టీఆర్‌ఎస్‌ జయకేతనం | TRS Win With high Majority In Nizamabad | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 12 2018 10:12 AM | Last Updated on Wed, Dec 12 2018 10:12 AM

TRS Win With high Majority In Nizamabad - Sakshi

ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. మొత్తం తొమ్మిది స్థానాల్లో ఎనిమిది టీఆర్‌ఎస్‌ కైవసం కాగా, ఒక్క ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ కేవలం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై వ్యతిరేకతతోనే ఓటమి చెందినట్లు తెలుస్తోంది. బీజేపీ ఈ ఎన్నికల్లో ఖాతానే తెరవలేకపోయింది. బాన్సువాడ నుంచి బరిలోకి దిగిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. జుక్కల్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హన్మంత్‌ షిండే జిల్లాలో భారీ మెజారిటీ సాధించారు. కామారెడ్డి నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంపగోవర్ధన్‌ మండలి కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీపై అతితక్కువ మెజారిటీతో గెలుపొందారు.  

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : గులాబీ గుబాళించింది. టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగింది. నువ్వా.. నేనా.. అన్న రీతిలో కొనసాగిన పోరులో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్‌ అభ్యర్థులను మట్టి కరిపించారు. 2014 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాను క్లీన్‌స్వీప్‌ చేసిన టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో కూడా దాదాపు అదే ఫలితాలు పునరావృతమయ్యాయి. ఎనిమిది చోట్ల పరాజయం పాలైన కాంగ్రెస్‌ ఒక్క ఎల్లారెడ్డి స్థానంతో సరిపెట్టుకోగలిగింది. బాల్కొండలో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది. బీజేపీ ఈ ఎన్నికల్లో జిల్లాలో ఖాతానే తెరవలేకపోయింది. దాదాపు ఎనిమిది చోట్ల ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. బాల్కొండలో బీ ఎస్పీ కొంత పోటీని ఇవ్వగలిగింది. ఉమ్మడి జిల్లా వాసులు ఈ ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి పట్టం గట్టారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా ముం దుకెళుతున్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు తిరుగులేని విజయాన్ని అందించారు. గులాబీ పార్టీకి ఇందూ రు కంచుకోట అని మరోమారు రుజువైంది. 

మంత్రి పోచారం నాలుగోసారి.. 
బాన్సువాడ నుంచి బరిలోకి దిగిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కాసుల బాల్‌రాజ్‌పై భారీ మెజారిటీతో గెలుపొందారు. బాల్కొండలో మిషన్‌భగీరథ మాజీ వైస్‌ చైర్మన్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన ముత్యాల సునీల్‌రెడ్డి రెండో స్థానంలో నిలువగలిగారు. ఆర్మూర్‌లో విజయం సాధించిన ఆశన్నగారి జీవన్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన ఎమ్మెల్సీ ఆకుల లలిత రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి, డీసీసీ మాజీ అధ్యక్షులు తాహెర్‌బిన్‌ హందాన్‌పై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిగాల గణేష్‌గుప్త జయకేతనం ఎగురవేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మినారాయణ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. నిజామాబాద్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎమ్మెల్సీ డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విజయం సాధించారు. జుక్కల్‌ (ఎస్సీ) నియోజకవర్గంలో కూడా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హన్మంత్‌షిండే కాంగ్రెస్‌ అభ్యర్థి సౌదాగర్‌ గంగారాంపై గెలుపొందారు.

 ఎల్లారెడ్డిలో కాంగ్రెస్‌ విజయం.. 
ఉమ్మడి జిల్లా పరిధిలో కాంగ్రెస్‌పార్టీ ఒక్క ఎల్లారెడ్డి స్థానంలో సరిపెట్టుకుంది. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి జాజాల సురేందర్‌ ఘన విజయం సాధించారు. ఎల్లారెడ్డిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత.., సురేందర్‌పై సానుభూతి కాంగ్రెస్‌ విజయానికి దోహదం చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

పరాజయం పాలైన అగ్రనేతలు.. 
జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలకు సైతం ఈ ఎన్నికల్లో పరాభవం తప్పలేదు. శాసన మండలిలో కాంగ్రెస్‌ పక్ష నేతగా ఉన్న ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ కామారెడ్డిలో పరాజయం పాలయ్యారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌ హ్యాట్రిక్‌ విజయం సాధించారు. బోధన్‌లో మాజీ మంత్రి పి సుదర్శన్‌రెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. టీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన షకీల్‌ అమేర్‌ గెలుపొందారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ ప్రచార సభలు కామారెడ్డి, ఆర్మూర్‌లలో నిర్వహించారు. ఈ స్థానాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు.  

కమల దళానికి డిపాజిట్లు గల్లంతు.. 
కమల దళం జిల్లాలో ఖాతా తెరవలేదు. జిల్లాలో ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయిన బీజేపీ బాల్కొండ, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి వంటి స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలయ్యారు. ఈ స్థానాల్లో వారికి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. కాస్త పట్టున్న నిజామాబాద్‌ అర్బన్‌లో కూడా మూడో స్థానంతో సరిపెట్టుకోగలిగారు. జిల్లాలో ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్రమోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా వంటి అగ్రనేతల ప్రచార సభలు నిర్వహించినా కనీసం ఫలితం లేకుండా పోయింది. పలువురు కేంద్ర మంత్రులు, ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్, జుక్కల్‌లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడనవీస్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌సింగ్‌ తదితరులు కూడా ప్రచార సభలు కొనసాగినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

బాల్కొండలో రెండో స్థానంలో బీఎస్పీ.. 
బాల్కొండ స్థానంలో బీఎస్పీ నుంచి బరిలోకి దిగిన ముత్యాల సునీల్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. గతంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో కొనసాగిన సునీల్‌రెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించారు. కానీ ఈ స్థానం నుంచి ఈరవత్రి బరిలోకి దిగడంతో ఆ యన బీఎస్పీ నుంచి పోటీ చేసిన విషయం విదితమే. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఈరవత్రి అనీల్‌ మూడో స్థానానికి పడిపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement