హైదరాబాద్‌ నుంచే..ఢిల్లీలో చక్రం తిప్పుతా! | KCR Press Meet Over The Assembly Elections Results | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 12 2018 1:56 AM | Last Updated on Wed, Dec 12 2018 7:29 AM

KCR Press Meet Over The Assembly Elections Results - Sakshi

మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌. చిత్రంలో పార్టీ ముఖ్యనేతలు జితేందర్‌ రెడ్డి, కేశవరావు, మహమూద్‌ అలీ, కడియం, నాయిని నర్సింహారెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందని టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ ముక్త భారత్‌ను నిర్మించేందుకు ప్రాంతీయ పార్టీల సహకారంతో త్వరలోనే జాతీయ పార్టీ నెలకొల్పనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల నాటికి ఈ నవశక్తి రూపుదిద్దుకుంటుందని తెలిపారు. తెలంగాణలో తీసుకొచ్చిన పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా వ్యూహరచన చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలతో నూతన పార్టీ ఉంటుందని.. ఇందుకు సరిపోయే ఎజెండా తన వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. త్వరలో జాతీయ పార్టీకి సంబంధించిన విధివిధానాలను వెల్లడిస్తానన్నారు. వివిధ రంగాల ప్రముఖులు, నిపుణులతో చర్చించి విధానాలను ఖరారు చేయనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు.
 
నాలుగు పార్టీలను కలిసి సమావేశం పెట్టడం ద్వారా ఏదో చేస్తున్నట్లు హడావుడి చేయడం కాదని.. పరోక్షంగా చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశవ్యాప్తంగా ఏకం చేయాల్సింది పార్టీలను కాదనీ ప్రజలను ఒకే తాటిపైకి తేవాలన్నారు. ‘దేశ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకున్నాను. నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పును మీరే చూస్తారు. తెలంగాణలో ఏది అనుసరిస్తున్నామో దేశంలోనూ అదే జరగాలి. దేశంలో ఇప్పటికీ చాలాచోట్ల తాగునీటిని అందించడం లేదం టే అంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా? మూ డు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచిందంటే అక్కడ మరో గత్యంతరం లేకనే. ఆ పార్టీ కాకుంటే ఈ పార్టీ.. ఈ పార్టీ కాకుంటే ఆ పార్టీయే అన్న పరిస్థితి నెలకొంది. ఒకరు రాఫెల్‌ అంటే మరొకరు భోఫోర్స్‌ అంటారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది’అని కేసీఆర్‌ పేర్కొన్నారు.
 
‘దేశానికి కొత్త ఆర్థిక విధానం, కొత్త వ్యవసాయ విధానం అవసరం. కేవలం ఉత్పత్తిపైన మాత్రమే ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. ఇజ్రాయెల్, చైనాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నామో తేల్చుకోవాలి. విశ్లేషకులు అశోక్‌ గులాటి రైతులకు ఏం చేయాలన్న అంశాన్ని అద్భుతంగా రాశారు. టీఆర్‌ఎస్‌ తెలంగాణలో ఏం చేసిందో రాసి చూపారు. రైతు పెట్టుబడితో రైతు లకు స్వేచ్ఛనిచ్చాం. వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌ కూడా తెలంగాణ పథకాలను మెచ్చుకున్నారు’అని కేసీఆర్‌ తెలిపారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని సుప్రీంకోర్టు బాధ్యతారహితంగా తీర్పు ఇచ్చిందన్నారు. బీసీ, ఎస్సీలు అమాయకులు కావడంతో అడగలేకపోయారన్నారు. సుప్రీంతీర్పును పార్లమెంటు అడ్డుకోదా అని ప్రశ్నిం చారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా పరిస్థితి ఉంటుందని.. 50 శాతం రిజర్వేష న్లు దాటొద్దంటే ఎలాగని కేసీఆర్‌ ప్రశ్నించారు. దేశానికి ఒకే సుప్రీంకోర్టు ఉంటే ఎలా అని ప్రశ్నించారు. అమెరికాలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సుప్రీంకోర్టు ఉందన్నారు. ప్రపంచంలో అనేక దేశాల్లో రైతులకు గౌరవం ఇస్తారు. అనేక పథకాలు ఉంటాయి. కానీ ఇక్కడ రైతుకు గౌరవమే లేదన్నారు. 

ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి.. 
శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనానికి తెలం గాణ ప్రజలు ఎంతగానో సహకరించారని, ఈ ఎన్నికల్లో తమకు లభించిన ఘన విజయం ప్రజలదేనని కేసీఆర్‌ అన్నారు.  రైతులు, మహిళలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాలు, దళితు లు, మైనార్టీలు.. కులమతాలకతీతంగా దీవించి తమకు ఈ విజ యాన్ని అందించారన్నారు. తమకు ఘనవిజయాన్ని కట్టబెట్టిన ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్నికలు యావత్‌ దేశానికి ఓ మార్గాన్ని చూపాయని వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల బహిరంగ సభల్లో చెప్పినట్టుగానే కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమన్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు తమ పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరుగుతుందని వెల్లడించారు. ‘టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులందరూ అహోరాత్రులు కష్టపడి పనిచేయడం వల్లే గొప్ప విజయం సాధించాం. తొలి నుంచి అనుకున్నట్టుగానే అణకువ, వినయం, విధేయత అవసరం. విజయంతో గర్వం, అహంకారం రావాల్సిన అవసరం లేదు. కర్తవ్యనిష్ఠతో బాధ్యతల్ని నిర్వహించడం పైనే మనం దృష్టి పెట్టాలి. రాష్ట్రం లో చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త రాష్ట్రాన్ని ఓ బాటలో పెట్టాం. దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. కోటి ఎకరాలు పచ్చబడాలనే లక్ష్యంలో ఏమాత్రం రాజీలేదు. అది జరిగి తీరాల్సిందే. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం.. కూట మిని గెలిపిస్తే శనేశ్వరం అని ఎన్నికల ప్రచార సభల్లో అన్నాను. ఏది కావాలో తేల్చుకోవాలని ప్రజలకు చెప్పాను. తమకు కాళేశ్వరమే కావాలని ప్రజలు తీర్పునిచ్చారు. దాంతో పాటు మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నీరు తెచ్చి తీరుతాం. ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తాం.’అని కేసీఆర్‌ అన్నారు.  

ఆరోగ్య తెలంగాణ దిశగా.. 
‘రైతుల కోసం పనిచేస్తాం. వారికి ఏ బాధ లేకుండా చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా పనిచేస్తాం. నేనే చొరవ తీసుకుంటా. బీడీ కార్మికులు, గీత కార్మికులు, కుల వృత్తులన్నీ కుదుటపడాలి. వారికి ఆధునిక యంత్రాలను ఇచ్చి ఆదుకుంటాం. యువత కు ఉపాధి, ఉద్యోగాలు లభించేలా పని చేస్తాం. తమకు అవకాశాలు రావడంలేదనే బాధ వారిలో ఉంది. నిరు ద్యోగం దేశవ్యాప్త సమస్య. ఉద్యోగ ఖాళీలను కచ్చితంగా భర్తీ చేస్తాం. అలాగే ప్రభుత్వేతర రంగాల్లో ఉపాధి విరివిగా లభించేలా చర్యలు తీసుకుంటాం. విజయం ఎంత ఘనంగా ఉంటుందో.. బాధ్యత కూడా అంతే బరువుగా ఉంటుంది. సస్యశ్యామలమైన, శాంతియుతమైన, సంపూర్ణ ఆరోగ్యవంతమైన తెలంగాణ నిర్మాణం దిశగా మేం పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం. దళితులు దశాబ్దాలుగా పేదరికంలో కూరుకుపోవడం రాచపుండులా క్షోభపెడుతోంది. దానికి చరమగీతం పాడాలి. కడియం శ్రీహరి నేతృత్వంలో కమిటీ వేశాం. దానిపై పనిచేస్తున్నాం’అని పేర్కొన్నారు. పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు కట్టిస్తామన్నారు. ఏడాదికి రెండు, మూడు లక్షల నాణ్యతతో కూడిన ఇళ్లను కట్టిస్తామన్నారు. కంటి వెలుగు తర్వాత ఈఎన్‌టీ, డెంటల్‌ డాక్టర్లు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అలాగే పూర్తి స్థాయి హెల్త్‌ డేటా రికార్డు చేస్తాం అది పెనుమార్పులకు దారితీస్తుందన్నారు. దరిద్రం ఏదో ఒక కులానికి కాదు అన్ని కులాల్లో ఉందన్నారు. దాన్ని నిర్మూలించాలన్నారు. 

ఖమ్మంలో మా కత్తి మాకే తగిలింది 
రాష్ట్రం వ్యాప్తంగా మాకు రావాల్సిన మరో 17, 18 సీట్లు పోయాయి. ‘ఖమ్మంలో మమ్మల్ని ఎవరూ చం పలే, మా వాళ్లే వాళ్లకు వాళ్లు చంపుకున్నారు. చెప్పినా మా కొలీగ్స్‌ కొంత మంది వినలేదు, వినే ఉంటే మరికొన్ని సీట్లు గెలిచేవాళ్లం. మంత్రులు, స్పీకర్‌ కూడా ఓడిపోయారు. బాధాకరం. వారితో ఫోన్లో మాట్లాడి ఓదార్చాను’అని కేసీఆర్‌ అన్నారు. ‘సింగిల్‌ బూత్‌లో కూడా రీపోల్‌ లేకుండా, ఎలాంటి దొమ్మీలు లేకుండా యావత్‌ దేశానికే ఓ మార్గం చూపే విధంగా ఎన్నిక లు నిర్వహించుకోగలగడం అందరం గర్వపడాల్సిన విషయం. శాంతిభద్రతల నిర్వహణ అంశంలో ఎక్క డా రాజీ లేకుండా పోలీసులు, ఈసీ అధికారులు పనిచేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రజత్‌కుమార్‌కు ధన్యవాదాలు. మీడియా కూడా మంచి పాత్ర పోషించింది. రాష్ట్రం లో మీడియా గౌరవప్రదంగా ప్రవర్తించిం ది’అని కేసీఆర్‌ ప్రశంసించారు. ‘అంతిమ తీర్పు ప్రజలు అప్పగించారు కాబట్టి.. ఆ సమయాన్ని ప్రజా సేవచేయడానికి కేటాయించాలి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎన్ని ఎదురుదాడులకు దిగినప్పటికీ అవన్నీ గతమే’అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అన్నారు.

థ్యాంక్యూ ఒవైసీ 
‘మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీకి ధన్యవాదాలు చెబుతున్నా. సోమవారం ఆయనతో కలిసి భోజనం చేశా. అసదుద్దీన్‌ అసలు సిసలు లౌకికవాది, మేధావి. చాలా అంశాలపై ఆయన చాలా అవగాహన ఉంది. దేశవ్యాప్తంగా మైనారిటీలను ఏకం చేసేలా మేమిద్దరం పర్యటిస్తాం. అందుకోసం రెండు విమానాలు బుక్‌ చేసుకున్నాం. త్వరలో దేశనిర్మాణంలో మేం భాగస్వాములం అవుతాం. ఇక్కడ అన్ని చక్కదిద్ది.. ఆ తర్వాత ఢిల్లీవైపు అడుగులు వేస్తా. బీజేపీ ముక్త్‌ భారత్, కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నినాదంతో ముందుకువెళ్తాను’అని కేసీఆర్‌ వెల్లడించారు. డీఎంకే అధినేత స్టాలిన్‌ రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని అడిగారని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు.

దేశానికి తెలంగాణ ఓ దిక్సూచి 
‘ఈ దేశానికి తెలంగాణ ఓ దిక్సూచి అందుకే తెలంగాణ వేదికగా జాతీయ రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇస్తాం. దేశంలో గందరగోళం నెలకొంది. నూరు శాతం బీజేపీయేతర, కాంగ్రెసేతర పరిపాలన రావాలి. మాకు ఎవరూ బాస్‌లు లేరు. మేం ఎవరికీ ఏజెంట్లం కాము. ప్రజలకే ఏజెంట్లం. వారి కోసమే మేం పనిచేస్తాం. ఎవరికీ గులాంగిరీ చేయం. ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ.. జాతీయ రాజకీయాలను కచ్చితంగా ప్రభావితం చేస్తాం’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘దేశంలో పరిపక్వత రావాలి. ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు వచ్చి మాకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ ప్రజలు అంతిమ నిర్ణయం ఇచ్చారు. మమతా బెనర్జీ, సీఎం నితీశ్‌ కుమార్‌ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తా’అని ముఖ్యమంత్రి వెల్లడించారు. కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డ కేసీఆర్‌.. ఈ దేశానికి 70 వేల టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని, కానీ 30 వేల టీఎంసీలను మాత్రమే వినియోగిస్తున్నారన్నారు. విభజన రాజకీయాల నుంచి దేశం బయటపడాలని సూచించారు. 

ఏపీలో అడుగుపెడతాం 
తెలుగు ప్రజలు బాగుండాలని తాము కోరుకుంటున్నామని కేసీఆర్‌ అన్నారు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలంటూ తమకు లక్షల సంఖ్యలో ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయన్నారు. దేశ రాజకీయాలను బాగుచేసుకొనే క్రమంలో.. తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే తప్పకుండా తాము ఏపీలో కూడా అడుగు పెడతామని స్పష్టం చేశారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారని, అలాంటిది తాను అక్కడికి వెళ్లి పనిచేయొద్దా? అని వ్యాఖ్యానించారు. ‘చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్‌కు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వాలి కదా. లేకపోతే తెలంగాణ ప్రజలు సంస్కార హీనులు అనుకుంటారు’అని బాబుకు చురకలంటించారు. తాను ఇవ్వబోయే బహుమతి ప్రభావం ఎలా ఉంటుందో మీరే చూస్తారు అంటూ భవిష్యత్‌ లక్ష్యాలను చెప్పకనే చెప్పారు. ఏపీలో బాబు పరిస్థితి సరిగా లేదని.. ఆయనకు పైత్యం ఎక్కువని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు గతంలో హద్దులు లేకుండా పొగిడారని, అతిగా పొగిడే క్రమంలో ఆయన బోల్తా పడ్డారన్నారు. ‘నీతి ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు, ఇతర సీఎంలతోపాటు నేను పాల్గొన్నాను. ఆ సమావేశంలో మోదీని ఎక్కువగా పొగిడే ప్రయత్నంలో.. ఏదేదో మాట్లాడి చంద్రబాబు పరువుపోగొట్టుకున్నారు. ఒక సీఎం ప్రధానమంత్రి అయ్యారంటూ బాబు వ్యాఖ్యానించారు. ఈ మాటలకు అప్పుడు అఖిలేష్‌ యాదవ్‌ వంటి వారు కూడా నవ్వుకున్నారు’అని కేసీఆర్‌ చెప్పారు. సీఎం ఎక్కడ కూర్చుంటే అదే సచివాలయమని.. ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

హైదరాబాద్‌ నుంచే.. 
కుల, మత గొడవలతోనే దేశంలో రాజకీయాలు జరుగుతున్నాయని.. ఈ పరిస్థితి కారణంగానే ప్రపంచంలోని ఇతర దేశాలకు మనం చులకనైపోతున్నామన్నారు. ‘భారతదేశ జనాభా 130 కోట్లు ఉన్నందున.. తమకేమైనా ఇబ్బంది ఉంటుందేమోనన్న అనుమానంతో చైనా ఓ అధ్యయనం చేయించింది. ఓ బృందం మూడు నెలల్లో సర్వే చేసి.. చైనా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. భారత్‌లో కులాలు మతాలతో కొట్టుకు చస్తున్నారని, ఇక వాళ్లు మనల్ని ఏం చేయగలరని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఇదీ మన దేశ దుస్థితి’అని కేసీఆర్‌ వెల్లడించారు. ‘హైదరాబాద్‌ నుంచే జాతీయ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటా. ఇక్కడి నుంచి దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా పెద్ద సమస్య కాదు. రాష్ట్రాల్లో ఢిల్లీ పెత్తనం ఎందుకుండాలి? విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాలను రాష్ట్రాలకు వదిలేయకుండా కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోంది. పాకిస్తాన్‌ సమస్యను పరిష్కరించే తెలివి లేదు గానీ.. రాష్ట్రాలపై పెత్తనమా? ఎన్నికలు దగ్గర పడుతున్నందున సర్జికల్‌ స్రైక్‌లు, రామమందిర నిర్మాణం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. అలా ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ వేదికగా దేశ రాజకీయాలను మార్చాల్సిన అవసరముంది’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘ఆర్బీఐ వద్ద 8, 9 లక్షల కోట్ల రూపాయలున్నాయి. నిల్వగా రెండు, మూడు లక్షల కోట్లు సరిపోతుంది. కానీ అంతంత నిల్వ ఉంచుకొని దేశాభివృద్ధికి ఏమీ చేయడంలేదు. వనరులను చేతిలో ఉంచుకొని పట్టించుకోవడంలేదు’అని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement