వైద్య శాఖ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్–కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్‌సీడీ–సీడీ) 2.0ను ప్రారంభించింది. ఏఎన్‌ఎం, ఆశ వర్కర్లు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలకు డిజిటల్ హెల్త్ ఐడీలను సృష్టించడంతో పాటు, స్క్రీనింగ్ నిర్వహించి ప్రాథమిక ఆరోగ్య వివరాలను హెల్త్ ఐడీల్లో నిక్షిప్తం చేశారు.
ఇలా ఇప్పటివరకు 5.4 కోట్ల మందికి హెల్త్ ఐడీలను సృష్టించారు. మరోవైపు 14,505 ప్రభుత్వాస్పత్రులు, 21,200 మంది వైద్యులు, ఇతర సిబ్బందిని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌లో రిజిస్టర్ చేశారు. ఇది సంఖ్యాపరంగా, జనాభా శాతం పరంగా కూడా దేశంలోనే అత్యధికం.
► పేపర్ రహిత వైద్య సేవల్లో ఉత్తమ పనితీరుకు కేంద్ర పురస్కారాలు
► హెల్త్ ఐడీలకు ఆరోగ్య రికార్డుల అనుసంధానంలో రాష్ట్రానికి ప్రథమ స్థానం
► జిల్లాల విభాగంలోనూ తొలి మూడూ మన రాష్ట్రానికే
► ఏలూరు, విశాఖ, పల్నాడు జిల్లాలకు అవార్డులు
► ఇంటిగ్రేటెడ్ విధానంలోనూ రాష్ట్రానిదే అగ్రస్థానం
Comments
Please login to add a commentAdd a comment