కాంగ్రెస్‌కు దాసోహమంటారా? | Cpi party was in favour of alliances mahakutami | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు దాసోహమంటారా?

Published Tue, Dec 25 2018 5:29 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Cpi party was in favour of alliances mahakutami - Sakshi

చాడ వెంకటరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ కూటమిలో భాగంగా కేవలం మూడు సీట్లకే పరిమితమై పోటీచేయడం పార్టీ బలాన్ని ప్రతిబింబించలేదని సోమవారం సీపీఐ కౌన్సిల్‌ భేటీలో పలువురు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ కూటమిలో చేరడం తప్ప గత్యంతరం లేదన్న విధంగా నాయకత్వం తొందరపాటుగా వ్యవహరించడం వల్ల నష్టం జరిగిందని కొందరు నాయకులు అభిప్రాయపడినట్టు తెలిసింది.

పొత్తులో మూడుసీట్లకే పరిమితం కాకుండా పార్టీకి బలమున్న 20–25 సీట్లలో సొంతంగా పోటీచేసి ఉంటే పార్టీ విస్తరణకు అవకాశముండేదని అన్నట్టుగా సమాచారం. రాష్ట్ర పార్టీకి నాయకత్వం వహించే కార్యదర్శి ఎన్నికల బరిలో దిగడం, తాను పోటీచేస్తున్న సీటుకే పరిమితం కావడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌తో పొత్తు పార్టీకి నష్టం కలిగించినందున భవిష్యత్‌లో సొంత బలం పెంచుకుని, తదనుగుణంగా సొంతంగా పోటీకి సిద్ధం కావాలనే సూచనలొచ్చాయి.

స్థానిక ఎన్నికలతోసహా లోక్‌సభ ఎన్నికల వరకు ఇదే వైఖరితో ముందుకు సాగాలని నిర్ణయించారు. ఆదివారం మొదట రాష్ట్ర కార్యదర్శివర్గ భేటీలో, ఆ తర్వాత రాత్రి పొద్దుపోయేవరకు జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల్లో ఓటమి, కేవలం మూడుసీట్లలోనే పోటీ, కాంగ్రెస్‌కు దాసోహమన్నట్టుగా నాయకత్వం వ్యవహరించిన తీరుపై కొందరు నాయకులు తీవ్ర విమర్శలు సంధించారు. దీంతో మనస్తాపం చెందిన చాడ వెంకటరెడ్డి తనపదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇదే సందర్భంలో చాడతోపాటు కూనంనేని, తదితరులు కూడా రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. ఆ తర్వాత మొత్తం కార్యవర్గం రాజీనామాలు వద్దంటూ సర్దిచెప్పింది. ఈ రాజీనామాల అంశాన్ని కార్యవర్గ భేటీకే పరిమితం చేసి, రాష్ట్ర సమితి సమావేశాల్లో ఈ అంశం చర్చకు రాకుండా చూడాలని నిర్ణయించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి కూడా ఓటమికి కుంగిపోవద్దని, పార్టీ నిర్మాణం, సొంతబలం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు.

తీర్మానాలు...
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు  కొనసాగించాలని సీపీఐ డిమాండ్‌ చేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా లెక్కల వివరాలు అందించకపోవడంవల్ల, కుంటిసాకులతో 34 శాతమున్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించడం బీసీలకు అన్యాయం చేయడమేనని పేర్కొంది. బీసీల హక్కులు అణగదొక్కే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గతంలో జారీచేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్‌.బాలమల్లేశ్‌ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష భేటీలో చర్చించాలని ప్రభుత్వాన్ని సీపీఐ డిమాండ్‌ చేసింది.  

స్థానిక ఎన్నికలకు సిద్ధంకండి: చాడ
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. త్వరలోనే జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలు మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ సహకార ఎన్నికలకు పార్టీని క్షేత్రస్థాయిలో సంసిద్ధం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పోటీచేసిన స్థానాలతో పాటు మిగతా చోట్ల గెలుపోటములకు కారణాలను అన్వేషిస్తూ సమీక్షలు నిర్వహించాలన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement