సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ చవిచూడని పరిస్థితి ఈ మారు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలు చవిచూశాయి. గత 66 ఏళ్ల చరిత్రలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క సభ్యుడినైనా చట్టసభకు పంపుకోలేని దుస్థితిలో అవి పడ్డాయి.దీంతో తొలిసారిగా వామపక్షపార్టీల గళం వినిపించని కొత్త శాసనసభ ఏర్పడబోతోంది. 2014లో జరిగిన ఏపీ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టుపార్టీలు ఖాతా తెరవకపోవడంతో ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల శాసనసభల్లో ఈ పార్టీలకు ఉనికి లేకుండా పోయింది.
పొత్తుల ఎత్తుల్లో ఏదోలా లబ్ధి...
వామ పక్షాలు మారిన రాజకీయ ఎత్తుగడలకు అనుగుణంగా వివిధ పార్టీలతో పొత్తులు కుదుర్చుకొని ఎన్నికలకు దిగినప్పుడు కాస్తా లాభపడ్డాయి. ఒకసారి టీడీపీతో మరోసారి కాంగ్రెస్‌తో, ఇంకోమారు టీడీపీ, టీఆర్‌ఎస్‌లతో ఇలా రాష్ట్రంలో ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో ఉభయ కమ్యూనిస్టుపార్టీలు గతంలో పొత్తులు కుదుర్చుకున్నాయి. అందుకు భిన్నంగా ఈ సారి తెలంగాణలో సీపీఐ ఏకంగా కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లతో సీట్ల సర్దుబాటు చేసుకుంది. సీపీఎం మాత్రం విడిగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్‌తో కలిసి పోటీచేయడం ద్వారా రాష్ట్రంలో కొత్త ప్రయోగానికి తెరతీయాలని ప్రయత్నించింది.
1983 నుంచి మారిన పరిస్థితి...
1983 ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టుపార్టీలతో టీడీపీ సీట్ల సర్దుబాటు ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 28చోట్ల పోటీచేసిన సీపీఎం ఐదుచోట్ల, 48 స్థానాల్లో పోటీచేసిన సీపీఐ నాలుగుస్థానాల్లో గెలిచాయి. 1985 మధ్యంతర ఎన్నికల్లో సీపీఐ,సీపీఎం, మరోవైపు జనతాపార్టీ, బీజేపీలతో టీడీపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలు చెరో 11 స్థానాలు దక్కించుకున్నాయి. 1989లో టీడీపీ పొత్తుతో సీపీఎం ఆరు, సీపీఐ ఐదు సీట్లలో గెలుపొందాయి. 1994లో టీడీపీతో పొత్తులో సీపీఐ 19, సీపీఎం 15 సీట్లు గెలిచాయి. 1999లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీచేసినపుడు సీపీఎంకు రెండుసీట్లు దక్కగా సీపీఐకి ఒక్కసీటుకూడా రాలేదు. మళ్లీ 2004లో కాంగ్రెస్‌తో పొత్తులో సీపీఎం 9, సీపీఐ 6 స్థానాల్లో గెలిచాయి. మళ్లీ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు కుదుర్చుకున్నపుడు సీపీఐ 4 స్థానాలు, సీపీఎం ఒక సీటు గెలిచాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లో వామపక్షాలు చెరోస్థానానికే పరిమితమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment