బక్కచిక్కిన భద్రత | Each public funds Security Gunman reduction | Sakshi
Sakshi News home page

బక్కచిక్కిన భద్రత

Published Sun, Aug 31 2014 2:43 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

బక్కచిక్కిన భద్రత - Sakshi

బక్కచిక్కిన భద్రత

  ప్రజా ప్రతి నిధులకు బందోబస్తు సగానికి కుదింపు
  ఎస్‌ఆర్‌సీ నిర్ణయంలో భాగంగా గన్‌మెన్ల తగ్గింపు
  జిల్లాలో ముగ్గురు మినహా మిగిలిన ఎమ్మెల్యేలకు ఇద్దరే అంగరక్షకులు
  ఆ ఇద్దరూ తనకక్కర్లేదని తిప్పి పంపిన గౌతు శివాజీ
  గన్‌మెన్‌గా సీనియర్లను తప్పించి జూనియర్ల నియామకం
  ప్రొబేషన్ పిరియడ్ దాటకుండానే కీలక బాధ్యతలు
 
 శ్రీకాకుళం క్రైం:ప్రజాప్రతినిధులు, నాయకుల భద్రత కోసం గన్‌మెన్లను ప్రభుత్వం నియమిస్తుంటుంది. అయితే కాలక్రమంలో అది భద్రతాంశంగా కాకుండా.. హోదాకు చిహ్నంగా మారిపోయింది. చోటామోటా నేతలు కూడా వీలైతే ప్రభుత్వ ఖర్చుతో.. లేకుంటే సొంత ఖర్చుతోనైనా గన్‌మెన్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఉబలాటపడుతుంటారు. ఇప్పుడా హోదా బక్కచిక్కిపోనుం ది. గన్‌మెన్‌ను తగ్గించాలని ఉన్నతాధికారులు నిర్ణయించడమే దీనికి కారణం. సెక్యూరిటీ రివ్యూ కమిటీ(ఎస్‌ఆర్‌సీ)లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా జిల్లాలో ముగ్గురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేల సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య సగానికి తగ్గిపోయింది. జిల్లాలో ఒక మంత్రి, ఒక ఎంపీ, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీతో పాటు మాజీ మంత్రులు, ఒక ఎస్పీ, ముగు ్గరు డీఎస్పీలు ఉన్నారు. వీరందరికి ప్రభుత్వమే గన్‌మెన్లతో బందోబస్తు కల్పిస్తోంది. మావోయిస్టులు, ఉద్యమకారులు, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను రక్షించడమే గన్‌మెన్ల ప్రధాన బాధ్యత.
 
 ఎవరికి ఎంత భద్రతంటే..
 ఇటీవల జరిగిన సెక్యూరిటీ రివ్యూ కమిటీ(ఎస్.ఆర్.సి) సమావేశంలో తీసుకున్న నిర్ణయం హోదా కోసం నియమించుకున్నవారి మాటెలా ఉన్నా.. వాస్తవంగా భద్రత అవసరమైన నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ప్రతిప్రతినిధుల వెంట ఉండే గన్‌మెన్ల సంఖ్యను కుదించడంతోపాటు మాజీ మంత్రులకు పూర్తిగా గన్‌మెన్లను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.
 
  ఇప్పటివరకు మంత్రికి జిల్లా నుంచి ఆరుగురు గన్‌మెన్లు, ఐ.ఎస్.డబ్ల్యు నుంచి ఇద్దరు గన్‌మెన్లు.. మొత్తం ఎనిమిది మంది ఉండేవారు. వీరు రోజుకు నలుగురు చొప్పున విధులు నిర్వర్తించేవారు. ఇప్పుడు వీరిలో ఇద్దరిని తొలగించారు. అంటే రోజుకు ముగ్గురు మాత్రమే మంత్రి వెంట భద్రతా విధుల్లో ఉంటారు.
  ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు నలుగురు గన్‌మెన్లు ఉండేవారు. వీరిలో రోజుకు ఇద్దరు చొప్పున విధులు నిర్వహించేవారు. ఇప్పుడు ఇద్దర్ని తొలగించారు. దాంతో రోజుకు ఒక్క గన్‌మెన్ మాత్రమే ఎమ్మెల్యే వెంట ఉంటున్నారు.
 
  జిల్లా పాలకొండ, పాతపట్నం, నరసన్నపేట ఎమ్మెల్యేలకు మాత్రమే మావోయిస్టు ప్రాంతాల ఎమ్మెల్యేలన్న కారణంతో గతంలో ఉన్న భద్రతనే కొనసాగిస్తున్నారు. మిగతా ఎమ్మెల్యేల భద్రతను సగానికి కుదించారు.
 
  పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీ దీన్ని వ్యతిరేకించారు. తనకు ఇద్దరు సరిపోరని ఆయన పోలీసు ఉన్నతాధికారులకు నివేదించారు. అయితే ఉన్నతస్థాయి నిర్ణయం ప్రకారం అదనపు గన్‌మెన్లను కేటాయించలేమని పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పడంతో ఉన్న ఇద్దరు గన్‌మెన్లు కూడా తనకు అక్కర్లేదంటూ వెనక్కి పంపేశారు. దాంతో ఆయన వెంట ఒక్క గన్‌మెన్ కూడా లేకుండాపోయారు.
 
  మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు పూర్తిగా గన్‌మెన్నే లేకుండా చేశారు. ఆయన మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నా పూర్తిగా భద్రత తొలగించడంతో ఆయన అనుయాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 జూనియర్లకు విధులు
 ఒకవైపు సిబ్బంది తగ్గింపు.. మరోవైపు సీనియర్లను కాకుండా జూనియర్లను గన్‌మెన్లుగా పంపిస్తుండటంతో నేతలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రజాప్రతినిధులు, వీఐపీల భద్రతకు మంచి అనుభవం, నైపుణ్యమున్న సీనియర్ గన్‌మెన్లను నియమించడం సహజం. కానీ ఈసారి జూనియర్లకు ప్రాధాన్యమిచ్చారు. ప్రజాప్రతినిధుల వద్ద ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ గన్‌మెన్లను తొలగించి వారి స్థానంలో జూనియర్లను నియమించారు. ఇటువంటి వారిలో రెండేళ్ల ప్రొబేషన్ పిరియడ్ కూడా పూర్తి కానివారు ఉన్నారని తెలిసింది. తమకు సీనియర్లే కావాలని కొందరు ప్రజాప్రతినిధులు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను కోరినట్లు సమాచారం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement