
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ ప్రజాకర్షణ శక్తి మంత్రం రాష్ట్రంలో పని చేయలేదు. అమిత్‌షా రాజకీయ చతురతకూ ఇక్కడ స్థానం లేకుండా పోయింది. భారతీయ జనతాపార్టీ జాతీయ స్థాయి రాజకీయ వ్యూహం తెలంగాణలో చతికిల పడిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను సాధించకపోగా, పార్టీకి ఉన్న స్థానాలను సైతం పోగొట్టుకుంది. గతంలో 5 స్థానాలు ఉంటే ఇప్పుడు ఒకే ఒక్క స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొత్తంగా 40 మందికి పైగా స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రంలో 20 రోజుల పాటు దాదాపు 180 బహిరంగ సభల ద్వారా ప్రచారం చేశారు. అయినా పార్టీ అభ్యర్థులు గెలువలేకపోవడం బీజేపీని తీవ్ర ఆందోళనలో పడేసింది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉంటే 118 స్థానాల్లో బీజేపీ తొలిసారిగా పోటీ చేసింది. అందులో కేవలం ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోవడం.. 117 స్థానాల్లో పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం ఆ పార్టీని విస్మయ పరుస్తోంది. గత అసెంబ్లీలో పార్టీకి ప్రాతినిధ్యం వహించినవారిలో కూడా నలుగురు ఓడిపోవడంతో శ్రేణులు తీవ్ర నిరాశలో పడ్డాయి.
కీలక భూమిక అనుకున్నా..
దేశంలో 19 రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చింది మోదీ, అమిత్‌షా జోడి అని, తెలంగాణలో ఆ దిశగా కృషి చేస్తామని చెప్పిన పార్టీ నేతల మాటలను ప్రజలు పక్కన పెట్టేశారు. కాంగ్రెస్, టీడీపీల క్రియాత్మక పాత్రతో ఏర్పాటైన ‘ప్రజాకూటమి’ని సైతం ప్రజలు పెద్దగా నమ్మలేదు. మోదీ, అమిత్‌షా, ఇతర బీజేపీ పెద్దలు సుమారు 20 రోజుల పాటు రాష్ట్రాన్ని చుట్టేసినా ఓటర్లు పట్టించుకోలేదు. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని చెప్పిన బీజేపీ కనీసం కొత్త ప్రభుత్వంలో కీలక భూమిక పోషించాలన్న ఆలోచనతో భారీ ఎత్తున ప్రచారం చేపట్టింది. అయితే అది నిష్ప్రయోజనంగా మారింది.
అతిరథుల ప్రచారం..ఆశ్చర్యకర ఫలితం..
గత నెల మొదటి వారం నుంచే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌చౌహాన్, మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌గడ్కరీ, సాధ్వి నిరంజన్ జ్యోతి, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, సంతోష్ గంగ్వార్, జేపీ నడ్డా, పురుషోత్తం రూపాల, జోయల్ ఓరమ్, స్వామి పరిపూర్ణానంద ప్రచారం చేసినా బీజేపీ అభ్యర్థులు గెలుపుబాట పట్టక పోవ డం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్య చకితులను చేస్తోంది. ఓటర్లు ఈ ప్రచారానికి ప్రాధాన్యమివ్వలేదని రుజు వు చేశారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment