సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ ప్రకటించిన హామీలను వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు తెలిపారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో ఇచ్చిన హామీ ల వివరాలను అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా పొందుపరచాలని పార్టీ ప్రధాన కార్యదర్శులను కేటీఆర్ ఆదేశించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 24 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జనవరి మొదటి వారంలో అన్ని జిల్లాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణాలు మొదలుపెట్టాలన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో అనేక చోట్ల ఓట్లు గల్లంతుపై అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. ఓట్ల గల్లంతుతో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు రావాల్సిన మెజారిటీ కొంత మేరకు తగ్గింది.
కొన్ని చోట్ల ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నా ఓట్లు వేయలేక బాధపడిన వారు ఉన్నారు. ఇలాంటి సమస్యలను టీఆర్‌ఎస్ తరఫున పరిష్కరించేందుకు ప్రయత్నిం చాలి. ఎన్నికల ప్రధానాధికారిని కలసి ఈ అంశాలపై విజ్ఞప్తి చేయాలి. క్షేత్రస్థాయిలో వివరాలను సేకరిం చాలి. ఒక్క ఓటరు పేరు కూడా గల్లంతు కాకుండా చర్యలు తీసుకోవాలి. అర్హతగల ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలి. టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయ కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సోమ భరత్‌కుమార్‌లతో కూడిన కమి టీ ఓటరు నమోదు అంశాలను సమన్వయం చేస్తుం ది. ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో కారణా లను తెలుసుకుని అవసరమైన చర్యలు ఏమిటనేది కమిటీ ద్వారా పార్టీ శ్రేణులకు మార్గదర్శకాలు జారీ ఇస్తాం. ఈ నెల 26 నుంచి జనవరి 6 వరకు కొత్త ఓటర్ల నమోదు, మార్పుచేర్పుల కార్యక్రమం ఉంది. ప్రతి ఓటరు పేరు నమోదు లక్ష్యంగా పని చేయాలి. ఓటరు నమోదు కార్యక్రమం కోసం ఈ నెల 22 నుం చి 24 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహిం చాలి.
టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టడం లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్‌ఎస్ కార్యాలయాల నిర్మాణాలు వేగంగా పూర్తి కావాలి. ఎకరానికి తక్కువ విస్తీర్ణం కాకుండా స్థలాలను ఎం పిక చేయాలి. సమావేశాలు నిర్వహించుకునేలా ఈ స్థలాలు ఉండాలి. ఇప్పటికే ఎంపిక చేసిన స్థలం ఎకరం విస్తీర్ణంకంటే తక్కువగా ఉంటే వేరే వాటిని పరి శీలించాలి. పార్టీ జిల్లా కార్యాలయాల స్థలాలు అనువుగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని వెంటనే కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. కార్యాలయ భవనాల నమూనాను టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమోదిస్తారు. వెంటనే నిర్మాణాలను ప్రారంభించి మూడు నెలల్లో పూర్తి చేయాలి. జనవరి మొదటి వారం నుంచి అన్ని జిల్లాల్లో కార్యాలయ నిర్మాణాలు మొదలుకావాలి. టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ నుంచి జిల్లాలకు ఇన్‌చార్జీలుగా గతంలో నియమించిన వారే కొనసాగుతారు. రాష్ట్ర కమిటీ నుంచి వైదొలగిన వారి స్థానాల్లో కొత్త వారిని త్వరలో నియమిస్తాం. కేసీఆర్ అనుమతితో దీనిపై త్వరలోనే ప్రకటన వస్తుంది. అన్ని అంశాలపై చర్చించేందుకు ఎప్పటికప్పుడు సమావేశమవుదాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
నేడు సిరిసిల్లకు...
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మొదటిసారి బుధవారం సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సిరిసిల్లలో టీఆర్‌ఎస్ నేతలు భారీ స్థాయిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. భారీ ర్యాలీతో ఈ కార్యక్రమం ఉండనుంది. అనంతరం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో టీఆర్‌ఎస్ శ్రేణులను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించనున్నారు. కేటీఆర్ సిరిసిల్ల పర్యటన మంగళవారమే జరగాల్సి ఉన్నప్పటికీ బుధవారానికి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment