Probation period
-
వైద్యుల ప్రొబేషన్ రెండేళ్లు
సాక్షి, అమరావతి: డీఎంఈ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, వైద్య విధాన పరిషత్‌లోని సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్)ల ప్రొబేషన్ కాలాన్ని రెండేళ్లకు ప్రభుత్వం తగ్గించింది. కొద్దికాలంగా వైద్యులు, వైద్య సంఘాల వినతులను, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీఏఎస్‌లకు ప్రొబేషన్ కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. మరోవైపు ప్రజారోగ్య విభాగంలోని సీఏఎస్‌లకు కన్సాలిడేటెడ్ వేతనాన్ని రూ.53,500 నుంచి రూ.85వేలకు పెంచింది. జీవో నంబర్లు 60, 61 ప్రకారం 2020లో, జీవో నంబర్ 615 ప్రకారం 2021లో ఎంపికైన వైద్యులందరికీ పెంచిన కన్సాలిడేటెడ్ వేతనాన్ని వర్తింపజేస్తుంది. వైద్య విధాన పరిషత్ పరిధిలో సీఏఎస్ (ఫస్ట్ లెవల్ గెజిటెడ్) క్యాడర్ వారికి సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లకు అనుమతి తెలిపింది. సొంత మండలం, డివిజన్లో కాకుండా జిల్లాలో ఎక్కడైనా వీరికి పోస్టింగ్ ఇస్తారు. అడిషనల్ డీఎంహెచ్‌వో, డీఎంహెచ్‌వో, డీసీహెచ్ఎస్ వంటి పరిపాలన పోస్టింగ్‌లలో మాత్రం సొంత జిల్లాల్లో పోస్టింగ్‌లను అనుమతించరు. ఈ మేరకు వైద్యశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. -
త్వరలోనే సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్
నెల్లూరు (అర్బన్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ఇష్టంతో ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు త్వరితగతిన ప్రొబేషన్ పీరియడ్‌ను డిక్లేర్ చేసి పీఆర్సీ అమలు చేయనున్నారని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. నెల్లూరులో పలువురు సచివాలయ ఉద్యోగులు మంగళవారం విధులు బహిష్కరించి, తమకు ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలంటూ స్థానిక కలెక్టరేట్లో అజయ్‌జైన్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యపాలన తీసుకుని రావడంలో భాగంగా రాష్ట్రంలో ఒకే దఫా 1.20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. వారికి ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేసేందుకు లెక్కలు తీసుకుంటున్నామన్నారు. డిపార్ట్మెంట్ పరీక్ష పాసయిన ప్రతి ఒక్కరికి ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారని చెప్పారు. ఎక్కువ శాఖల నుంచి వివరాలు సేకరించాల్సి ఉన్నందున కాస్త ఆలస్యం అయిందన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారులు జూన్‌నాటికి డిక్లేర్ చేస్తామని తెలపగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇంకా ముందుగా వీలైనంత త్వరగా ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేయాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. అధికారులు అదే ప్రయత్నంలో ఉన్నారన్నారు. సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడంలో తప్పులేదని, విధులు బహిష్కరించి రోడ్డెక్కడం మంచిపద్ధతి కాదని చెప్పారు. ఎవరో రెచ్చగొడితే ఇలా రోడ్డెక్కితే అంతిమంగా సచివాలయ ఉద్యోగులకే నష్టం జరుగుతుందన్నారు. ఇకనైనా విధులకు హాజరై ప్రజలకు మంచిగా సేవలందించాలని కోరారు. సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం వందశాతం న్యాయం చేస్తుందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన చెప్పారు. -
అవినీతిలో యువ ఎస్ఐల స్పీడ్
► దూకుడు ► విధుల్లో బాధ్యతా రాహిత్యం ► కేసుల నమోదులో ఏకపక్షం ► ప్రోబేషన్ పీరియడ్‌లోనే లెక్కలేనన్ని ఆరోపణలు ► వారం రోజుల క్రితం తలంటిన ఆదోని డీఎస్పీ ► ఇప్పటికే పలువురు వీఆర్‌కు.. ఒంటిపైకి ఖాకీ చొక్కా వస్తే చాలు.. ఆ కిక్కే వేరు. ఇక భుజానికి రెండు స్టార్లు ఉంటే.. అబ్బో చెప్పక్కర్లేదు. భూమ్మీద కాళ్లు నిలవమన్నా నిలవ్వు. సినిమాల ప్రభావమో.. సీనియర్ల అడుగుజాడల్లో నడుద్దామనో.. కొత్త ఎస్ఐలు కొందరు దూకుడు మీదున్నారు. సమాజ సేవ చేయడం అటుంచితే.. అత్యాశ, ఆవేశం, అనుభవ లేమి వీరి పెడదోవకు కారణమవుతోంది. కర్నూలు: జిల్లాలోని వివిధ పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న 2013వ బ్యాచ్‌కు చెందిన సుమారు 54 మంది ఎస్ఐలు అప్పుడే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేసుల నమోదు సమయంలో ఏదో ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఉద్యోగాలకే ముప్పు తెచ్చుకుంటున్నారు. ప్రొబేషన్ పూర్తి కాకముందే కొందరు ఎస్ఐల తీరు వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే పలు ఆరోపణలతో పది మందికి పైగా ఎస్ఐలు వీఆర్‌కు రావడం చూస్తే వీరి దూకుడు అర్థమవుతోంది. ఫిర్యాదుదారుల నుంచి డబ్బు డిమాండ్ చేయడం.. వివాదాలు.. సెటిల్మెంట్లు..స్థలాల విషయాల్లో స్టేషన్లోనే సివిల్ పంచాయితీలు చేయడం కొందరికి రివాజుగా మారింది. క్రైం రేటు ఎక్కువగా ఉండే స్టేషన్లలో అధికారులకు కాసుల వర్షం కురుస్తోంది. వారం రోజుల క్రితం ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని కొందరు యువ ఎస్ఐలను డీఎస్పీ శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో హెచ్చరించడం చూస్తే వీరి పనితీరు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. రాజీ పడరనుకుంటే..యువకులు, ఉత్సాహవంతులు శాంతిభద్రతల విషయంలో రాజీ పడకుండా పనిచేస్తారని భావించిన ఉన్నతాధికారులకు నిరాశే మిగులుతోంది. ప్రొబేషన్ పీరియడ్ పూర్తి కాకుండానే పలువురు ఎస్ఐలు ఆరోపణలపై శాఖాపరమైన చర్యలకు గురయ్యారు. గత ఎన్నికల సమయంలో నేతలకు అనుకూలంగా పనిచేయడంతో పాటు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే దారులు వెతుకున్నారని తెలుస్తోంది. తమ పరిధిలో కాకపోయినా పక్క మండలాలకు వెళ్లి పంచాయతీలకు యత్నించి గతంలో ఇద్దరు యువ ఎస్ఐలు చిక్కుల్లో పడ్డారు. పైరవీకారులు స్టేషన్‌కు వెళ్తే సీటులో నుంచి లేచి మరీ స్వాగతిస్తున్నట్లు ఘటనలు జిల్లాలో కోకొల్లలు. తింటే తప్పేంటి? 30 ఏళ్లకు పైగా బంగారు భవిష్యత్తు ఉందనే విషయం మర్చిపోయి ఏడాదో.. రెండేళ్లో అన్నట్లుగా హడావుడి చేస్తున్నారు కొందరు యువ ఎస్ఐలు. తింటే తప్పేంటి..? అనే జాడ్యం వీరిలో కనిపిస్తోంది. శిక్షణ కాలంతో కలిపి ఎస్ఐలకు రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత సబ్ డివిజన్ అధికారి ఇచ్చే పనితీరు నివేదిక ఆధారంగా ఎస్పీ వీరి ప్రొబేషన్ పీరియడ్‌ను డిక్లేర్ చేస్తారు. ఈలోగా మాండేటరీ కోర్సులు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం జిల్లాలో పని చేస్తున్న ఎస్ఐలు ఎవరు కూడా మాండేటరీ కోర్సులు పూర్తి చేయకుండానే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండటం గమనార్హం. గతంలో ఉలిందకొండ, ఓర్వకల్లు ఎస్‌ఐలపైనా అవినీతి ఆరోపణలతో బదిలీ వేటు పడటం తెలిసిందే. చర్యలు తీసుకుంటున్నా.. షరా మామూలే.. పారదర్శక పాలన, ప్రజామిత్ర పోలీసింగ్‌తో ప్రజలకు దగ్గరయ్యేందుకు జిల్లా పోలీసు బాస్ ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అవినీతి మరకలు, ఆరోపణలు పోలీసు శాఖ పరువు బజారునపడుతోంది. శాంతి భద్రతలు, ట్రాఫిక్ అనే తేడా లేకుండా కొందరు అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అవినీతికి దూరంగా ఉండాలని గట్టిగా హెచ్చరిస్తూ.. అక్రమార్కుల ఆట కట్టించేందుకు డీఐజీ స్థాయిలో పట్టు బిగిస్తున్నా క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధి లోపిస్తోంది. పోలీసులంటే.. వాళ్లు ప్రస్తుతం జిల్లాలో పనిచేస్తున్న పలువురు సీనియర్ పోలీసు అధికారులు ఁకొత్తగా* విధుల్లో చేరినప్పుడు తమ పనితీరుతో ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కొందరు పోలీసు అధికారుల పేరు చెబితే అక్రమార్కులకు ఇప్పటికీ వణుకే. సిఫారసు చేయడానికి స్టేషన్‌కు వెళ్లాలంటే కూడా ఆలోచించే పరిస్థితి. కొన్ని తరహా నేరాల్లో రాజీ పడకపోవడం వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఒకరిద్దరిని పక్కనపెడితే.. పరిస్థితి భిన్నంగా ఉంది. కొన్ని ఉదాహరణలు ► నందవరం ఎస్ఐ వేణుగోపాల్ రాజు భారీగా అవినీతికి పాల్పడినట్లు ఆదోని డీఎస్పీ శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ► గత నెలలో జొన్నిగిరి ఎస్ఐని కూడా వివిధ ఆరోపణలతో శ్రీశైలం బందోబస్తు విధుల్లో ఉండగానే వీఆర్‌కు రప్పించారు. మరో ఐదుగురు యువ ఎస్‌ఐలపైనా విచారణ జరుగుతోంది. ► ఓ యువతి కిడ్నాప్ కేసులో భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసి విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో జిల్లా సరిహద్దు స్టేషన్లో పని చేస్తున్న ఓ యువ ఎస్ఐ శాఖాపరమైన చర్యలకు లోనయ్యాడు. ► వివిధ ఆరోపణలో చార్జిమెమోలు అందుకున్న ఎస్ఐల సంఖ్య కూడా అధికంగానే ఉంది. -
బక్కచిక్కిన భద్రత
ప్రజా ప్రతి నిధులకు బందోబస్తు సగానికి కుదింపు ఎస్ఆర్సీ నిర్ణయంలో భాగంగా గన్మెన్ల తగ్గింపు జిల్లాలో ముగ్గురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలకు ఇద్దరే అంగరక్షకులు ఆ ఇద్దరూ తనకక్కర్లేదని తిప్పి పంపిన గౌతు శివాజీ గన్‌మెన్‌గా సీనియర్లను తప్పించి జూనియర్ల నియామకం ప్రొబేషన్ పిరియడ్ దాటకుండానే కీలక బాధ్యతలు శ్రీకాకుళం క్రైం:ప్రజాప్రతినిధులు, నాయకుల భద్రత కోసం గన్మెన్లను ప్రభుత్వం నియమిస్తుంటుంది. అయితే కాలక్రమంలో అది భద్రతాంశంగా కాకుండా.. హోదాకు చిహ్నంగా మారిపోయింది. చోటామోటా నేతలు కూడా వీలైతే ప్రభుత్వ ఖర్చుతో.. లేకుంటే సొంత ఖర్చుతోనైనా గన్‌మెన్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఉబలాటపడుతుంటారు. ఇప్పుడా హోదా బక్కచిక్కిపోనుం ది. గన్‌మెన్‌ను తగ్గించాలని ఉన్నతాధికారులు నిర్ణయించడమే దీనికి కారణం. సెక్యూరిటీ రివ్యూ కమిటీ(ఎస్ఆర్సీ)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా జిల్లాలో ముగ్గురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేల సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య సగానికి తగ్గిపోయింది. జిల్లాలో ఒక మంత్రి, ఒక ఎంపీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు మాజీ మంత్రులు, ఒక ఎస్పీ, ముగు ్గరు డీఎస్పీలు ఉన్నారు. వీరందరికి ప్రభుత్వమే గన్మెన్లతో బందోబస్తు కల్పిస్తోంది. మావోయిస్టులు, ఉద్యమకారులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను రక్షించడమే గన్మెన్ల ప్రధాన బాధ్యత. ఎవరికి ఎంత భద్రతంటే.. ఇటీవల జరిగిన సెక్యూరిటీ రివ్యూ కమిటీ(ఎస్.ఆర్.సి) సమావేశంలో తీసుకున్న నిర్ణయం హోదా కోసం నియమించుకున్నవారి మాటెలా ఉన్నా.. వాస్తవంగా భద్రత అవసరమైన నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రతిప్రతినిధుల వెంట ఉండే గన్మెన్ల సంఖ్యను కుదించడంతోపాటు మాజీ మంత్రులకు పూర్తిగా గన్మెన్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు మంత్రికి జిల్లా నుంచి ఆరుగురు గన్మెన్లు, ఐ.ఎస్.డబ్ల్యు నుంచి ఇద్దరు గన్మెన్లు.. మొత్తం ఎనిమిది మంది ఉండేవారు. వీరు రోజుకు నలుగురు చొప్పున విధులు నిర్వర్తించేవారు. ఇప్పుడు వీరిలో ఇద్దరిని తొలగించారు. అంటే రోజుకు ముగ్గురు మాత్రమే మంత్రి వెంట భద్రతా విధుల్లో ఉంటారు. ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు నలుగురు గన్మెన్లు ఉండేవారు. వీరిలో రోజుకు ఇద్దరు చొప్పున విధులు నిర్వహించేవారు. ఇప్పుడు ఇద్దర్ని తొలగించారు. దాంతో రోజుకు ఒక్క గన్‌మెన్ మాత్రమే ఎమ్మెల్యే వెంట ఉంటున్నారు. జిల్లా పాలకొండ, పాతపట్నం, నరసన్నపేట ఎమ్మెల్యేలకు మాత్రమే మావోయిస్టు ప్రాంతాల ఎమ్మెల్యేలన్న కారణంతో గతంలో ఉన్న భద్రతనే కొనసాగిస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేల భద్రతను సగానికి కుదించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ దీన్ని వ్యతిరేకించారు. తనకు ఇద్దరు సరిపోరని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు నివేదించారు. అయితే ఉన్నతస్థాయి నిర్ణయం ప్రకారం అదనపు గన్మెన్లను కేటాయించలేమని పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పడంతో ఉన్న ఇద్దరు గన్మెన్లు కూడా తనకు అక్కర్లేదంటూ వెనక్కి పంపేశారు. దాంతో ఆయన వెంట ఒక్క గన్‌మెన్ కూడా లేకుండాపోయారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు పూర్తిగా గన్మెన్నే లేకుండా చేశారు. ఆయన మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నా పూర్తిగా భద్రత తొలగించడంతో ఆయన అనుయాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జూనియర్లకు విధులు ఒకవైపు సిబ్బంది తగ్గింపు.. మరోవైపు సీనియర్లను కాకుండా జూనియర్లను గన్మెన్లుగా పంపిస్తుండటంతో నేతలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజాప్రతినిధులు, వీఐపీల భద్రతకు మంచి అనుభవం, నైపుణ్యమున్న సీనియర్ గన్మెన్లను నియమించడం సహజం. కానీ ఈసారి జూనియర్లకు ప్రాధాన్యమిచ్చారు. ప్రజాప్రతినిధుల వద్ద ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ గన్మెన్లను తొలగించి వారి స్థానంలో జూనియర్లను నియమించారు. ఇటువంటి వారిలో రెండేళ్ల ప్రొబేషన్ పిరియడ్ కూడా పూర్తి కానివారు ఉన్నారని తెలిసింది. తమకు సీనియర్లే కావాలని కొందరు ప్రజాప్రతినిధులు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం.