సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా రాజకీయాలతో సుదీర్ఘ అనుబంధాన్ని పెనవేసుకుని అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందడంతోపాటు జిల్లాలో టీడీపీ, టీఆర్‌ఎస్ హయాంలో రాజకీయ చక్రం తిప్పిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికల్లో అనూహ్య రీతిలో ఓటమి చెందారు. ఆయన తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డిపై ఏడువేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం చెందడం జిల్లాలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. 1983లో టీడీపీలో చేరడం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన తుమ్మల.. గెలుపోటములను అనేకసార్లు చవిచూశారు. సత్తుపల్లి, ఖమ్మం వంటి నియోజకవర్గాల్లో పలుసార్లు గెలిచారు... ఓడారు. 2016 ఉప ఎన్నికల నుంచి పాలేరు నియోజకవర్గంతో ముడిపడిన రాజకీయ అనుబంధం.. అభివృద్ధిపై తన ముద్ర ఉండాలన్న తపన పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగిరపరిచిన పరిస్థితులు దృష్ట్యా ఆయన విజయం సాధిస్తారని పార్టీ వర్గాలు విశ్వసించాయి.
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గల సంప్రదాయ ఓటు బ్యాంకు, అభ్యర్థి స్థానికత వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపించాయని, దానికి తోడు టీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న వర్గ పోరు పార్టీని బలహీనపరిచేలా చేసి ఓటమి అంచుకు చేర్చిందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. మంత్రిగా తుమ్మల చేసిన అభివృద్ధిని వేనోళ్ల కీర్తించిన పార్టీ నేతలు, తమ మండలాల్లో ఆ స్థాయిలో ఓట్ల రూపంలో ప్రభావాన్ని చూపలేకపోవడానికి గల కారణాలపై పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. మంత్రి తుమ్మల అత్యంత ప్రీతిపాత్రంగా భావించి వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసిన తిరుమలాయపాలెం మండలంలో టీఆర్‌ఎస్ పార్టీ ఆశించిన మెజార్టీ రాకపోవడం సైతం పార్టీ శ్రేణులను నిస్తేజానికి గురిచేసింది. కనీసం పదివేల మెజార్టీ ఈ మండలంలో లభిస్తే.. ప్రతికూల మండలాల్లో కొంత మెజార్టీ తగ్గినా గెలుపునకు ఢోకా ఉండదని రాజకీయ అంచనాలు వేశారు. ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉండడాన్ని తుమ్మల సహా పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.
మంత్రి తుమ్మల కొంత కలుపుగోలుగా, కార్యకర్తలకు సన్నిహితంగా ఉండాలని నియోజకవర్గం కోరుకున్నదని, దాని ప్రభావం సైతం ఈ ఎన్నికలపై పడిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాను పాలేరు నియోజకవర్గానికి చేయగలిగిన అభివృద్ధి చేశానని, తిరుమలాయపాలెం వంటి మండలంలో కరువు ఛాయలు రూపుమాపడానికి నిరంతరం శ్రమించానని ఫలితాల అనంతరం సన్నిహితులతో జరిగిన సమీక్షలో తుమ్మల అభిప్రాయపడినట్లు సమాచారం.
తుమ్మల నాగేశ్వరరావు 1983లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మొదటి సారి పోటీచేసి ఓటమి చెందారు. 1985లో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి, ఎన్‌టీ రామారావు మంత్రివర్గంలో చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1989లో టీడీపీ అభ్యర్థిగా సత్తుపల్లి నుంచి ఓడిపోయారు. 1994లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1996 నుంచి 99 వరకు చంద్రబాబు మంత్రివర్గంలో భారీ, మధ్య తరహా నీటి పారుదల శాఖ మంత్రిగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో తిరిగి సత్తుపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై ఓడిపోయారు. 2009లో నియోజకవర్గ పునర్విభజన కారణంగా సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గంగా మారడంతో ఆయన ఖమ్మం నియోజకవర్గంలో టీడీపీ నుంచి విజయం సాధించారు.
2014లో అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌పై ఓడిపోయారు. ఆ సమయంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా తుమ్మలకు పేరుండటంతో తుమ్మ ల 2014 సెప్టెంబర్ 5వ తేదీన టీడీపీకి రాజీనా మా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. చేరిన కొద్ది కాలానికే కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం లభించింది. రహదారులు, భవనాలు శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పి.. తుమ్మలకు ఎమ్మెల్సీ అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అదే నియోజకవర్గాన్ని రాజకీయ సుస్థిర స్థానంగా పెంపొందిం చుకోవడం ద్వారా నియోజకవర్గ అభివృద్ధికి దృష్టి సారించవచ్చునని భావించిన తుమ్మల, ప్రధాన సమస్యలపై దృష్టి సారించి భక్త రామదాసు ప్రాజె క్టు వంటి పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయిం చారు. తుమ్మల ఓటమికి కారణాలపై మాత్రం ఎవరి రీతిలో వారు విశ్లేషణలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment