
సాక్షి, చెన్నై : తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన విజయం ప్రజాస్వామ్య విజయమని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన త్యాగాన్ని ప్రజలు మరవలేదన్న విషయం ఈ ఫలితాలలో రుజువైందన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఎవరెన్ని మాటలు చెప్పిన ప్రజలు నమ్మలేదని, అభివృద్ధికే పట్టం కట్టారని వ్యాఖ్యానించారు.
కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో విజయం సాధించాలని కలలు కన్న పార్టీలకు ప్రజల తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారు. ఎన్నికల్లో కుల, మతాలను ప్రోత్సహించిన పార్టీలతో ప్రజల తమ ఓటు అస్త్రంతో తగిన శాస్తి చెప్పారని ఎద్దేవా చేశారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన చివరని ఉద్యమ వీరుడికే విజయ దక్కిందని, ఇది కచ్చితంగా ఉద్యమ విజయమేనని వ్యాఖ్యానించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ గుణాత్మకమైన మార్పు దిశగా అడుగులు వేసి ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.