సాక్షి, హైదరాబాద్: భారీ ఆశలు, అంచనాలతో ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీకి దారుణమైన దెబ్బ తగిలింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఊహించని రీతిలో పార్టీ చతికిలపడిపోవడం పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనలో పడేసింది. ప్రధాని నరేంద్రమోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బీజేపీ తన ప్రచారాన్ని హోరెత్తించినా రాష్ట్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోలేకపోయింది. ఫలితంగా ఒక్కటి మినహా గతంలో ఉన్న స్థానాలను కూడా ఈసారి తిరిగి దక్కించుకోలేకపోయింది. పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, గతంలో పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభలో పార్టీ పక్ష నేతగా ఉన్న కిషన్‌రెడ్డి కూడా ఓడిపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, మిజోరం, రాజస్తాన్‌లో ఆ పార్టీ పరాజయం పాలుకావడం, మధ్యప్రదేశ్‌లో పోటాపోటీగా ఉన్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో పడ్డాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత మేర ఓటుబ్యాంకును పెంచుకొని ఎక్కువ స్థానాలు గెలుపొంది సత్తా చాటాలనుకున్న పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడంతో డీలా పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగవచ్చని ఆశలు పెట్టుకున్న కొంతమంది నేతలు ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు.
60కి పైగా స్థానాల్లో డిపాజిట్ గల్లంతు
118 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను పోటీలో నిలిపినా 60కి పైగా స్థానాల్లో పార్టీ అభ్యర్థులకు దిపాజిట్ దక్కలేదు. 2014 ఎన్నికల్లో ఐదు స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరో 10 స్థానాల్లో అప్పుడు రెండోస్థానంలో ఉంది. ఈసారి అంతకంటే దారుణమైన స్థితిలో పడిపోయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికంగా 15 స్థానాలను మహిళలకు కేటాయించినా ఒక్క మహిళా అభ్యర్థి కూడా గెలవలేకపోయారు. ముగ్గురు తాజామాజీలైన కుంజ సత్యవతి(భద్రాచలం), బొడిగె శోభ (చొప్ప దండి), అరుణతార (జుక్కల్)లకూ ఓటమి తప్ప లేదు. గజ్వేల్‌లో పోటీ చేసిన మహిళామోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయ కూడా ఓడిపోయారు.
బీజేపీలో ఏక్ నిరంజన్
అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు సిట్టింగుల్లో గోషామహల్ అభ్యర్థి రాజాసింగ్ మాత్రమే గెలుపొంది ఏక్ నిరంజన్‌గా నిలిచారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తాజాగా అదే నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. దీంతో ఆ పార్టీకి అంసెబ్లీలో ఒక్కస్థానంతో ప్రాతినిథ్యం దక్కింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌సహా తాజా మాజీలైన కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తోపాటు సీనియర్ నేతలు ఎన్.రాంచందర్‌రావు, బద్దం బాల్‌రెడ్డి, యెండల లక్ష్మినారాయణ, తల్లోజు ఆచారి ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో పార్టీ కోలుకోలేని పరిస్థితిలో పడింది. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ పేర్కొన్నారు. తనను ఓడించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని, ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టారని, అయినా ప్రజలు తన పక్షానే ఉన్నారని అన్నారు.
కమలానికి దెబ్బ మీద దెబ్బ!
Published Wed, Dec 12 2018 3:12 AM | Last Updated on Wed, Dec 12 2018 3:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment