సాక్షి, వెబ్‌డెస్క్: కేసీఆర్ దూకుడు ముందు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా పనిచేయలేదు.. టీఆర్‌ఎస్ ప్రభంజనం ముందు అమిత్ షా పాచికలు పారలేదు. కేసీఆర్ సంక్షేమ అజెండా ముందు బీజేపీ అగ్రనేతల ప్రచారం, కమలనాథుల వ్యూహాలు ఫలించలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత ఓటు బ్యాంకును పెంచుకోవడంతో పాటు.. ఈసారి ఎక్కువ స్థానాలు గెలుపొంది.. సత్తా చాటాలనుకున్న కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఈసారి కేవలం ఒక్కటంటే ఒక్క స్థానానికి పరిమితమైంది. మంగళవారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు ఫలితాలు వచ్చాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌తోసహా కచ్చితంగా గెలుస్తారనుకున్న సీనియర్ నేత కిషన్‌రెడ్డి సైతం ఓడిపోయారు. కరీంనగర్, ఆదిలాబాద్, ఖైరతాబాద్ వంటి కొన్ని స్థానాల్లో బీజేపీ గట్టిపోటీ ఇచ్చినా గెలుపును మాత్రం అందుకోలేపోయింది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు దాదాపు 60 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఒక్క గోషామహాల్‌లోనే ఆ పార్టీ వివాదాస్పద నేత రాజాసింగ్ విజయం సాధించారు.
అనుకున్నదొకటి.. అయినదొకటి
భారీ ఆశలు, భారీ అంచనాలతో బీజేపీ ఈసారి తెలంగాణ ఎన్నికలకు వెళ్లింది. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో ఎన్నికల వేళ పెద్ద ఎత్తున నేతలు తమ గూటికి చేరుతారని ఆశించింది. పెద్ద నాయకులను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. కానీ, టికెట్లు ఆశించి భంగపడిన బాబుమోహన్, బొడిగే శోభ వంటి నేతలు మాత్రమే ఆ పార్టీలో చేరారు. అయినా, ప్రధాని నరేంద్రమోదీ చరిష్మాతో ఈసారి ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధిస్తామని కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు.
అందుకు అనుగుణంగా పార్టీ జాతీయస్థాయి అగ్రనేతలను ప్రచారంలో మోహరించారు. కత్తి మహేశ్ రాముడిపై చేసిన వ్యాఖ్యల విషయంలో పాపులర్ అయిన స్వామి పరిపూర్ణానంద కూడా బీజేపీలో చేరడంతో ఆయనతోకూడా కమలనాథులు విస్తృతంగా ప్రచారం చేయించారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్య క్షుడు అమిత్‌షా సహా.. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, ఫడ్నవిస్, రమణ్‌సింగ్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, సాధ్వీ నిరంజన్ జ్యోతి, సుష్మాస్వరాజ్, స్మృతి ఇరానీ, సంతోశ్ గంగ్వార్, జగత్ ప్రకాశ్ నడ్డా, పురుషోత్తం రూపాల, జువాల్ ఓరమ్, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి తదితరులు ప్రచారంలో హోరెత్తించారు. కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా వీరి ప్రచారం సాగింది.
తన పరిధిలో బీజేపీ శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. ఈసారి తెలంగాణ ఓటర్లను ప్రసన్నం చేసుకోలేకపోయిందని చెప్పవచ్చు. పొత్తులు లేకుండా ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్లిన ఆ పార్టీకి దక్కింది కేవలం ఒక్క స్థానమే. ఓట్ల శాతం పెరిగిందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. పలుచోట్ల బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా ఎన్నో ఆశలతో ఎన్నికలకు వెళ్లి.. భంగపడిన బీజేపీ నేతలు రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళుతామని అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు సాగుతామని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment