హరీశ్‌రావును అభినందిస్తున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ ట్రబుల్ షూటర్, ఆ పార్టీ సిద్దిపేట అభ్యర్థి తన్నీరు హరీశ్‌రావు రికార్డుల మోత మోగించారు. తెలంగాణ జన సమితి అభ్యర్థి భవానీ మరికంటిపై ఏకంగా 1,18,699 ఓట్ల మెజారిటీతో గెలిచి అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో కొత్త రికార్డు సృష్టించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా హరీశ్ అరుదైన ఘనత సాధించారు. తెలంగాణతోపాటు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా హరీశ్‌రావు నిలిచారు.
అలాగే అతిపిన్న వయసులో వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికై డబుల్ హ్యాట్రిక్ సాధించిన ప్రజాప్రతినిధిగా కూడా మరో రికార్డు సొంతం చేసుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కె.ఎం. మణి (49 ఏళ్ల వయసులో) గతంలో అసెంబ్లీకి ఆరుసార్లు ఎన్నికవగా ప్రస్తుతం హరీశ్‌రావు 47 ఏళ్ల వయసులోనే ఈ రికార్డు సాధించారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గతంలో సిద్దిపేట నియోజకవర్గం నుంచి వరుసగా ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు ఆయన వయసు 50 ఏళ్లు. అలాగే ఇప్పటివరకు ఐదుసార్లు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు చేసి హరీశ్ మరో రికార్డు నమోదు చేశారు. దీనికితోడు పోటీ చేసిన ప్రతిసారీ తన మెజారిటీని మరింత పెంచుకుంటూ విజయం సాధించారు. పోటీ చేసిన ఐదు వరుస ఎన్నికల్లోనూ పోలైన ఓట్లలో 80 శాతానికిపైగా ఓట్లు సాధించి ఇంకో రికార్డును సొంతం చేసుకున్నారు.
గొప్ప గౌరవం
ప్రజాజీవితంలో ఇంతకన్నా గొప్ప గౌరవం, ఇంతకన్నా అద్భుతమైన అనుభవం మరొకటి ఉండదు. సిద్దిపేటకు నేను ఇచ్చింది గోరంత. అది నాకు తిరిగి ఇచ్చింది కొండంత. జనం తిరగరాసినవి కేవలం ఎన్నికల రికార్డులనే కాదు... వారు ప్రతిసారీ తెలంగాణ చరిత్రనే తిరగరాస్తున్నారు.
– టి.హరీశ్‌రావు
Comments
Please login to add a commentAdd a comment