మహిళ మహిమ.. | Most Of Women Voted For TRS Party | Sakshi
Sakshi News home page

మహిళ మహిమ..

Published Fri, Dec 14 2018 11:24 AM | Last Updated on Fri, Dec 14 2018 11:24 AM

Most Of Women Voted For TRS Party - Sakshi

రాజకీయ పరిశీలకుల అంచనాలను తలకిందులు చేసి అఖండ విజయం నమోదు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం వెనుక జిల్లా మహిళల పాత్ర కీలకంగా ఉందనేది ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికం. మిగిలిన గజ్వేల్, హుస్నాబాద్‌ నియోజకవర్గాల్లో కూడా పురుషులతో సమానంగా మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతోపాటు పోలింగ్‌లో కూడా పురుషుల కన్నా అధికంగా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహిళలు భారీగా పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చిన కారణంగానే టీఆర్‌ఎస్‌ సునాయసంగా విజయం సాధించడంతోపాటు చాలాచోట్ల ప్రత్యర్థులకు డిపాజిట్లు గల్లంతు చేసిందని పరిశీలకులు పేర్కొంటున్నారు.  – సాక్షి, సిద్దిపేట

మహిళా ఓటర్లు కారుకు.. కేసీఆర్‌కు జై కొట్టినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. జల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక నియోజకవర్గాల పరిధిలో మొత్తం 8,55,453 ఓట్లు ఉన్నాయి. ఇందులో 4,25,463 ఓట్లు పురుషులవి ఉండగా.. వీరి కన్నా 3,982 ఓట్లు అధికంగా మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ప్రభుత్వం ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లకు ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నియోజకవర్గంలో ఒక మోడల్‌ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సఖి పేరుతో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లు, అధికారులు, అక్కడ సహాయ సహకారాలు అందించే సిబ్బంది కూడా మహిళలనే నియమించారు.

ఇలా జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో మొత్తం 3827 ఓటర్లు ఉండగా.. ఇందులో 2801 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 66.5 శాతం అంటే 1850 మంది మహిళలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓట్లలో 65శాతం ఓట్లు టీఆర్‌ఎస్‌కు పోల్‌ కావడం మహిళలు టీఆర్‌ఎస్‌కు వెన్నుదన్నుగా ఉన్నారని స్పష్టం అవుతుంది. కాగా మహిళలు.. పురుషులకన్నా 1.5 శాతం ఎక్కువగా టీఆర్‌ఎస్‌కు వేయడం గమనార్హం.  

సంక్షేమ పథకాల ప్రభావం..  
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మహిళా ఓటర్లను అత్యధికంగా ఆకట్టుకున్నాయని, అదే అభ్యర్థులకు శ్రీరామ రక్షగా నిలిచి భారీ మెజార్టీకి దారులు సుగమనం చేసిందని జిల్లాలోని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా మహిళల కోసం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్, అమ్మ ఒడి, కళ్యాణ లక్ష్మీ వంటి పథకాలు మహిళలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ పథకాల పుణ్యమా అని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు పెరిగాయి. వసతులు పెరిగాయి. దీని మూలంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు కూడా పెరిగాయి. అదేవిధంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ లేనిదే ప్రసవం కానిరోజుల నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్‌ డెలివరీలు అధికం కావడం విశేషం. దీంతో ప్రసూతి ఖర్చులు తగ్గాయి.

అదేవిధంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకం ద్వారా ఆడపిల్ల పెళ్లికి రూ.1,0116 అందచేసిన ప్రభుత్వం తీరును పేదింటి ఆడపిల్ల తల్లిదండ్రుల భారం తగ్గింది. అది కూడా ఆడపిల్ల తల్లి పేరిట చెక్కులు పంపిణీ చేసిన తీరు ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అదేవిధంగా వృద్ధ మహిళలు, వితంతులు, ఒంటరి మహిళలతోపాటు, బీడీ కార్మికుల పెన్షన్లు కూడా ఇవ్వడంతో సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటి తలుపు కొట్టిందని మహిళలు చెబుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతోపాటు, దుబ్బాక, హుస్నాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు సోలిపేట రామలింగారెడ్డి, వొడితల సతీష్‌కుమార్‌లు ప్రతీ సభ, సమావేశం, రోడ్‌షోలతోపాటు, పది మంది మహిళలు ఎక్కడ కన్పిస్తే అక్కడ ఈ పథకాల గురించే వివరించిన తీరు మహిళా ఓటర్లపై ప్రభావితం చూపింది.   

పథకాలను ఆదరించారు 
మొదటి నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళా సంక్షేమానికే పెద్దపీట వేసింది. మహిళా సాధికారత కోసం ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానంగా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్, ఆసరా, ఒంటరి మహిలా, బీడీ కార్మికుల పెన్షన్లు మహిళలకు అందాయి. గతంలో ఏ ప్రభుత్వం చెయ్యని తీరుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చింది. అందుకోసమే మహిళలు టీఆర్‌కు పట్టం కట్టారు. 
 – కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎంపీ, మెదక్‌   

 పథకాలకు ఆకర్షితులయ్యారు
హుస్నాబాద్‌ నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లే అధికం. ఇందులో అత్యధిక శాతం మంది టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. కేసీఆర్‌ సీఎంగా ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయనే విశ్వాసం మహిళల్లో బలంగా ఉంది. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, పాలపై లీటర్‌కు రూ.4 సబ్సిడీ, సబ్సిడీతో బర్రెల పంపిణీ, ఆసరా పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి. నాకు భారీ మెజార్టీ రావడంలోనూ మహిళా ఓటర్లే కారణం.  
– వొడితెల సతీష్‌కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్‌   

నా మెజార్టీలో మహిళా ఓటర్లే కీలకం 
మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలు ఏర్పడతాయి.. ఆగ్రహిస్తే కూలిపోతాయి. తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు మహిళలు టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్నారు. గత 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటులో కూడా మహిళల పాత్ర చాలా కీలకం. తాజాగా విడుదలైన అసెంబ్లీ ఫలితాల్లోనూ టీఆర్‌ఎస్‌కు మహిళలే అండగా నిలిచారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌కు మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉంది. నా మెజారిటీలోనూ వారి ఓట్లే కీలకం.
 – సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యే దుబ్బాక    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement