సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలి ప్రభుత్వంలో ‘చక్రం’తిప్పిన ఆ ముగ్గురు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రోడ్డు, రవాణా, ఆర్టీసీ బాస్‌లుగా పనిచేసిన వారు ఈ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. ఓడిన ఈ ముగ్గురు శాఖల పరంగా పరస్పరం సంబంధం కలిగి ఉండటం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది.
రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి..
తెలంగాణలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్‌రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మహేందర్‌రెడ్డి 1994, 1999, 2009లలో టీడీపీ నుంచి, 2014లో టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల..
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు తుమ్మల నాగేశ్వరరావు అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే 2014 డిసెంబర్‌లో కేబినెట్‌లో స్థానం కల్పించి రోడ్లు, భవనాల శాఖ మంత్రిని చేశారు. 2016 మార్చిలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోవడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆర్టీసీ బాస్ విజయానికి పంచర్..
సోమారపు సత్యనారాయణ 2010 నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి 2009లో స్వతంత్రంగా, 2014లో టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు సార్లు ఆయనకు రాజకీయ ప్రత్యర్థి కోరుకంటి చందర్ కావడం విశేషం. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు వరకు ఆయన టీఎస్‌ఆర్టీసీకి చైర్మన్‌గా సేవలందించారు. ఈ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కోరుకంటి చందర్, టీఆర్‌ఎస్ నుంచి సోమారపు సత్యనారాయణ రామగుండం బరిలో నిలిచారు. కానీ 27 వేల పైచిలుకు ఓట్ల తేడాతో సోమారపు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు.
‘చక్రం’ తిప్పి చతికిలపడ్డారు..
Published Thu, Dec 13 2018 2:02 AM | Last Updated on Thu, Dec 13 2018 2:02 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment