సాక్షి, హైదరాబాద్: ఆపద్ధర్మ టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఎన్నికల సంఘం (ఈసీ) కుమ్మక్కు అయిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 6న అసెంబ్లీ రద్దు అయినప్పటి నుంచి అనేక సందర్భాల్లో ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై తాము అనుమానాలు వ్యక్తం చేసినా ఈసీ మాత్రం దురదృష్టవశాత్తు ప్రజానీకానికి అనేక అనుమానాలు మిగిలిపోయేలా వివాదాస్పదంగా ఎన్నికలు నిర్వహించిందని ధ్వజమెత్తారు. ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేయకుండా రాష్ట్ర సీఈఓ, ఈసీ కుదించిందని, ఎన్నికల జాబితా సరిచేయకుండానే ఎన్నికలు నిర్వహించారన్నారు. శాసనసభను రద్దు చేశాక కేసీఆర్ ఒక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారని, ముందుగా దానితో ఈసీ విభేదించినా చివరకు అదే షెడ్యూల్‌ను విడుదల చేసిందని ఆరోపించారు.
మంగళవారం గాంధీ భవన్‌లో పార్టీ నాయకులు నిరంజన్, వంశీచంద్‌రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, బొల్లు కిషన్‌లతో కలసి ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. ఈవీఎంలలో నమోదైన ఓట్లకు బదులు పూర్తిగా ఓటర్ వెరిఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)లలో రిజిస్టర్ అయిన ఓట్లను లెక్కించాలని తాము కోరుతున్నా ఈసీ ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని ప్రజల్లో ఏర్పడిన అనుమానాలు దూరం చేయకపోతే వారిలో అవి శాశ్వతంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. వందకు వంద శాతం వీవీప్యాట్‌లలో పడిన ఓట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాగితాలపై రికార్డ్ అయిన ఓట్లను లెక్కించకపోతే ఇక వీవీప్యాట్‌ల వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వీవీప్యాట్‌లను లెక్కించకపోతే ప్రజాస్వామ్యానికే ఇది చీకటిరోజుగా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌తో కలసి ఈసీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఆరోపించాల్సి వస్తుందన్నారు.
ఎక్కడో ఏదో జరిగింది...
అనేక పోలింగ్ బూత్‌లలో నమోదైన ఓట్లకు, ఈవీఎంలలో చూపిన ఓట్లకు తేడా ఉందని, చాలా పోలింగ్ బూత్‌లలో ఒరిజనల్ ఓటింగ్ సరళికి... ఈవీఎంలలో పడిన ఓట్లు, ఓట్ల లెక్కింపునకు మధ్య తేడాలున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. ఈసీ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా వీవీప్యాట్‌లను లెక్కించడంలో అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశామని ఉత్తమ్ చెప్పారు. ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని ఈసీ ఈ విధంగా చేస్తోందని నిలదీశారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, తాము కూడా దీనిపై చట్టపరంగా ఏ విధంగా వ్యవహరించాలన్న విషయమై నిర్ణయం తీసుకుంటామన్నారు. స్వల్ప మెజారిటీతో అధికార పార్టీ అభ్యర్థి గెలిచిన చోట ప్రత్యర్థి అభ్యర్థి కోరినా వీవీప్యాట్‌లను ఎందుకు లెక్కించడం లేదని ప్రశ్నించారు. ‘ఎక్కడో ఏదో జరిగింది, జరుగుతోంది’అన్నారు. ఈవీఎంలలో పడిన ఓట్లతో సంబంధం లేకుండా మెజారిటీలు వస్తున్నాయన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే వారే ఎన్నికల్లో అక్రమాలేవీ జరగలేదని మాట్లాడతారని ఈ అంశంపై ఓ ప్రశ్నకు ఉత్తమ్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ప్రభుత్వంతో ఈసీ కుమ్మక్కు
Published Wed, Dec 12 2018 1:45 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment