సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రయత్నం చేసినా అంత దారుణంగా దెబ్బతినడానికి గల కారణాలపై బీజేపీ ఆలోచనల్లో పడింది. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లోనూ ఈసారి మరిన్ని స్థానాలను గెలుచుకోవాలని భావించినా ఫలితం అందుకు విరుద్ధంగా రావడంతో పార్టీ మొత్తం గందరగోళంలో పడింది. హైదరాబాద్‌లోని ఒక్క గోషామహల్ మినహా ఖైరతాబాద్, అంబర్‌పేట్, ముషీరాబాద్, ఉప్పల్ స్థానాలను కూడా దక్కించుకోలేని పరిస్థితికి గల కారణాలను పార్టీ వర్గాలు అన్వేషిస్తున్నాయి. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు అనేక మంది ప్రచారం చేసినా కేవలం ఒకే ఒక్క స్థానానికి ఎందుకు పరిమితం కావాల్సి వచ్చిందో విశ్లేషిస్తున్నాయి. పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు అనేక అవకాశాలు ఉన్నా.. వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం, క్షేత్రస్థాయిలోకి వెళ్లకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వారు అధ్యక్షుడిగా ఉండటం వల్ల గ్రామీణ ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారన్న అపవాదు పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది. మరోవైపు పార్టీ అభ్యర్థుల ఖరారు ఆలస్యం కావడం, చివరి క్షణంలో టికెట్లు ఇచ్చినా ప్రచారానికి సమయం సరిపోలేదన్న వాదన వ్యక్తమవుతోంది. అయితే పార్టీ ముఖ్య నేతలు మాత్రం ఈ అంశాలను కొట్టిపారేస్తున్నారు. ఈ ఎన్నికలు కేవలం తెలంగాణ సెంటిమెంట్‌పైనే జరిగాయని, ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయడం, కూటమిలో ఆయన పార్టీ ఉన్న కారణంగా ప్రజల్లో మళ్లీ చంద్రబాబు పెత్తనం ఏంటన్న అభిప్రాయం వచ్చిందని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌సహా ముఖ్యనేతలంతా విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలు కావడంతో బుధవారం పార్టీ ముఖ్యనేతలు పార్టీ కార్యాలయానికి వెళ్లకపోవడంతో కార్యాలయం బోసిపోయినట్లు అయింది. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ రాజీనామా చేస్తారన్న వదంతులు వచ్చాయి. అయితే వాటిని పార్టీ ముఖ్య నేత ఒకరు కొట్టిపారేశారు. అలాంటిదేమీ ఉండదన్నారు. స్థానాలను పెంచుకోకపోగా, ఉన్న స్థానాలను కాపాడుకోలేని పరిస్థితి వల్ల ఐసీయూలోకి వెళ్లినట్లు అయిందని, దానినుంచి బయటకు రావాలంటే కొంత సమయం పడుతుం దని ఓ నేత వ్యాఖ్యానించడం కొసమెరుపు.
బీజేపీలో సంజయ్‌కి అత్యధిక ఓట్లు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ తరఫున ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు 14,50,456 (7 శాతం) మంది ప్రజలు ఓట్లు వేశారు. పార్టీ తరఫును 118 స్థానాల్లో పోటీ చేస్తే అందులో ఒక్క గోషామహల్‌లో 61,854 ఓట్లతో రాజాసింగ్ గెలుపొందారు. పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో ఆయనకంటే ఎక్కువ ఓట్లు వచ్చినా, రెండో స్థానానికే పరిమితమయిన అభ్యర్థులు ఉన్నారు. ద్వితీయ స్థానంలో ఉండి అత్యధిక ఓట్లు లభించిన అభ్యర్థుల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ మొదటి వరుసలో ఉన్నారు. ఆయనకు 66,009 ఓట్లు రాగా, అంబర్‌పేట్ నుంచి పోటీ చేసిన కిషన్‌రెడ్డికి 60,542 ఓట్లు వచ్చాయి. కల్వకుర్తిలో తల్లోజు ఆచారికి 59,445 ఓట్లు, ఆదిలాబాద్‌లో పాయ ల్ శంకర్‌కు 47,444 ఓట్లు, ముథోల్‌లో రమాదేవికి 40,602 ఓట్లు, కార్వాన్‌లో అమర్‌సిం గ్‌కు 35,709 ఓట్లు, ఖైరతాబాద్‌లో చింతల రామచంద్రారెడ్డికి 34,666 ఓట్లు, మల్కాజిగి రిలో రాంచందర్‌రావుకు 22,932 ఓట్లు వచ్చా యి. ముషీరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు 30,813 ఓట్లు వచ్చాయి.
ఆదరించిన వారందరికీ ధన్యవాదాలు: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: విపత్కర పరిస్థితుల్లో కూడా బీజేపీకి ఓటు వేసి ఆదరించిన రాష్ట్ర ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు నిరంతరం కృషి చేస్తూ.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో రెండుసార్లు ముషీరాబాద్ నుంచి గెలిపించి ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రజాతీర్పును శిరసావహిస్తూ, ముషీరాబాద్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment