సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘గులాబీ’ సునామీ సృష్టించింది. ముందస్తు సమరంలో ప్రత్యర్థులను చిత్తుగా ఓడించింది. ఊహకందని ఫలితాలను సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. గత ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లకు పరిమితమైన ఆ పార్టీ ఈసారి ఏకంగా 11 స్థానాలు గెలిచి ఆజేయశక్తిగా ఆవతరించింది. టీడీపీ నామరూపాల్లేకుండా కొట్టుకుపోగా.. కాంగ్రెస్ మాత్రం ముచ్చటగా మూడు సీట్లను దక్కించుకొని ‘సమ్ తృప్తి’ చెందింది. జిల్లా వ్యాప్తంగా సంచలనాలు నమోదైన ఈ ఎన్నికల్లో తాజా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి మూటగట్టుకున్నారు. ఆయన సమీప ప్రత్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. వికారాబాద్ జిల్లాలోని నాలుగింటిలో మూడు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ.. తాండూరులో మాత్రం చతికిలపడింది. ఆది నుంచి తుది వరకు ఉత్కంఠను రేకెత్తించిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆఖరికి ఫలితం కూడా దోబుచులాడింది. ఇక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్వల్ప ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి, బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిపై విజయం సాధించారు.
నలుగురు కొత్తవారే..
తాండూరు సహా వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో పోటీ చేసిన కొత్త నేతలకు ఓటర్లు పట్టం కట్టారు. వికారాబాద్‌లో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకున్న డాక్టర్ మెతుకు అనంద్‌ను అదృష్టం వరించింది. మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఆయన గెలిచారు. పరిగిలో సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్‌రెడ్డి తనయుడు మహేశ్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డిపై భారీ ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
చేవెళ్లలోను టీఆర్‌ఎస్ హవా..
కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకునే చేవెళ్లలో టీఆర్‌ఎస్ గాలి వీచింది. ఈ హవాలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోయింది. ఆ పార్టీ తరఫున పోటీచేసిన కేఎస్ రత్నం భారీ ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు.
శివార్లలోనూ గుబాళింపే..
పట్టణ ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌ను ఆదరించారు. రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఆ పార్టీకి మద్దతు పలికారు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఈసారి ఆ పార్టీ అభ్యర్థులపైనే గెలుపొందడం విశేషం. ఈ రెండు సీట్లతో పాటు ఇబ్రహీంపట్నం బరిలో నిలిచిన తెలుగుదేశం పార్టీకి శృంగభంగమే ఎదురైంది.
హస్తవాసి రెండింటికే..
టీఆర్‌ఎస్ ప్రభంజనంలోనూ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయం సాధించారు. మహేశ్వరం నుంచి బరిలో దిగిన ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిపై గెలుపొందారు. తొలుత ఆధిక్యతను కనబరిచిన తీగలకు సొంత మండలంలోనే చుక్కెదురైంది. మీర్‌పేట, జల్‌పల్లి, జిల్లెలగూడ మున్సిపాలిటీల్లో ఆయన ఆశించిన స్థాయిలో ఓట్లను రాబట్టలేకపోయారు. దీంతో పదో రౌండ్ నుంచి ఆధిక్యతలోకి వచ్చిన సబిత చివరి వరకు అదే ఒరవడిని కొనసాగించారు. ఓటమెరుగని ఆమె నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎల్‌బీనగర్‌లో సుధీర్‌రెడ్డి మరోసారి విజయబావుటా ఎగువేశారు. ఆది నుంచి ఆధిక్యతను కనబరుస్తూ వచ్చిన ఆయన దాదాపు 17వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
టెన్షన్..టెన్షన్
ఇబ్రహీంపట్నం రాష్ట్ర రాజకీయాల్లోనే తరుచూ పతాక శీర్షికలకెక్కుతోంది. తాజాగా ఎన్నికల ఫలితాల్లోనే అదే ఉత్కంఠ కొనసాగింది. పొత్తులో టీడీపీకి ఈ సీటు కేటాయించడంతో బీఎస్పీ తరఫున బరిలో దిగిన అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. టీఆర్‌ఎస్ నుంచి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బరిలో నిలిచారు. వీరిద్దరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులోనూ మొదట ‘ఏనుగు’ ముందంజలో సాగగా.. ఆ తర్వాత కారు జోరు కొనసాగించింది. ఇలా 16 రౌండ్ల వరకు వెనుకబడ్డ మల్‌రెడ్డి అనూహ్యంగా పుంజుకొని మంచిరెడ్డిని వెనక్కి నెట్టారు. ఆ తర్వాత క్రమేణా స్వల్ప ఆధిక్యతను దక్కించుకుంటూ వచ్చిన టీఆర్‌ఎస్ 21 రౌండ్లు పూర్తయ్యే సరికి 104 ఓట్ల మెజార్టీతో నిలిచింది. అయితే, అప్పటికే ఆరు ఈవీఎంలకు సాంకేతిక సమస్య రావడంతో పక్కనపెట్టిన ఎన్నికల అధికారులు వాటిని బాగుచేయడానికి శతవిధాలా ప్రయత్నించారు. ఒకవైపు పోటీ ఉత్కంఠగా మారడం.. ప్రతి ఓటు కీలకమే కావడంతో ఇరు పార్టీల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికితోడు మరోసారి పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలనే డిమాండ్‌కు చేయడంతో ఆ మేరకు మరోసారి లెక్కించారు. ఈ ఈవీఎంలు బాగుచేయకపోవడం తో వీవీ ప్యాట్లలోని ఓట్ల లెక్కించారు. ఈ ఓట్లను కూడిన లెక్కించిన అనంతరం 376 ఓట్ల అధిక్యత సాధించిన మంచిరెడ్డి విజేతగా నిలిచారు.
రేవంత్‌కు భంగపాటు!
కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డికి తొలిసారి ఓటమి ఎదురైంది. సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు. టీడీపీని వీడిన మరుక్షణమే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతుందని భావించిన టీఆర్‌ఎస్ అధినాయకత్వం వ్యూహాత్మకంగా పావు లు కదిపింది. అభివృద్ధి మంత్రమే నినాదంగా..రేవంత్‌రెడ్డి ఎత్తులకు చెక్ పెట్టింది. తొలిసారి కొడం గల్ కోటలో టీఆర్‌ఎస్ జెండాను ఎగురవేసింది.
Comments
Please login to add a commentAdd a comment