
సాక్షి, అమరావతి: డీఎంఈ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, వైద్య విధాన పరిషత్‌లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్)ల ప్రొబేషన్ కాలాన్ని రెండేళ్లకు ప్రభుత్వం తగ్గించింది. కొద్దికాలంగా వైద్యులు, వైద్య సంఘాల వినతులను, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌లు, సీఏఎస్‌లకు ప్రొబేషన్ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. మరోవైపు ప్రజారోగ్య విభాగంలోని సీఏఎస్‌లకు కన్సాలిడేటెడ్ వేతనాన్ని రూ.53,500 నుంచి రూ.85వేలకు పెంచింది. జీవో నంబర్లు 60, 61 ప్రకారం 2020లో, జీవో నంబర్ 615 ప్రకారం 2021లో ఎంపికైన వైద్యులందరికీ పెంచిన కన్సాలిడేటెడ్ వేతనాన్ని వర్తింపజేస్తుంది.
వైద్య విధాన పరిషత్ పరిధిలో సీఏఎస్ (ఫస్ట్ లెవల్ గెజిటెడ్) క్యాడర్ వారికి సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లకు అనుమతి తెలిపింది. సొంత మండలం, డివిజన్‌లో కాకుండా జిల్లాలో ఎక్కడైనా వీరికి పోస్టింగ్ ఇస్తారు. అడిషనల్ డీఎంహెచ్‌వో, డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్ వంటి పరిపాలన పోస్టింగ్‌లలో మాత్రం సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లను అనుమతించరు. ఈ మేరకు వైద్యశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment