
ఈసారి సత్తుపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితి నెలకొంది.
సాక్షి, ఖమ్మం : ఈసారి సత్తుపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో చిత్ర విచిత్రమైన పరిస్థితి నెలకొంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కొలికపోగు స్వామికి 7,345 ఓట్లు వచ్చాయి. ఇవన్నీ టీఆర్‌ఎస్ కారు గుర్తుకు పడాల్సిన ఓట్లేనని.. ఓటర్లు తికమకపడటంతో ట్రక్కు గుర్తుకు పడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ప్రతి రౌండ్‌లోనూ కనీసం 300లకు తగ్గకుండా 500 లోపు ఓట్లు రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. 9వ రౌండ్‌లో కారు గుర్తుకు 638 మెజార్టీ రాగా ట్రక్కు గుర్తుకు 454 ఓట్లు, 10వ రౌండ్‌లో కారుకు 624 ఓట్లు మెజార్టీ, ట్రక్కుకు 614 ఓట్లు, 11వ రౌండ్‌లో కారుకు 1,029 ఓట్లు మెజార్టీ రాగా ట్రక్కుకు 462 ఓట్లు రావటం విశేషం.
9 మందికి డిపాజిట్ దక్కలేదు..
సత్తుపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 2,22,711 ఓట్లకు గాను 1,96,740 ఓట్లు పోల్ అయ్యాయి. 1,450 మంది పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకున్నారు. వీటిలో 96 ఓట్లు పోస్టల్ బ్యాలెట్లు చెల్లలేదు. సండ్ర వెంకటవీరయ్యకు 1,00,044 ఓట్లు, పిడమర్తి రవికి 81,042 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి కొలికపోగు స్వామికి 7,345 ఓట్లు, బీజేపీ అభ్యర్థి నంబూరి రామలింగేశ్వరరావు 1,380 ఓట్లు, బీఎల్‌ఎఫ్ అభ్యర్థి మాచర్ల భారతికి 2,670 ఓట్లు వచ్చాయి. మిగిలిన అభ్యర్థులు తక్కువ ఓట్లతోనే సరిపుచ్చుకోవాల్సి వచ్చింది.